అంతర్జాతీయం
స్వలింగ వివాహం చట్టబద్ధమే
యూరప్‌లోని ఎస్టోనియా దేశం కీలక నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహానికి అనుమతినిచ్చేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును చట్టసభ ఆమోదించింది. జనవరి 1 నుంచి ఎస్టోనియాలో స్వలింగ వివాహం అమల్లోకి రానుంది.
న్యూయార్క్‌లో దీపావళికి సెలవు
న్యూయార్క్ నగరంలో పాఠశాలలకు ఈ ఏడాది నుంచి దీపావళి రోజున సెలవు ఇవ్వనున్నారు. రెండు దశాబ్దాలుగా దక్షిణాసియా, ఇండో-–కరీబియన్ ప్రజలు దీని కోసం పోరాడుతున్నారు. అసెంబ్లీ, సెనెట్‌ట్లో పాసైన ప్రస్తుత బిల్లును గవర్నర్ ఆమోదించాల్సి ఉంది.
వీసాదారులకు కెనడా గుడ్‌న్యూస్
అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10వేల మంది హెచ్-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఓపెన్ వర్క్-పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్ వెల్లడించారు.
నాటో అధిపతి స్టోల్టెన్‌బెర్గ్
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బెర్గ్ పదవీ కాలాన్ని పొడిగించాలని 31 సభ్య దేశాలు నిర్ణయించాయి. ఆయన 2024 అక్టోబరు 1 వరకు ఆ పదవిలో ఉంటారు. నార్వే మాజీ ప్రధాని అయిన స్టోల్టెన్ బెర్గ్ 2014 నుంచి నాటో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ట్విటర్‌కు పోటీగా ‘థ్రెడ్’
ట్విటర్ కు పోటీగా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ‘థ్రెడ్’ పేరుతో ట్విటర్ తరహా మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ యాప్ విడుదల చేశారు. యాప్ వివరాలు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి.
మహిళా బ్యూటీ సెలూన్లపై నిషేధం
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని మహిళా బ్యూటీ సెలూన్‌లపై తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని మంత్రి మహ్మద్ అకిఫ్ మహజర్ ప్రకటించారు. ఈ మేరకు కాబుల్ మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేశారు.
మిస్ నెదర్లాండ్స్‌గా ట్రాన్స్‌జెండర్
మిస్ నెదర్లాండ్స్ కిరీటాన్ని ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ రిక్కీ వలేరి కొల్లే గెలుచుకుంది. అందగత్తెల పోటీలో ట్రాన్స్‌జెండర్ మహిళ ఈ ఘనత సాధించడం నెదర్లాండ్స్‌లో ఇదే మొదటిసారి. 22 ఏళ్ల రిక్కీ వలేరి కొల్లే ప్రముఖ మోడల్స్ నుంచి ఎదురైన పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచింది.
నాటోలోకి స్వీడన్
నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా స్వీడన్ అడుగు పెట్టనుంది. ఇన్నాళ్లూ ఆ దేశ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న టర్కీ, హంగరీలు మనసు మార్చుకున్నాయి. ఎఫ్-16 విమానాల అందజేత, ఐరోపా సమాజంలో టర్కీకి సభ్యత్వంపై జో బైడెన్ నుంచి మద్దతు లభించింది.
యునెస్కోలోకి అమెరికా
ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)కు దాదాపు ఐదేళ్లు దూరంగా ఉన్న అమెరికా సభ్యత్వం తీసుకుంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా యునెస్కో నుంచి వైదొలగింది. పారిస్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో అమెరికా మళ్లీ చేరేందుకు గత వారం పాలక మండలి ఆమోదం తెలిపింది.
పాస్‌పోర్టు ర్యాంకింగ్
‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్-2023’ తాజాగా శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. ఇందులో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోస్టుతో ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో పర్యటించవచ్చు. భారత్ 80వ స్థానానికి చేరుకుంది.
జూన్‌లో రికార్డు ఉష్ణోగ్రత
గడిచిన 174 సంవత్సరాలలో ఏ జూన్ మాసంలోనూ రికార్డు కానంత ఉష్ణోగ్రత ఈ ఏడాది జూన్ నెలలో నమోదైందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిశోధన సంస్థ (ఎన్‌ఓఏఏ), నాసా ప్రకటించాయి. 20వ శతాబ్దిలో భూమిపై సగటు ఉష్ణోగ్రత 15.5 సెల్సియస్ డిగ్రీలు కాగా, ఈ జూన్‌లో దానికన్నా 1.05 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
గిల్గిత్ బాల్తిస్థాన్ సీఎంగా గుల్బర్‌ఖాన్
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి దూరమైన గుల్బర్‌ఖాన్ గిల్గిత్ బాల్తిస్థాన్ ప్రాంత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్న పీటీఐ సభ్యుడు ఖాలిద్ ఖుర్షీద్‌ఖాన్‌పై అనర్హత వేటు పడింది.
