పోలీస్ ఉద్యోగాలంటే ప్రస్తుత యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటుండమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే తెలంగాణలో దాదాపు 20 వేల పోలీస్ ఉద్యగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగుతోంది. లక్షలాది మంది నిరుద్యోగులు ప్రిపరేషన్లో ముగినపోయారు. తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దాదాపు 6500 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల సీఎం జగన్ 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు ఆయన ఆదేశాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో డీజీపీ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం, డీజీపీల ప్రకటన నేపథ్యంలో నిరుద్యోగులు సైతం ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నారు.