ఇక పరీక్షల కాలం మొదలైంది. గత రెండేళ్లుగా ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో.. వాయిదా పడుతుందో.. లేక రద్దు అవుతుందో? అన్న పరిస్థితి నుంచి ఎప్పటిలాగే షెడ్యూల్ ప్రకారం అన్నీ సజావుగా సాగుతున్నాయి. ఇప్పటికే అనేక పరీక్షల షెడ్యూల్ లు విడుదలయ్యాయి. జాతీయ స్థాయి ఎగ్జామ్స్ అయిన జేఈఈ, నీట్ తేదీలను ప్రకటించారు. తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ కు (TS Inter Exams) సంబంధించిన టైం టేబుల్ సైతం వచ్చేసింది. దీంతో ఎంసెట్ (TS EAMCET 2023) నిర్వహణపై సైతం ఉన్నత విద్యామండలి కార్యాచరణ ప్రారంభించింది. జేఈఈ తేదీలు కూడా రావడంతో ఇక ఎంసెట్ తేదీలను కూడా ప్రకటించాలని భావిస్తోంది. 2023 జనవరిలో పరీక్షల తేదీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చింది ఉన్నత విద్యామండలి.
ఈ మేరకు అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఎంసెట్ ఎగ్జామ్ మే రెండు లేదా మూడో వారంలో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్ ప్రిపేరేషన్ కోసం కనీసం 45 రోజుల గ్యాప్ ఉండేలా అధికారులు తేదీలను ప్రకటిస్తారు. అయితే.. ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ వరకు ఉంటాయి. దీంతో మేలో ఎంసెట్ ను నిర్వహించేందుకు వీలుగా తేదీలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
READ THIS: నీట్ 2023.. ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో తెలుసా!
ఏప్రిల్ లో టెన్త్ ఎగ్జామ్స్..
ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ న ఇంటన్ బోర్డ్ విడుదల చేయగా.. టెన్త్ ఎగ్జామ్స్ తేదీలు ఎప్పుడన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చిలోనే ముగియనుండగా.. ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ ఎగ్జామ్స్ ను ప్రారంభించాలని ఎస్సెస్సీ బోర్డు అధికారులు భావిస్తున్నారు. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ కు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ జీవో విడుదలైన తర్వాత టెన్త్ ఎగ్జామ్స్ టైం టేబుల్ ను విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.