కంబోడియా ప్రధానిగా హన్‌మానెట్
కంబోడియా ఎన్నికల్లో విజయం సాధించిన కంబోడియన్ పీపుల్స్ పార్టీ హన్‌మానెట్‌ను భావి ప్రధానమంత్రిగా ఎంపిక చేయించారు.దశాబ్దాలుగా దేశాన్ని ఏకఛతాధిపత్యంగా పాలిస్తున్న పీపుల్స్ పార్టీకి తాజా ఎన్నికల్లో పేరుకే 17 ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ ఎదురైంది.
అమెరికా నేవీకి మహిళా అధిపతి
మహిళా అధికారి అడ్మిరల్ లీసా ఫ్రాంచెటీని అమెరికా నౌకాదళాధిపతిగా ఎంపిక చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సెనేట్ ఆమోదముద్ర వేస్తే అమెరికా మిలటరీ సర్వీసు చీఫ్‌గా ఒక మహిళ నియమితులు కావడం ఇదే మొదటిసారి అవుతుంది.
వియత్నాంకు ఐఎన్‌ఎస్ కృపాణ్ యుద్ధనౌక
భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలందించిన ‘ఐఎన్‌ఎస్ కృపాణ్’ యుద్ధనౌకను వియత్నాంకి గిఫ్ట్గా భారతదేశం అందజేసింది. వియత్నాం పర్యటనలో ఉన్న భారత నౌకాదళం అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఈ యుద్ధనౌకను ‘వియత్నాం పీపుల్స్ నేవీ’కి అప్పగించారు.
ట్విటర్‌కు కొత్త లోగో
ట్విటర్ లోగో అయిన బ్లూ పక్షి స్థానంలో, నలుపు రంగు బ్యాక్‌గ్రౌండ్‌లో తెలుపు రంగు ‘ఎక్స్’ గుర్తుతో కొత్త లోగోను సంస్థ అధిపతి ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. ఈ డిజైన్‌ను శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంపై ప్రొజెక్ట్ చేశారు.
ఫెడ్ వడ్డీ రేటు 0.25% పెంపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును మరో 0.25 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ రేటు 5.25-–5.50 శాతానికి పెరిగింది. 2001 తర్వాత అమెరికాలో ఇవే అత్యధిక వడ్డీ రేట్లు. జూన్‌లో ద్రవ్యోల్బణం 3 శాతంగా నమోదైంది. ఫెడ్ లక్ష్యమైన 2% కంటే అధికంగా ఉండడం, ఉద్యోగ వృద్ధి బలంగా కొనసాగుతున్నందున, వడ్డీ రేట్ల పెంపునకే ఫెడ్ ఈసారి మొగ్గు చూపింది.
నైగర్‌లో సైన్యం తిరుగుబాటు
పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌లో అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఇప్పటికే అధ్యక్షుడి నివాసాన్ని ప్రెసిడెన్షియల్ గార్డు సభ్యులు చుట్టుముట్టారు. బజౌమ్, ఆయన కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని పడగొట్టినట్లు సైన్యం ప్రకటించింది.
సింగపూర్‌లో తొలిసారి మహిళకు ఉరిశిక్ష
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఓ మహిళను సింగపూర్ ఉరి తీసింది. మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం 20 ఏళ్లలో ఇది తొలిసారి. సారిదేవి దామని 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరి శిక్ష విధించారు.
జాతీయం
స్పార్క్ ర్యాంకుల్లో మెప్మా టాప్
జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ (ఎన్‌యూఎల్‌ఎమ్) ప్రకటించిన సిస్టమాటిక్ ప్రొగ్రెసివ్ అండ్ రియల్ టైం ర్యాంకింగ్ (స్పార్క్)లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచింది. కేరళలో నిర్వహించిన కార్యక్రమంలో మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి అందుకున్నారు.
పశుగణం ఎగుమతుల ముసాయిదా బిల్లు
జంతువుల ఎగుమతులను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా జూన్ 7న వెలువరించిన ‘పశుగణం, పశుగణ ఉత్పత్తుల (దిగుమతి, ఎగుమతి) ముసాయిదా బిల్లు’ను కేంద్రం ఉపసంహరించుకుంది. జంతు హక్కుల ఉద్యమ సంస్థలు ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
మతమార్పిడి నిషేధ చట్టం రద్దు
మతమార్పిడి నిషేధ చట్టాన్ని రద్దు చేస్తామని కర్ణాటక కొత్త ప్రభుత్వం తీర్మానించింది. ఈ చట్టంతో పాటు పాఠ్య పుస్తకాల నుంచి ఆర్‌ఎస్‌ఎస్ నేతలు సావర్కర్, హెడ్గేవార్ జీవిత చరిత్ర అంశాలను తొలగించాలని ప్రభుత్వం తీర్మానించింది.
