HomeLATESTకానిస్టేబుల్ పోస్టుల కు అప్లై చేయాలంటే.. ఇవి తెలుసుకొండి
కానిస్టేబుల్ పోస్టుల కు అప్లై చేయాలంటే.. ఇవి తెలుసుకొండి
తెలంగాణలో 16,614 పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్పీఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 16,027 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ లాంటి విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మే 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.tslprb.in వెబ్‌సైట్ చూడొచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు
1) కానిస్టేబుల్ పోస్టులు: 16027
2) సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు: 587
విభాగాల వారీగా ఖాళీలు:
1) సివిల్ కానిస్టేబుల్-4965,
2) ఏఆర్ కానిస్టేబుల్-4423,
3) ఎస్‌ఏఆర్ సీపీఎల్ కానిస్టేబుల్-100,
4) టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ -5010,
5) తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగం-390
6) డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగం-610,
7) జైల్ వార్డర్లు (మేల్)-136
8) జైల్ వార్డర్లు (ఫిమేల్)-10
9) ఐటీ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్గనేజేషన్ కానిస్టేబుల్-262,
10) కానిస్టేబుల్ (మెకానిక్ (మెన్))-21
11) కానిస్టేబుల్ (డ్రైవర్లు): 100
అర్హత
కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్ ఉద్యోగాలు…2022 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 22 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 2000 జులై 2 కంటే ముందు… 2004 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. రెండేళ్ల కాలంలో కనీసం 365 రోజులు విధులు నిర్వర్తించి, ఇప్పటికీ కొనసాగుతున్న హోంగార్డులైతే కనీసం 18 ఏళ్ల వయసు నిండి, 40 ఏళ్లు దాటకుండా ఉండాలి. మహిళా కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్), మహిళా వార్డర్లకు మరికొన్ని మినహాయింపులిచ్చారు. వితంతువులు, చట్టపరంగా భర్త నుంచి విడాకులు పొంది, మళ్లీ పెళ్లి చేసుకోని వారిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 18 ఏళ్లు నిండి, 40 ఏళ్లు మించకుండా ఉండాలి. మిగతా కులాల్లో 18-35 మధ్య వయసున్న వారు అర్హులు. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్.
ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమ్స్: పోలీసు నియామక ప్రక్రియలో ముందుగా ప్రిలిమ్స్ నిర్వహిస్తారు.
200 మార్కులకు నిర్వహించే ఈ రాత పరీక్షలో..
అర్థమెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ 100 మార్కులు,
జనరల్ స్టడీస్ 100 మార్కులు
నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/5 చొప్పున మార్కులు కోత విధిస్తారు.
ఇందులో కనీసం 30 శాతం మార్కులు సాధించిన వారికి ఈవెంట్స్‌కు అర్హులవుతారు.
వీరందరూ ఫిజికల్ ఎఫిషియన్సీ, దేహ దారుడ్య పరీక్షల్లో సత్తా చాటాలి.
వీటిలోనూ అర్హత పొందినవారు తుది రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది.
మెయిన్స్: కానిస్టేబుల్ మెయిన్స్‌లో 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. సమయం 3 గంటలు. ప్రిలిమినరీలో వచ్చిన అంశాల నుంచే ఫైనల్ రాతపరీక్షలోనూ ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకటే సిలబస్ ఉంటుంది.
సిలబస్
జనరల్ స్టడీస్
భారతదేశ చరిత్ర, భౌగోళికాంశాలు, ఆర్థికాంశాలు, రాజకీయాంశాలపై ప్రశ్నలుంటాయి. తెలంగాణ చరిత్ర, భౌగోళికాంశాలు, రాష్ట్ర అవతరణ, తెలంగాణ అమరుల చరిత్ర, సాయుధ కమిటీలు, నిజాం నవాబుల చరిత్ర, ఆర్థికాంశాలు, ప్రభుత్వ పథకాలు, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. శాస్త్రీయ, సాంకేతిక అంశాలు, కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. తెలుగు అకాడమీ 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలు చదివి నోట్స్ తయారు చేసుకుంటే మంచిది.
