HomeLATESTఎస్‌ఐ జాబ్ కొట్టాలంటే.. ఎగ్జామ్ ప్యాటర్న్.. సిలబస్.. ఈవెంట్స్..
ఎస్‌ఐ జాబ్ కొట్టాలంటే.. ఎగ్జామ్ ప్యాటర్న్.. సిలబస్.. ఈవెంట్స్..
పోలీస్ ఉద్యోగాలకు టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీసుశాఖతో పాటు మరో 3 విభాగాల్లో మొత్తం 16,614 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఇందులో 587 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఎస్సై జాబ్ కొట్టాలంటే ఉండాల్సిన అర్హతలు, ఎగ్జామ్ ప్యాటర్న్, ఈవెంట్స్, సిలబస్ గురించి తెలుసుకుందాం..
విభాగాల వారీగా ఖాళీలు
1) సివిల్ ఎస్‌ఐ: 414
2) ఏఆర్ ఎస్‌ఐ: 66
3) ఎస్‌ఏఆర్ సీపీఎల్: 5
4) టీఎస్‌ఎస్‌పీ ఎస్‌ఐ: 23
5) తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగం ఎస్‌ఐ: 12
6) డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ విభాగం-26
7) డిప్యూటీ జైలర్: 8
8) టెక్నికల్ ఎస్‌ఐ: 22
9) ఎస్‌ఐ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనేజేషన్ (మెన్): 3
10) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఫింగర్ ఫ్రింట్ బ్యూరో): 8
అర్హత
2022 జులై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 25 ఏళ్లు దాటకుండా ఉండాలి. అంటే 1997 జులై 2 కంటే ముందు, 2001 జులై 1 తర్వాత పుట్టి ఉండకూడదు. గరిష్ట వయోపరిమితిలో 3 ఏళ్ల సడలింపునిచ్చారు. సబ్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు కనీసం డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. పోలీస్ ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఎస్సై పోస్టులకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్
పోలీస్, ఫైర్, ఎస్పీఎఫ్, జైళ్లశాఖలో భర్తీ చేయనున్న పోస్టులకు మే2 నుంచి 20 వరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సై, తత్సమాన హోదా పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000.. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ www.tslprb.in సంప్రదించాలి.
ఈవెంట్స్
పురుష అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగు పరీక్ష నిర్వహిస్తారు. దీనిని 7 నిమిషాల 15 సెకండ్లలో పూర్తిచేయాలి. ఎక్స్‌సర్వీస్‌మన్ కేటగిరీవారు 9 నిమిషాల 30 సెకండ్లలో పూర్తిచేయవచ్చు. మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు పరీక్ష ఉంటుంది. వారు 5 నిమిషాల 20 సెకండ్ల పూర్తి చేయాలి. లాంగ్ జంప్‌లో పురుషులు 4 మీటర్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు 3.50 మీటర్లు, మహిళలు 2.50 మీటర్లు కనీస దూరాన్ని దూకాలి. షార్ట్పుట్లో పురుషులు, ఎక్స్‌సర్వీస్‌మన్ 7.26 కేజీల బరువును 6 మీటర్ల దూరం విసరాలి. మహిళా అభ్యర్థులు 4 కేజీల బరువును 4 మీటర్లు విసరాల్సి ఉంటుంది.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
ఓసీ, బీసీ పురుష అభ్యర్థులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు, మహిళా అభ్యర్థులు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఎస్సీ, ఎస్టీ పురుష అభ్యర్థులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారంతా తుది రాతపరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమ్స్
పోలీసు నియామక ప్రక్రియలో ముందుగా ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. 200 మార్కులకు నిర్వహించే ఈ రాతపరీక్షలో.. అర్థమెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీకి 100 మార్కులు, జనరల్ స్టడీస్‌కు 100 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/5 చొప్పున మార్కులు కోత విధిస్తారు. కనీసం 30శాతం మార్కులు సాధించినవారే తర్వాతి దశలోని.. ఫిజికల్ ఎఫిషియన్సీ, దేహ దారుడ్య పరీక్షలకు అర్హులు అవుతారు. వీటిలోనూ అర్హత పొందినవారు తుది రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది.
మెయిన్స్
సబ్‌ఇన్‌స్పెక్టర్ మెయిన్స్‌లో నాలుగు పేపర్లుంటాయి. మొదటి రెండు పేపర్లు ఇంగ్లిష్, తెలుగు/ఉర్దూ ఉంటాయి. ఇవి కేవలం క్వాలిఫయింగ్ పరీక్షలే. ఉద్యోగ నిర్వహణలో తెలుగు రాయడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన రెండు పేపర్లు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్‌స్టడీస్, చివరి రెండు పేపర్లు, ఈవెంట్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు. ఇందులో ఓసీ అభ్యర్థులు 40శాతం, బీసీలు 35శాతం, ఎస్సీ,ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మన్ అభ్యర్థులు 30శాతం కనీస మార్కులు సాధించాలి.
