ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్( ITBP) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ITBP అధికారిక సైట్ recruitment.itbpolice.nic.in సందర్శించి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 23న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 287 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అర్హత, ఎంపిక ప్రక్రియ..
మొత్తం 287 పోస్టుల్లో విభాగాల వారీగా చూస్తే.. కానిస్టేబుల్ (టైలర్) 18 పోస్టులు, కానిస్టేబుల్ (గార్డినర్) 16 పోస్టులు, కానిస్టేబుల్ (కాబ్లర్) 31 పోస్టులు, కానిస్టేబుల్ (సఫాయి కరంచారి) 78 పోస్టులు, కానిస్టేబుల్ (వాషర్‌మన్) 89 పోస్టులు, కానిస్టేబుల్ (బార్బర్) 55 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అన్ని విభాగాలకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాసై ఉండాలి.
లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు కానిస్టేబుల్ (టైలర్, గార్డనర్ & కోబ్లర్) పోస్టులకు 18-23 సంవత్సరాలు, కానిస్టేబుల్ (సఫాయి కరంచారి, వాషర్‌మన్ మరియు బార్బర్) పోస్టులకు 18-25 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను .. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ మరియు డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు అండ్ మాజీ సైనికులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు recruitment.itbpolice.nic.in ను సందర్శించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఫిజికల్ మెజర్మెంట్స్ ఉండాలి.