సరిహద్దు గ్రామాలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లను రాష్ట్రంలోని 75 సరిహద్దు గ్రామాలకు పెట్టాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది.
ఎలిఫెంట్ విస్పరర్స్‌కు పర్యావరణ పురస్కారం
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఉత్తమ లఘుచిత్ర డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ దర్శకురాలు కార్తీకీ గోన్ సాల్వెస్‌కు ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ సంస్థ అందించే పర్యావరణ పురస్కారం లభించింది. తారా అవార్డును బ్రిటన్ రాజు మూడో ఛార్లెస్, రాణి కెమీలియా ప్రదానం చేశారు.
సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా
తుషార్ మెహతా భారత సొలిసిటర్ జనరల్‌గా మళ్లీ నియమితులయ్యారు.2018 అక్టోబర్ 10న మొదటిసారిగా సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన తుషార్ మెహతా పదవీ కాలాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. 2026 జూన్ 30వ తేదీ వరకు సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా ఉంటారు
వెర్సోవా – బాంద్రా సీ లింక్‌కు సావర్కర్ పేరు
మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ శిండే ప్రభుత్వం వెర్సోవా – బాంద్రా సీ లింక్‌కు వీడీ సావర్కర్ సేతుగా పేరు పెట్టింది. ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్‌కు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరును ఖరారు చేసింది. 17 కి.మీ.ల ఈ వంతెన అంధేరీని బాంద్రా – వర్లి సీ లింక్‌తో అనుసంధానం చేయనుంది.
ఎన్‌ఎండీసికి రెండు అవార్డులు
నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ)కి ‘మినరల్ డెవలప్‌మెంట్ అవార్డు’, ‘ఎంప్లాయర్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులు వరించాయి. కోల్‌కతాలో నిర్వహించిన అసోచామ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023లో వీటిని అందజేశారు.
భారత్‌లో తగ్గిన పేదరికం
గత 15 సంవత్సరాల్లో 41.4 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్‌డీపీ) యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి గ్లోబల్ మల్టిడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపీఐ) నివేదిక తెలిపింది. శిశు మరణాలు 4.5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గిపోయాయని పేర్కొంది.
సుప్రీంకోర్టుకు జస్టిస్ భూయాన్, జస్టిస్ భట్
ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇందులో ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్ ఉన్నారు.
ఫిర్యాదుల పరిష్కారంలో తెలంగాణ టాప్
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జూన్ నెలకు సంబంధించి తెలంగాణ టాప్లో నిలిచింది. 17,500 లోపు ఫిర్యాదులున్న రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ అత్యధికంగా (74.44%) పరిష్కరించిందని తెలిపింది. ఈ కేటగిరీ రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ 2, కేరళ 3వ ర్యాంకులో ఉన్నాయి.
గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
ఆహార పదార్థాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 4.81 శాతానికి పెరిగింది. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి. తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాల ధరలు పెరగడం ఇందుకు కారణమైంది. మే లో 4.31శాతం కాగా, 2022 జూన్‌లో 7 శాతంగా నమోదైంది.
ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను
ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, కేసినోల్లో పూర్తి పందెం విలువపై 28 శాతం పన్ను విధించాలని జీఎస్‌టీ మండలి 50వ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో పానీయాలు, ఆహార పదార్ధాలపై సేవా పన్నును 5 శాతానికి తగ్గించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్
ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయంను ‘సూరత్ డైమండ్ బోర్స్’ (ఎస్‌డీబీ) సంస్థ సూరత్‌లో నిర్మించింది. 65,000 మంది ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు వీలుగా 35 ఎకరాల్లో, 15 అంతస్తుల భవనాలతో దీన్ని నిర్మించారు. నవంబర్లో ప్రధాని మోడీ ఈ కార్యాలయం ప్రారంభించినున్నారు.
ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ మేటి ఆవిష్కరణ అయిన ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్’ (యూపీఐ) ఫ్రాన్స్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే భారత్–సింగపూర్ మధ్య యూపీఐ ద్వారా సీమాంతర చెల్లింపులకు ఒప్పందం కుదిరింది. గమనార్హం. యూఏఈ, భూటాన్, నేపాల్ సైతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థాను అనుమతించాయి.
స్థానిక భాషల్లో ఉన్నత విద్య
ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత నివ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ఈ నిర్ణ యం తీసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీతో ‘అనువాదిని’ అనే సాఫ్ట్‌వేర్‌తో డిగ్రీ, ఇంజనీరింగ్‌తో పాటు అన్ని రకాల ఉన్నత విద్య పాఠ్యపుస్తకాలను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో తర్జుమా చేయాలని నిర్ణయించింది.
దేశంలో తగ్గిన పేదరికం
2011తో పోల్చితే 2019లో భారత్లో పేదరికం 12.3 శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. 2011లో 22.5 శాతం ఉన్న పేదరికం 2019లో 10.2 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా గ్రామాల్లో పేదరికం 26.3 శాతం నుంచి 11.6 శాతానికి తగ్గిపోయింది. అర్బన్లో 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గిందని తెలిపింది.
దేశీయంగా హైడ్రాజిన్ హైడ్రేట్ ఉత్పత్తి
క్రిమి సంహారకాలు, వ్యవసాయ రసాయనాలు, నీటిశుద్ధి యంత్రాలు, ఫార్మాస్యూటికల్స్, పాలిమర్ పరిశ్రమల్లో ఏజెంట్‌గా ఉపయోగించే హైడ్రాజిన్ హైడ్రేట్ రసాయనం ఉత్పత్తి దేశీయంగా మొదలైంది. గతంలో భారత్ విదేశాల నుంచి దీన్ని దిగుమతి చేసుకునేది. హైడ్రాజిన్ హైడ్రేట్ సాంకేతికతను హైదరాబాద్‌లోని ఐఐసీటీ డెవలప్ చేసింది.
స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా–2023
జైపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీల్లో ‘స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా–2023’గా చంద్రగిరికి చెందిన ‘సంజన సంసర్వాల్’ మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకుంది. గ్రాండ్ ఫైనల్‌లో 47 మంది పాల్గొనగా సంజన మొదటి స్థానం దక్కించుకుంది.
అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు ఆమోదం
దేశ సరిహద్దులకు 100 కి.మీ.లోపు దూరంలో ఉన్న భూములను అటవీ సంరక్షణ చట్టాల పరిధి నుంచి మినహాయించడానికి, అటవీ భూముల్లో జంతు ప్రదర్శన శాలలు, సఫారీలు, ఎకో టూరిజం సదుపాయాలు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
భారత వృద్ధి 6.1శాతం
ఈ సంవత్సరం భారత వృద్ధి 6.1 శాతంగా నమోదు కావచ్చొని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఏప్రిల్‌లో అంచనా వేసిన దాని కంటే ఇది 0.2 శాతం ఎక్కువ. 2022 నాలుగో త్రైమాసికం నుంచి దేశీయంగా పెట్టుబడులు బలంగా పుంజుకోవడం ఇందుకు కారణమని ఐఎంఎఫ్ పేర్కొంది.
జనన, మరణ సవరణ బిల్లుకు ఆమోదం
జనన, మరణ నమోదు (సవరణ) బిల్లు – 2023ను లోక్‌సభ ఆమోదించింది. దీంతో విద్యా సంస్థల్లో ప్రవేశానికి, డ్రైవింగ్ లైసెన్స్ జారీకి, ఓటరు జాబితా తయారీకి, ఆధార్ నంబరు పొందడానికి, వివాహాన్ని నమోదు చేయించుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి ఒక్క జనన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది.
సామాజికాభివృద్ధి కమిషన్ అధ్యక్ష స్థానంలో భారత్
ఐక్యరాజ్యసమితిలో సామాజికాభివృద్ధి కమిషన్ 62వ సదస్సు అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న రుచిరా కాంభోజ్ ఆ బాధ్యతలను చేపట్టారు. 1975 తర్వాత సామాజికాభివృద్ధి కమిషన్ అధ్యక్ష పీఠాన్ని భారతదేశం అధిష్ఠించడం ఇదే తొలిసారి.
ప్రాంతీయం
కొత్త మండలంగా ‘బండలింగాపూర్’
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం నుంచి 10 గ్రామాలను వేరు చేసి బండలింగాపూర్ కేంద్రంగా కొత్త మండలాన్ని ప్రతిపాదిస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
సింగరేణి థర్మల్‌ప్లాంట్‌కు పురస్కారం
పర్యావరణహితంగా విద్యుదుత్పత్తి, గనుల తవ్వకం చేపడుతున్నందుకు సింగరేణి సంస్థకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. పీసీబీ హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఈ అవార్డును థర్మల్ ప్లాంటు ప్రధాన అధికారి విశ్వనాథ రాజుకు ప్రదానం చేశారు.
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు
భారతీయ జనతా పార్టీ తెలంగాణకు కొత్త అధ్యక్షుడిగా జి. కిషన్‌రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. తెలంగాణ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించింది.
రాచకొండలో ఆదిమానవుడి ఆనవాళ్లు
రాచకొండ గుట్టల్లో క్రీస్తు పూర్వం 50 వేల ఏళ్ల క్రితమే ఎగువ పాతరాతి యుగంలో ఆదిమానవుడు జీవించినట్లు ఆధారాలు వెలుగుచూశాయి. అప్పట్లో ఆదిమానవులు వేటకు ఉపయోగించిన చేతిగొడ్డలి లభించిందని తెలంగాణ చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు.
నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారం
కృష్ణమాచార్య జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏటా ‘దాశరథి కృష్ణమాచార్య’ పురస్కారం అందజేస్తోంది. 2023 సంవత్సరానికి కామారెడ్డికి చెందిన ప్రముఖ రచయిత, అష్టావధాని అయాచితం నటేశ్వరశర్మకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
సీజేగా జస్టిస్ అలోక్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ అరాధేను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.
తలసరి ఆదాయంలో టాప్
దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732, స్థిర ధరల ప్రకారం రూ.1,64,657 ఉంది.తాజా ధరల ప్రకారం తెలంగాణ దక్షిణాదిలో ప్రథమ స్థానంలో నిలిచినప్పటికీ, స్థిర ధరల కొలమానంలో మూడో స్థానంలో ఉంది.
ఎఫ్‌డీఐల్లో ఏడో స్థానం
గత మూడేళ్లలో దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచి, 2.47 శాతం వాటా కలిగి ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వస్తే ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు సర్కారీ ఉద్యోగులుగా మారతారు. వారికి ప్రభుత్వమే జీతభత్యాలు చెల్లించాలని నిర్ణయించింది.
వార్తల్లో వ్యక్తులు
బేతవోలు రామబ్రహ్మం
కవి, పండితుడు, విమర్శకుడిగా పేరొందిన ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మంకు ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కారం దక్కింది. కథలు, కవిత్వం, నాటకాలు కలిపి 34కు పైగా గ్రంథాలు రచించారు. సాహితీ వ్యాసాలు వెలువరించారు.
డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల
కోవిడ్-19 మహమ్మారి నుంచి మానవాళికి రక్షణగా నిలిచిన కొవాగ్జిన్ టీకా ఆవిష్కర్తలైన భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల దంపతులను జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రకటించింది.
జులన్ గోస్వామి
ప్రతిష్టాత్మక ఎంసీసీ ప్రపంచ క్రికెట్ కమిటీ (డబ్ల్యూసీసీ)లో భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామికి చోటు దక్కింది. జులన్‌తో పాటు ఇంగ్లాండ్ మహిళల కెప్టెన్ హెదర్ నైట్, 2019 వన్డే ప్రపంచకప్ చాంపియన్ జట్టు సారథి ఇయాన్ మోర్గాన్‌లకు ఎంసీసీ డబ్ల్యూసీసీలో స్థానం లభించింది.
ఆర్తి హోల్లా
భారత సంతతికి చెందిన బ్రిటన్ మహిళ శాటిలైట్ పరిశ్రమలో అత్యంత నిష్ణాతులైన ఆర్తి హోల్లా-మైనీని వియన్నాలోని ఐక్యరాజ్యసమితి (అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం) ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ డైరెక్టర్‌గా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ- జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎంపిక చేశారు.
భవాని దేవి
ఫెన్సర్ భవాని దేవి ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మొదటి భారత ఫెన్సర్‌గా భవాని నిలిచింది. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల సాబెర్ విభాగంలో ఆమె కాంస్యం గెలిచింది. సెమీస్‌లో భవాని 14-–15 తేడాతో జేనబ్ దాయిబెకోవా (ఉజ్బెకిస్థాన్) చేతిలో పోరాడి ఓడింది.
నీరజ్ చోప్రా
భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ లూసానె అంచె పోటీల్లో బరిలో దిగి స్వర్ణం నిలబెట్టుకున్నాడు. లూసానెలో 87.66 మీటర్ల దూరం ఈటెను విసిరి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అయిదో ప్రయత్నంలో ఉత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచాడు.
పి.ఎం.ప్రసాద్
కోల్ ఇండియా సంస్థ కొత్త చైర్మన్గా పి.ఎం.ప్రసాద్ జులై 1న బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 780 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యానికి ప్రాధాన్యమిస్తూ కోల్ ఇండియా పని చేస్తుందని ఆయన తెలిపారు.
పుల్లెల గోపీచంద్
భారత చీఫ్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ (కర్ణాటక) గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. గోపీచంద్‌తో పాటు మరో నలుగురు యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా డాక్టరేట్‌ను అందుకున్నారు.
అజిత్ అగార్కర్
టీమ్‌ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ను బీసీసీఐ భారత సీనియర్ పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. 45 ఏళ్ల అగార్కర్ 1998–2007 మధ్య 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో వరుసగా 288, 58, 3 వికెట్లు పడగొట్టాడు.
నరేంద్ర మోడీ
ప్రధాని మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని అందించనున్నట్లు తిలక్ స్మారక్ మందిర్ ట్రస్టు (హింద్ స్వరాజ్ సంఘ్) ప్రకటించింది. తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 1న పుణెలో నిర్వహించే కార్యక్రమంలో మోడీకి అవార్డు ప్రదానం చేయనున్నారు.
గీతారావ్ గుప్తా
అమెరికా విదేశాంగ శాఖలో అంతర్జాతీయ మహిళా సమస్యల పర్యవేక్షకురాలిగా భారత సంతతికి చెందిన గీతారావ్ గుప్తాతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంతకుముందు ఆమె ఐక్యరాజ్యసమితి, యునిసెఫ్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్స్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
శిరీష ఓరుగంటి
యూకేకు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల గ్రూపు లాయిడ్స్ బ్యాంకింగ్ హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈఓ, ఎండీగా శిరీష ఓరుగంటి ని నియమించుకుంది. సంస్థ స్థాపన, దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాన్ని ఆమె పర్యవేక్షించనున్నారని కంపెనీ తెలిపింది.
సుద్దాల అశోక్ తేజ
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు 2023 సంవత్సరానికి డా.సి.నారాయణరెడ్డి సాహిత్య పురస్కారం ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రకటించింది. సినారె 92వ జయంతి కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
కల్యంపూడి రాధాకృష్ణరావు
ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్ కల్యంపూడి రాధాకృష్ణరావుకు గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు వరించింది. ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
సాత్విక్ సాయిరాజ్
భారత స్టార్ డబుల్స్ షట్లర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగవంతమైన స్మాష్ సంధించిన ఆటగాడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. సాత్విక్ స్మాష్‌తో షటిల్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం విశేషం. 2013 మే నెలలో టాన్ బూంగ్ హీయోంగ్ (మలేసియా) నెలకొల్పిన 493 కి.మీ రికార్డును సాత్విక్ బద్దలు కొట్టాడు. –
సత్పాల్ భాను
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా సత్పాల్ భానూను ప్రభుత్వం నియమించింది. ఏప్రిల్‌లో ఎల్‌ఐసీ చైర్మన్‌గా నియమితులైన సిద్ధార్థ మొహంతి స్థానంలో సత్పాల్ భాను నియమితులయ్యారు.
డీజీ రాకేశ్ పాల్
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) 25వ డైరెక్టర్ జనరల్‌గా డీజీ రాకేశ్ పాల్ నియమితులయ్యారు. డీజీ రాకేశ్ పాల్ తన కెరీర్‌లో అనేక స్థాయిల్లో పనిచేశారు. డిజి రాకేష్ పాల్ విశిష్ట సేవలకు 2013లో తత్రాక్షక్ పతకం 2018లో ప్రెసిడెంట్ తత్రాక్షక్ మెడల్‌ను అందుకున్నారు.
ఫాంగ్నోన్ కొన్యాక్
నాగాలాండ్ నుంచి మొదటి మహిళా సభ్యురాలుగా ఫాంగ్నోన్ కొన్యాక్ రాజ్యసభలో అధ్యక్షత వహించారు. లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి, రాజ్యసభ చైర్మన్ శ్రీ జగదీప్ ధన్‌ఖర్ వైస్-చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌కు నలుగురు మహిళా సభ్యులను (మొత్తం సంఖ్యలో 50 శాతం) నామినేట్ చేశారు.
మీలా జయదేవ్
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మీలా జయదేవ్ ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తారు.మీలా జయదేవ్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపార సంస్థల్లో ఒకటైన సుధాకర్ గ్రూపు సంస్థల యజమానిగా ఉన్నారు.
మాధవరావు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) నూతన చైర్మన్, సీఎండీగా ఎ.మాధవరావు బాధ్యతలు చేపట్టారు. 2026 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఆయన 2020 మార్చిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బీడీఎల్‌లో చేరారు.
కె.అఖిల్
పొక్లెయిన్ ఆపరేటర్గా పనిచేసే 28 ఏళ్ల కె.అఖిల్ కేరళ సాహిత్య అకాడమీ వార్షిక అవార్డు – 2020 అందుకున్నారు. అఖిల్ రాసిన పొట్టి కథల పుస్తకం ‘నీలచడయాన్’కు ఈ అవార్డు ప్రకటించారు. ఉత్తర కేరళలోని సామాన్య ప్రజల జీవితాలను ఇందులోని కథలు ప్రతిబింబిస్తాయి.