పేపర్ 1 ఇంగ్లిష్ 100 మార్కులు
పేపర్ 2 తెలుగు 200 మార్కులు
పేపర్ 3 అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 200 మార్కులు
పేపర్ 4 జనరల్ స్టడీస్ ( అబ్జెక్టివ్ ) 200 మార్కులు
సిలబస్
ఇంగ్లిష్
వృత్తిరీత్యా పై అధికారులకు సమాచారాన్ని చేరవేసే క్రమంలో మెయిల్స్, లెటర్లు (లేదా) వివిధ అప్లికేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థి ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. గ్రామర్, సెంటెన్స్ అరేంజ్‌మెంట్, ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, హెల్పింగ్ వెర్బ్స్, ఇంగ్లిష్ నుంచి తెలుగుకు; తెలుగు నుంచి ఇంగ్లిష్‌కు మార్చడం, ఒకాబులరీ వంటి వాటిపై ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ వార్తలు విని, వాటిని అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
తెలుగు
ఈ పేపర్లో తెలుగు భాషకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదు రాయడం, పంచనామా, పై అధికారులకు వివిధ కేసులకు సంబంధించిన నివేదికలను అందించడం పోలీసు వృత్తిలో భాగం కాబట్టి తెలుగు భాషపై అభ్యర్థుల కనీస అవగాహన పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో సంధులు, సమాసాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, ఖాళీలు పూరించడం, తప్పు పదాలను గుర్తించి, సరిచేయడం వంటివి వస్తాయి.
జనరల్ స్టడీస్
భారతదేశ చరిత్ర, భౌగోళికాంశాలు, ఆర్థికాంశాలు, రాజకీయాంశాలపై ప్రశ్నలుంటాయి. తెలంగాణ చరిత్ర, భౌగోళికాంశాలు, రాష్ట్ర అవతరణ, తెలంగాణ అమరుల చరిత్ర, సాయుధ కమిటీలు, నిజాం నవాబుల చరిత్ర, ఆర్థికాంశాలు, ప్రభుత్వ పథకాలు, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. శాస్త్రీయ, సాంకేతిక అంశాలు, కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. తెలుగు అకాడమీ 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలు చదివి నోట్స్ తయారు చేసుకుంటే మంచిది.
అర్థమెటిక్
ఈ విభాగం నుంచి శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం- పని, కాలం- దూరం, వ్యాపార భాగస్వామ్యం, వైశాల్యాలు, చుట్టుకొలత, ఘనపరిమాణం, క.సా.గు., గ.సా.భా. వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.ఈ అంశాలను గ్రూపులుగా విభజించి సన్నద్ధమైతే సులభంగా నేర్చుకోవచ్చు. డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ నుంచి 5 ప్రశ్నలు ఒకే పట్టిక లేదా వెన్‌చిత్రాలు, బార్‌చార్ట్, గ్రాఫ్‌ల మీద వస్తాయి. ఇచ్చిన, అందుబాటులో ఉన్న సమాచారం నుంచి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. సింప్లిఫికేషన్ తక్కువ సమయంలో పూర్తిచేసేలా షార్ట్‌కట్స్, మైండ్ కాల్‌క్యులేషన్ వాడాలి. మేథమేటిక్స్ అంశాల్లో మాత్రికలు, త్రికోణమితి, ఎత్తులు- దూరాలు, సర్డ్స్, ఇండిసెస్, ఆల్జీబ్రా అంశాలను చదవాలి.
రీజనింగ్
పోలీసుశాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో కేసులను విచారించే సమయంలో లాజికల్‌గా ఆలోచించాల్సి ఉంటుంది. నంబర్లు, లెటర్ల ఆధారంగా వచ్చే ప్రశ్నలను లాజికల్ రీజనింగ్‌గా పరిగణిస్తారు. సీటింగ్ అరేంజ్‌మెంట్, రక్తసంబంధాలు, దిక్కులు, పజిల్స్ వంటి అంశాలను అనలిటికల్ రీజనింగ్ అంశాలుగా పరిగణిస్తారు. బొమ్మల ఆధారంగా ప్రశ్నలు ఇస్తే నాన్ వెర్బల్ రీజనింగ్. సిరీస్ ప్రశ్నల్లో బొమ్మల మధ్య ఉండే సంబంధాన్ని బట్టి అదే తర్కం వాడుతూ సమాధానం గుర్తించాలి. సిలాజిజమ్, అసంప్షన్స్, ఇన్ఫరెన్సెస్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్, ఆర్గ్యుమెంట్స్, కన్‌క్లూజన్స్, కాజ్-ఎఫెక్ట్, అసర్షన్-రీజన్, డెసిషన్ మేకింగ్ వంటివి హైలెవల్ రీజనింగ్ అంశాల కిందకి వస్తాయి.