తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం (2022 –- 23) ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడానికి విధి విధానాల రూపకల్పన, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయడంపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మార్చి 2న సాయంత్రం విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కమిటీ ఆదేశించింది. ఆంగ్ల మాధ్యమంలో చేరే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేలా పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్; ఉర్దూ, – ఆంగ్లం.. ఇలా ద్విభాష విధానంలో ప్రింట్ చేయాలని సూచించింది. ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను కమిటీ ఆదేశించింది. విద్యార్థులకు ఆంగ్లంలో ప్రత్యేక మెలకువలు నేర్పేందుకు అవసరమైతే టీ-శాట్ ఛానెళ్ల ద్వారా ప్రత్యేక పాఠాలను అందించాలని నిర్ణయించింది. మన ఊరు – మన బడి కార్యక్రమంలో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నందున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. 2023–24లో 9వ తరగతి, 2024–25లో 10వ తరగతికి ఆంగ్లమాధ్యమం అమలు చేస్తారు.
త్వరలో ఫీజులపై నిర్ణయం
ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. దీనిపై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది.