తెలంగాణలో పోలీస్ నియామకాలకు (TSLPRB Jobs) సంబంధించి ఇప్పటికే.. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇప్పటికే అందుకు సంబంధించిన ఫలితాలను సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఈవెంట్స్ నిర్వహణపై దృష్టి సారించింది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈవెంట్స్ ను ప్రారంభించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే.. డిసెంబర్ రెండో వారం నుంచి ఈవెంట్స్ ప్రక్రియ ప్రారంభించాలని బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈవెంట్స్ ప్రారంభమైన తర్వాత 25 వర్కింగ్ డేస్ లో ఈ ప్రక్రియ అంతా ముగించాలని బోర్డు యోచిస్తోంది. జనవరి రెండో వారంలో ఈవెంట్స్ ప్రక్రియను ముగించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భావిస్తోంది. అయితే.. ఈ శారీరక పరీక్షలు పూర్తయిన 45 రోజుల తర్వాత తుది రాత పరీక్షను నిర్వహించనున్నారు.
అంటే.. మార్చి మూడో వారంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలను వారం రోజుల తేడాతో నిర్వహించనున్నట్లు సమాచారం. పరీక్ష పూర్తయిన తర్వాత ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేయాలని బోర్డు కసరత్తు చేస్తోంది. ఫలితాల తర్వాత మెడికల్ టెస్టులు ఉంటాయి. అనంతరం ట్రైనింగ్ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఎస్ఐ అభ్యర్థుల్లో 46.8%, కానిస్టేబుల్ అభ్యర్థుల్లో 39.96% మంది ఈవెంట్స్ కు అర్హత సాధించారు. తాజాగా అర్హత సాధించినవారితో పాటు, ప్రాథమిక రాతపరీక్ష అవసరం లేని ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలోని 33 ఎస్సై, 383 కానిస్టేబుల్, 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల అభ్యర్థులూ ఫిజికల్ టెస్టుల్లో పాల్గొననున్నారు.