గ్రూప్ 1 ప్రిలిమ్స్ (TSPSC Group 1) ఎగ్జామ్‌ను అక్టోబర్ లో… మెయిన్స్ ఎగ్జామ్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16వ తేదీన ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను భారీగా అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 503 పోస్టులకు 3.8 లక్షల మంది అభ్యర్థులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ నుంచి తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. మే 31వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది.
TSPSC Group 1 Prelims పరీక్షను జులై చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించాలని ముందుగా షెడ్యూలు చేసుకుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కు మరింత సమయం కావాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. స్టడీ మెటీరియల్ అందుబాటులో లేకపోవడం.. జులైలో బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, ఇతర పోటీ పరీక్షలు ఉండటం.. ఆగస్టులో ఎస్సై కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఉండటంతో ప్రిలిమ్స్‌ను కొంత ఆలస్యంగా నిర్వహించాలని అభ్యర్థులు టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో నాలుగు నెలల పాటు ప్రిపరేషన్ టైమ్ ఉండేలా టీఎస్పీఎస్సీ కొత్త ఎగ్జామ్ క్యాలెండర్ రూపొందించింది, దీని ప్రకారం అక్టోబర్ 16న ప్రిలిమినరీ, 2023 జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనుంది.