గతంలో తమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసి డిగ్రీ పట్టా పొందే అవకాశాన్ని కల్పించింది. వారు పరీక్షలు రాసుకునేందుకు వన్ టైం ఛాన్స్ ను కల్పిస్తున్నట్లు ఓయూ ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు అకడమిక్ స్టాండింగ్ కమిటీ విద్యార్థులకు వన్ టైం చాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం ప్రకటన విడుదల చేసింది.
ఓయూ పరిధిలో 2010 నుంచి 2017 విద్యా సంవత్సరం వరకు వివిధ కోర్సులు చదివి ఫెయిల్ అయిన వారికి ఈ అవకాశం ఉంటుందని తెలిపింది. ఆయా విద్యార్థులు పేపర్ కు రూ.10 వేల చొప్పున అపరాధ రుసుము చెల్లించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంఈ, ఎంటెక్, ప్రాజెక్టు, వైవాకు రూ.20 వేలను చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ https://www.osmania.ac.in/ ను సందర్శించాలని ప్రకటనలో సూచించారు అధికారులు.