మోక్షారాయ్
భారత సంతతికి చెందిన ఏడు సంవత్సరాల బ్రిటన్ బాలిక మోక్షారాయ్ ప్రతిష్టాత్మక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డు గెలుచుకుంది. మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమం కోసం ఆమె మూడేళ్ల ప్రాయం నుంచే స్వచ్ఛందంగా పనిచేస్తోంది.
మహేంద్రదేవ్
ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (ఈపీడబ్ల్యూ) సంపాదకుడిగా తెలుగు వ్యక్తి ప్రొఫెసర్ మహేంద్రదేవ్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ దేవ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ, అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధన చేశారు.
జావెద్ అఖ్తర్
‘శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు’ ఆధ్వర్యంలో సినారె 92వ జయంత్యుత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఉర్దూ/హిందీ కవి, పద్మభూషణ్ జావెద్ అఖ్తర్‌ను ‘విశ్వంభర డా।। సి.నారాయణరెడ్డి జాతీయ సాహితీ పురస్కారం’తో సత్కరించారు.
జొన్నలగడ్డ రాజేంద్ర
జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) సభ్యుడిగా రిటైర్డ్ ఎయిర్ వైస్‌మార్షల్ జొన్నలగడ్డ రాజేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగేళ్ల పాటు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు.
చేతనా మారూ
ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ పురస్కారానికి గాను ఈ ఏడాది విజేత ఎంపిక పరిశీలనలో భారతీయ మూలాలున్న రచయిత్రి ‘చేతనా మారూ’ చోటు దక్కించుకున్నారు. ప్రాథమిక పరిశీలన కోసం కమిటీ ఎంపిక చేసిన 13 పుస్తకాలలో లండన్ నివాసి అయిన చేతనా మారూ తొలి నవల ‘వెస్ట్రన్ లేన్’ ఉంది.
స్పోర్ట్స్
ఆర్చరీ ప్రపంచకప్
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3 టోర్నమెంట్లో అభిషేక్ వర్మ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్లో ఈ భారత స్టార్ 148-–146తో జేమ్స్ లూట్జ్ (అమెరికా)పై నెగ్గాడు. ప్రపంచకప్‌లో అభిషేక్‌కు ఇది మూడో వ్యక్తిగత స్వర్ణం.
ఇంటర్ కాంటినెంటల్ కప్
ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్లో 2-–0 గోల్స్‌తో లెబనాన్‌ను ఓడించింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి ఓ మెరుపు గోల్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
స్పీడ్ చెస్ టైటిల్
భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ జూనియర్ స్పీడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. తుది పోరులో తొలి మూడు గేమ్‌లలో ఒక డ్రాతో పాటు రెండింట్లో ఓడిన 17 ఏళ్ల గుకేశ్ బలంగా పుంజుకుని టైటిల్ కైవసం చేసుకున్నాడు.
భారత్‌దే శాఫ్ టైటిల్
డిఫెండింగ్ చాంపియన్ భారత్ శాఫ్ ఫుట్‌బాల్ టైటిల్ నెగ్గింది. ఫైనల్ షూటౌట్లో ఛెత్రి సేన 5-–4తో కువైట్‌ను ఓడించింది. ఈ టోర్నీలో విజేతగా నిలవడం భారత్‌కు ఇది తొమ్మిదోసారి. గతంలో 1993, 97, 99, 2005, 09, 11, 15, 21ల్లోనూ కప్ సాధించింది.
ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రి టైటిల్
రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఫైనల్ రేసులో వెర్‌స్టాపెన్ గంటా 25 నిమిషాల 33 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. పోల్ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెర్‌స్టాపెన్ వరుసగా ఐదో టైటిల్ కైవసం చేసుకున్నాడు.
కెనడా ఓపెన్ టైటిల్
కామన్వెల్త్ క్రీడల చాంపియన్, భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కెనడా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-–18, 22-–20తో ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ లీ షై ఫెంగ్ (చైనా)ను ఓడించాడు.
సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్
సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఈవెంట్లో కార్ల్‌సన్ 15 పాయింట్లతో అగ్రస్థానం సాధించాడు. మొత్తంగా (ర్యాపిడ్, బ్లిట్జ్) 26 పాయింట్లతో టోర్నీ విజేతగా నిలిచాడు. 9.5 పాయింట్లు సంపాదించిన గుకేశ్ అయిదో స్థానంలో, విశ్వనాథన్ ఆనంద్ ఏడో స్థానం సాధించాడు.
వింబుల్డన్ చాంపియన్స్
వింబుల్డన్ పురుషుల సింగిల్స్లో అల్కరాస్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జకోవిచ్‌పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ చాంపియన్‌గా మార్కెటా వొండ్రుసోవా నిలిచింది. ఈ చెక్ రిపబ్లిక్ స్టార్ ఫైనల్లో జాబెర్ (ట్యునీసియా)పై విజయం సాధించింది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణి వొండ్రుసోవా.
సౌత్‌జోన్‌దే దులీప్ ట్రోఫీ
హనుమ విహారి సారథ్యంలోని సౌత్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 75 పరుగుల తేడాతో వెస్ట్‌జోన్‌పై విజయం సాధించింది. సౌత్‌కు ఇది 14వ దులీప్ ట్రోఫీ టైటిల్. విద్వత్ కావేరప్ప ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులను అందుకున్నాడు.
సాత్విక్ – చిరాగ్ జోడీకి టైటిల్
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడీ ఇప్పటికే స్విస్ ఓపెన్ 300, ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీల్లో విజేతగా నిలవగా, ఇప్పుడు కొరియా ఓపెన్ సూపర్ 500లోనూ విజయం సాధించింది. ఫైనల్లో టాప్‌సీడ్, ప్రపంచ నంబర్‌వన్ అల్ఫియాన్ – అర్దియాంతో (ఇండోనేసియా)పై గెలిచారు.
టాంపీర్ ఓపెన్లో నగాల్‌కు టైటిల్
భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ ఫిన్లాండ్‌లో జరిగిన టాంపీర్ ఓపెన్లో చాంపియన్గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో నగాల్ 6-–4, 7–-5తో అయిదో సీడ్ డాలిబోర్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. సుమిత్‌కు ఇది నాలుగో ఏటీపీ ఛాలెంజర్ ట్రోఫీ.
సౌత్‌దే దేవ్‌ధర్ ట్రోఫీ
దేవధర్ ట్రోఫీలో సౌత్‌జోన్ విజేతగా నిలిచింది. 45 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌ను ఓడించింది. మొదట సౌత్ 50 ఓవర్లలో 328/8 స్కోరు చేసింది.ఈస్ట్ 46.1 ఓవర్లలో 283కే ఆలౌటైంది. దేవధర్ ట్రోఫీ గెలవడం సౌత్‌కిది తొమ్మిదోసారి.
సైన్స్ అండ్ టెక్నాలజీ
కృత్రిమ వర్షం సక్సెస్
ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పరిశోధకులు క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రయోగాత్మకంగా కృత్రిమ వర్షాన్ని కురిపించారు. ఏవియేషన్ అధికారుల అనుమతితో టెస్టింగ్ విమానం గాల్లోకి ఎగిరింది. 5 వేల అడుగులకు చేరుకున్న తర్వాత క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ద్వారా వాతావరణంలో మార్పులు వచ్చేలా రసాయనాలను చల్లారు. కొద్దిసేపటికి ఆ ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిసింది.
ప్రయోగానికి చంద్రయాన్-–.3 రెడీ
ఎల్‌వీఎం-3పీ4 రాకెట్‌తో చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను అనుసంధానించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. జులై 13న చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించనున్నామని ఇస్రో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
విశాఖలో ‘సాగర్ కవచ్’ కవాతు
విశాఖపట్నంలో తీర భద్రతపై 2 రోజుల పాటు ‘సాగర్ కవచ్’ కవాతు నిర్వహించారు. సముద్ర సంబంధిత భద్రతా వ్యవస్థలతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది. నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డ్, స్టేట్ మెరైన్ పోలీస్, కస్టమ్స్, మత్స్యశాఖ, పోర్టు అథారిటీలు కవాతులో పాల్గొన్నాయి.
గగన్‌యాన్ ఎస్‌ఎంపీఎస్ సక్సెస్
గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రపొల్షన్ సిస్టం (ఎస్‌ఎంపీఎస్)ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఇస్రోకు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఈ పరీక్ష విజయవంతంగా నిర్వహించింది.
కక్ష్యలోకి చంద్రయాన్-3
ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రయోగంలో మొదటి అంకాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్‌లతో కూడిన చంద్రయాన్-3 వ్యోమనౌక నిర్ణీత కక్ష్యకు చేరింది. ఆగస్టు 23న చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లి ఉపరితలంపై దిగాల్సి ఉంది.
ఫాల్కన్-9తో ప్రమాదం
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగించిన ఫాల్కన్-9 రాకెట్ వల్ల భూమి చుట్టూ ఉన్న వాతావరణ పొర అయనోస్పియర్‌కి రంధ్రం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయానోస్పియర్ పొరను రాకెట్ చీల్చేయడం స్పష్టంగా కనిపించిందని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జెఫ్ బౌమ్‌గార్డెనర్ చెబుతున్నారు.
పీఎస్‌ఎల్‌వీ-సి56 సక్సెస్
ఇస్రో షార్ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సి56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక 420 కిలోల బరువున్న ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లింది. తాజా రాకెట్ ప్రయోగంతో ఇస్రో పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 431కి చేరింది.