డీఎస్సీ అప్లికేషన్లు ఈ రోజు నుంచి మొదలవుతాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్ల లింక్ అందుబాటులో ఉంటుంది. వచ్చే నెల అక్టోబర్ 20వ తేదీ రాత్రి 11.59 వరకు అప్లికేషన్లు నమోదు చేసుకునే గడువు ఉంది. మొత్తం 5089 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలువడింది. కొత్త జిల్లాలు, రోస్టర్ ప్రకారం మొత్తం ఖాళీల్లో 51 శాతం మహిళలకే కేటాయించారు. విద్యాశాఖ వెల్లడించిన జాబితా ప్రకారం మొత్తం 5089 పోస్టుల్లో 2,598 మహిళలకు, 2,491 పురుషులకు దక్కనున్నాయి.
జనరల్ విభాగంలోనూ పురుషులతో మహిళలు పోటీపడతారు. ఫలితంగా 55-60% ఉద్యోగాలు వారు సొంతం చేసుకోనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 275 ఖాళీల్లో 135; నల్గొండలో 219లో 104; భువనగిరిలో 99కి 55; కరీంనగర్‌లో 99లో 44; జనగామలో 76కు 42; హనుమకొండలో 54లో 35, పెద్దపల్లిలో 43లో 32 ఉద్యోగాలు మహిళలకే దక్కనున్నాయి.
ఉదాహరణకు జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్‌ల ప్రకారం మొదటి పోస్టు ఓసీ మహిళకు, రెండో పోస్టు ఎస్సీ మహిళకు వెళ్తుంది. అక్కడ రెండు పోస్టులే ఉంటే ఆ రెండూ మహిళలకే దక్కుతాయి. తదుపరి రిక్రూట్‌మెంట్‌లో మరో రెండు పోస్టులు భర్తీ చేయదలిస్తే మూడో రోస్టర్ నుంచి లెక్క మొదలవుతుంది. దీంతో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య తక్కువ ఉన్న జిల్లాల్లో మహిళలకు ఎక్కువ పోస్టులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

- సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్‌జీటీ) 2,575
- స్కూల్ అసిస్టెంట్లు 1,739
- భాషా పండితులు 611
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు(పీఈటీ) 164
డీఎస్సీ అప్లికేషన్లు ఈ నెల 20(ఈ రోజు) మధ్యాహ్నం 12 గంటల నుంచి వచ్చే నెల 20 వరకు విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా www.schooledu.telangana.gov.in ఆన్లైన్లో సమర్పించాలి..
మొత్తం 2,575 ఎస్‌జీటీ పోస్టుల్లో దాదాపు 2 వేల వరకు తెలుగు మీడియంవే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 40 ఎస్‌జీటీ ఇంగ్లిష్ మీడియం ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లలో బయాలజీ, సాంఘికశాస్త్రం, తెలుగు సబ్జెక్టుల్లో ఎక్కువ ఉద్యోగాలున్నాయి.
- అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 36 కేటగిరీలు, జనగామలో 9 కేటగిరీల్లో ఖాళీలున్నాయి.
- ఈసారి కూడా ఉర్దూతోపాటు కన్నడం, తమిళం, మరాఠీ తదితర వాటిల్లో అధిక శాతం పోస్టులు భర్తీ కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈసారి మొత్తం 5,089 ఖాళీల్లో సుమారు 450 వరకు 2017 టీఆర్‌టీలో భర్తీకానివే క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఈసారీ అదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
- తొలిసారిగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తున్నారు.