అర్థమెటిక్
ఈ విభాగం నుంచి శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం- పని, కాలం- దూరం, వ్యాపార భాగస్వామ్యం, వైశాల్యాలు, చుట్టుకొలత, ఘనపరిమాణం, క.సా.గు., గ.సా.భా. వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.ఈ అంశాలను గ్రూపులుగా విభజించి సన్నద్ధమైతే సులభంగా నేర్చుకోవచ్చు. డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ నుంచి 5 ప్రశ్నలు ఒకే పట్టిక లేదా వెన్‌చిత్రాలు, బార్‌చార్ట్, గ్రాఫ్‌ల మీద వస్తాయి. ఇచ్చిన, అందుబాటులో ఉన్న సమాచారం నుంచి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. సింప్లిఫికేషన్ తక్కువ సమయంలో పూర్తిచేసేలా షార్ట్‌కట్స్, మైండ్ కాల్‌క్యులేషన్ వాడాలి. మేథమేటిక్స్ అంశాల్లో మాత్రికలు, త్రికోణమితి, ఎత్తులు- దూరాలు, సర్డ్స్, ఇండిసెస్, ఆల్జీబ్రా అంశాలను చదవాలి.
రీజనింగ్
పోలీసుశాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో కేసులను విచారించే సమయంలో లాజికల్‌గా ఆలోచించాల్సి ఉంటుంది. నంబర్లు, లెటర్ల ఆధారంగా వచ్చే ప్రశ్నలను లాజికల్ రీజనింగ్‌గా పరిగణిస్తారు. సీటింగ్ అరేంజ్‌మెంట్, రక్తసంబంధాలు, దిక్కులు, పజిల్స్ వంటి అంశాలను అనలిటికల్ రీజనింగ్ అంశాలుగా పరిగణిస్తారు. బొమ్మల ఆధారంగా ప్రశ్నలు ఇస్తే నాన్ వెర్బల్ రీజనింగ్. సిరీస్ ప్రశ్నల్లో బొమ్మల మధ్య ఉండే సంబంధాన్ని బట్టి అదే తర్కం వాడుతూ సమాధానం గుర్తించాలి. సిలాజిజమ్, అసంప్షన్స్, ఇన్ఫరెన్సెస్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్, ఆర్గ్యుమెంట్స్, కన్‌క్లూజన్స్, కాజ్-ఎఫెక్ట్, అసర్షన్-రీజన్, డెసిషన్ మేకింగ్ వంటివి హైలెవల్ రీజనింగ్ అంశాల కిందకి వస్తాయి.
ఈవెంట్స్
పురుష అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగు పరీక్ష నిర్వహిస్తారు. దీనిని 7 నిమిషాల 15 సెకండ్లలో పూర్తిచేయాలి. ఎక్స్‌సర్వీస్‌మన్ కేటగిరీవారు 9 నిమిషాల 30 సెకండ్లలో పూర్తిచేయవచ్చు. మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు పరీక్ష ఉంటుంది. వారు 5 నిమిషాల 20 సెకండ్ల పూర్తి చేయాలి. లాంగ్ జంప్‌లో పురుషులు 4 మీటర్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు 3.50 మీటర్లు, మహిళలు 2.50 మీటర్లు కనీస దూరాన్ని దూకాలి. షార్ట్పుట్లో పురుషులు, ఎక్స్‌సర్వీస్‌మన్ 7.26 కేజీల బరువును 6 మీటర్ల దూరం విసరాలి. మహిళా అభ్యర్థులు 4 కేజీల బరువును 4 మీటర్లు విసరాల్సి ఉంటుంది.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
ఓసీ, బీసీ పురుష అభ్యర్థులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు, మహిళా అభ్యర్థులు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఎస్సీ, ఎస్టీ పురుష అభ్యర్థులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారంతా తుది రాతపరీక్ష రాయాల్సి ఉంటుంది.