మొత్తం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటన మేరకు రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. నిత్యం నోటిఫికేషన్ల (Telangana Job Notifications) విడుదలతో నిరుద్యోగ వర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే.. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మరిన్ని కొత్త ఉద్యోగాలకు ఆమోదం లభించింది. మొత్తం 7029 ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో పోలీస్ శాఖలో (TS Police Jobs) 3966, ఆర్&బీలో 472 అదనపు పోస్టుల నియామకానికి అనుమతి లభించింది. ఇంకా.. మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మరో 2591 నూతన ఉద్యోగాల నియామకాలకు ఆమోదం లభించింది.
ఇటీవల గ్రూప్-4 తో, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. గురుకులాల్లో 9 వేలకు పైగా నియామకాలకు సంబంధించి ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ ఖాళీలతో పాటే.. ఈ రోజు ఆమోదం లభించిన బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మరో 2591 ఖాళీల భర్తీకి సైతం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో దాదాపు మరో పది వేలకు పైగా ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ రావొచ్చని అధికార వర్గాల నుంచి సమాచారం.