పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ద్వారానే బాసర ట్రిపుల్ ఐటీ సీట్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాదికి పాలిసెట్ ద్వారానే ఆర్జీయూకేటీ అడ్మిషన్లు చేపట్టనుంది. అందుకే పాలిటెక్నిక్ ఎంట్రన్స్‌కు అప్లై చేసుకునే గడువును పొడిగించింది. కొత్త షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఎలాంటి ఫీజు చెల్లించే అవసరం లేకుండా ఈనెల 25 వరకు స్టూడెంట్లు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. రూ.100 ఫైన్‌తో ఈనెల 27వరకు, రూ.300 ఫైన్ తో జూన్ 30 వరకు అప్లై చేసుకోవాలని తుది గడువు విధించింది. బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం 1500 సీట్లు ఉన్నాయి.
ఏటా టెన్త్ మార్కుల ప్రాతిపదికన బాసర ట్రిపుల్ ఐటీ లో అడ్మిషన్లు చేపడుతారు. కరోనా తీవ్రత తో రెండేండ్లుగా టెన్త్ పరీక్షలు జరగడం లేదు. టెన్త్‌లో10 జీపీఏ గ్రేడ్ పాయింట్లు సాధించిన వారి సంఖ్య భారీగా ఉండటంతో ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు ఎలా చేపట్టాలనే మీమాంస మొదలైంది. నిరుడు టెన్త్ స్టూడెంట్లకు ఇంటర్నల్ మార్కులు, ఏజ్ల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టింది. దీంతో అడ్మిషన్ల ప్రాసెస్‌కు ఎక్కువ సమయం పట్టింది. దాదాపు రెండు నెలలు పట్టింది ఈసారి కూడా అటువంటి పరిస్థితే పునరావృతమైంది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వటంతో దాదాపు 2.10 లక్షల మంది విద్యార్థులకు టెన్ జీపీఏ వచ్చింది. అందుకే ఈసారి మార్కుల ద్వారా అడ్మిషన్లు చేపట్టకుండా పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా సీట్లను భర్తీ చేసేందుకు యూనివర్సిటీ మొగ్గు చూపింది.
పాలిసెట్ కు ఇప్పటికే 90 వేల మంది స్టూడెంట్లు దరఖాస్తు చేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కారణంగా పాలిసెట్‌కు ఈ ఏడాది మరో 40 వేల వరకు దరఖాస్తులు పెరిగే అవకాశముంది. పాలిసెట్‌లో ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లకు వేర్వేరుగా ర్యాంకులు ఇస్తారు. వాటిని యూనివర్సిటీకి అందించి.. వెయిటేజీని కలుపుకొని ట్రిపుల్ ఐటీ సీట్లను భర్తీ చేస్తారు.
