రాష్ట్రంలో ముందుగా గ్రూప్ 1 పోస్టులు 503, గ్రూప్ 2లో 582 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే ఆయా శాఖల్లో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. వచ్చే వారంలో గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ తుది కసరత్తు చేస్తోంది. నియామకాల్లో పారదర్శకత కోసం ఇంటర్వ్యూలు ఎత్తివేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్1, గ్రూప్ 2, ఇతర గెజిటెట్ పోస్టుల నియామకాలు కేవలం రాత పరీక్షతోనే చేపడుతారు.
గతంలో గ్రూప్ –1 సెలెక్షన్స్.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో జరిగేది. దీంట్లో 900 మార్కులు రాత పరీక్షకు,100 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించేవారు. మొత్తం వెయ్యి మార్కులకు మెరిట్ లిస్టు రెడీ చేసేవారు. రెండు దశల్లో జరిగే గ్రూప్2 లో రాత పరీక్షకు 600, ఇంటర్వ్యూకు 75 మార్కులుండేవి. ప్రస్తుతం ఇంటర్య్వూలు ఎత్తేయడంతో గ్రూప్–1లో వంద, గ్రూప్ 2లో 75 మార్కులు కట్ అయ్యాయి.
ఆ మార్కులను రాత పరీక్షలో కలిపితే, మళ్లీ ఎగ్జామ్ ప్యాటర్న్మొత్తం మార్చాల్సి వస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎందులో మార్కులు పెంచాలనే గందరగోళంతో పాటు.. ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చే ప్రక్రియతో నోటిఫికేషన్ల ప్రక్రియ డిలే అవుతుందని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. అందుకే.. అలాంటి మార్పుల జోలికి వెళ్లకుండా పాత విధానంలోనే పరీక్ష నిర్వహణ ఉంటుందని చెబుతోంది. ఇంటర్వ్యూ మార్కులు తీసేస్తే ఉండే మార్కులను టోటల్ మార్కులుగా గుర్తించి.. అంతకే పరీక్ష నిర్వహించాలని డిసైడయింది. దీంతో 900 మార్కులతో గ్రూప్ 1, 600 మార్కులతో గ్రూప్ 2 పరీక్ష ఉంటుంది. అదే మేరకు నోటిఫికేషన్ రెడీ చేస్తున్నామని.. ముందుగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని టీఎస్పీఎస్సీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి. సిలబస్ లో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపాయి.