నల్లగొండలో
నల్లగొండలో మూడో రోజు మహిళా అభ్యర్థులకు పోలీస్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్స్ కు 1000 మంది హాజరుకావాల్సి ఉండగా 854 మంది హాజరయ్యారు. వీరిలో 589 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. అయితే.. అనర్హత సాధించిన వారిలో ఎక్కువ మంది లాంగ్ జంప్ వద్ద క్వాలిఫై కాలేకపోతున్నారు. గతంలో లాంగ్ జంప్ సమయంలో ముగ్గు పోసే వారని.. ఇప్పుడు తాడు పెట్టడంతో ఈ పరిస్థితి తలెత్తుతుందని అభ్యర్థులు చెబుతున్నారు. తాడు కాళ్లకు తగులుతుందేమోనన్న భయంతో దూకలేకపోతున్నమన్న వాదన కూడా ఉంది. అయితే.. అధికారులు మాత్రం తాడుతో సమస్య ఏం లేదని చెబుతున్నారు.
హనుమకొండలో
హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలోనూ పోలీస్ ఈవెంట్స్ లో భాగంగా నిన్న మహిళలకు నిర్వహించారు. మొత్తం 996 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా.. 855 హాజరయ్యారు. ఇందులో 606 అర్హత సాధించారు. ఎవరైనా ఈవెంట్స్ నిర్వహణలో అవకతకలకు పాల్పడితే చెస్ట్ నంబర్, బ్యాచ్ నంబర్, తేదీలను 9491089100, 9440795201 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ రంగనాధ్ సూచించారు.
ఖమ్మంలో
ఖమ్మంలోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న మహిళలకు నిన్న ఈవెంట్స్ నిర్వహించారు. ఈ వెంట్స్ కు 1103 మంది హాజరు కావాల్సి ఉండగా.. 936 మంది హాజరయ్యారు. వీరిలో 653 మంది అర్హత సాధించినట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు.
సంగారెడ్డిలో
సంగారెడ్డిలో శనివారం జరిగిన మూడో రోజు జరిగిన పోలీస్ ఈవెంట్స్ కు 709 మంది అభ్యర్థులకు గాను.. 620 మంది హాజరయ్యారు. ఇందులో 364 మంది అర్హత సాధించగా.. 256 మంది డిస్ క్వాలిఫై అయ్యారని ఎస్పీ రమణ కుమార్ తెలిపారు.
కరీంనగర్ లో
కరీంనగర్ కు సంబంధించి శనివారం నిర్వహించిన ఈవెంట్స్ కు 1,001 మందికి గాను.. 822 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో 51 మంది అనారోగ్యం, ఇతర కారణాలను చూపుతూ ధ్రువపత్రాలను సమర్పించారని వెల్లడించారు. వారికి ఇతర తేదీల్లో హాజరయ్యేందుకు అధికారులు అనుమతించారు. అయితే,, ఈవెంట్స్ లో ఎంత మంది అర్హత సాధించారన్న విషయం వెల్లడించలేదు. ఈవెంట్స్ సమయంలో కొందరు అభ్యర్థులు గాయపడగా.. వారిని సీపీ పరామర్శించి పలు సూచనలు చేశారు.
నిజామాబాద్ లో
నిజామాబాద్ కు సంబంధించి మూడోరోజు నిర్వహించిన ఈవెంట్స్ కు 1000 మందికి గాను.. 879 మంది మాత్రమే హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో 640 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు చెప్పారు. అయితే.. ఇక్కడ కొందరు అభ్యర్థులు ఎత్తులో అర్హత సాధించకపోవడంతో వెనుదిరిగినట్లు సమాచారం. మరికొందరు రన్నింగ్ లో అర్హత సాధించినా.. హై జంప్ లో డిస్ క్వాలిఫై అయ్యారు.
ఆదిలాబాద్ లో
ఆదిలాబాద్ లోనూ శనివారం మహిళా అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించారు. ఇందులో 873 మందికి గాను.. 734 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో 482 మంది తది పరీక్షకు అర్హత సాధించారు. ఈ జిల్లాలో పురుషుల సంఖ్యతో పోల్చితే మహిళా అభ్యర్థులే అధిక సంఖ్యలో అర్హత సాధించడం సంతోషం కలిగించే అంశమని ఎస్పీ చెప్పారు.