తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్లు.. అన్నింటికీ కామన్ సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ (జీఎస్). సిలబస్ ఎక్కువ ఉండడంతో మంచి స్కోర్ ఎలా చేయాలని అభ్యర్థులు సందిగ్ధతకు లోనవుతుంటారు. జనరల్ స్టడీస్ మీద పట్టు ఎలా సాధించాలి.. ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఎలా ప్లాన్ ప్రకారం చదవాలో తెలుసుకుందాం…
జనరల్ స్టడీస్‌లో మొత్తం 11 నుంచి 12 సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో అన్ని విభాగాలకూ సమ ప్రాధాన్యం ఉండదు. ప్రధానంగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులుంటాయి. అందువల్ల అభ్యర్థులు మొదట ఈ విభాగాలపై పట్టు తెచ్చుకునేందుకు టైమ్ టేబుల్ తయారు చేసుకోవాలి.
మిగతా విభాగాలకు ప్రశ్నల సంఖ్యలో, మార్కుల కేటాయింపులో పెద్ద ప్రాధాన్యం లేకపోయినా చాలా తక్కువ శ్రమతో ఆయా అంశాలపై పట్టు సాధించవచ్చు. మార్కులు పొందవచ్చు. పర్యావరణ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, గవర్నెన్స్ మొదలైనవి ఈ కోవకి చెందుతాయి. ఈ విషయాలను సులభంగానే అర్థం చేసుకోవచ్చు. వీటికి తక్కువ సమయం కేటాయించి వ్యూహాత్మకంగా ప్రిపేర్ అవ్వాలి.
టెన్త్ నాలెడ్జ్‌తో జనరల్ స్టడీస్‌లోని కొన్ని విభాగాలను అనుసంధానం చేసుకుని ఉన్నట్లయితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. జనరల్ సైన్స్, భారత భౌగోళిక అంశాలు, అర్థశాస్త్ర అంశాలు ఈ తరహా ప్రశ్నకు సంబంధించినవిగా గుర్తించాలి. పాఠశాల స్థాయి పుస్తకాల్లోని సంబంధిత అంశాలపై పట్టు సాధించిన తరువాత ఇంకా అవసరమనుకుంటే గ్రాడ్యుయేషన్ స్థాయి పుస్తకాలు చదవొచ్చు.
అకాడమీ బుక్స్ బెటర్
జనరల్ స్టడీస్‌లోని కొన్ని విభాగాలను డిగ్రీ స్థాయిలోనే చదవాలి. ప్రధానంగా తెలుగు అకాడమీ డిగ్రీ పుస్తకాలు గానీ, యూనివర్సిటీ డిగ్రీ పుస్తకాలు చదవొచ్చు. భారత రాజ్యాంగ వ్యవస్థ, పర్యావరణ అంశాలు, ఎకానమీలోని కొన్ని టాపిక్స్, భారత స్వాతంత్య్రోద్యమం, ప్రాచీన భారతదేశ చరిత్ర, శాస్త్ర సాంకేతిక అంశాలు… మొదలైనవి డిగ్రీ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి.
పరీక్షను బట్టి ప్రశ్నల సరళి
రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్ ప్రశ్నలస్థాయి పరీక్ష స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. దిగువ స్థాయి ఉద్యోగాల పరీక్షల్లో సాధారణ స్థాయి ప్రశ్నలుంటాయి. ఒక ప్రత్యేక సబ్జెక్టుకు సంబంధం ఉన్న పరీక్షలోని జనరల్ స్టడీస్‌లో కూడా రీజనింగ్ ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి.. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో సాధారణ స్థాయిలో కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ ఎక్కువ సందర్భాల్లో క్లిష్టత స్థాయి ఎక్కువ ఉన్న ప్రశ్నలు అడిగారు. అందువల్ల ఈ విభాగాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు మొదటి నుంచి కొద్దిగా కఠినత్వం ఎక్కువగా ఉన్న ప్రశ్నలు సాధించేలా చూసుకోవాలి.
కరెంట్ అఫైర్స్ కీలకం
నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆధారంగా కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక అర్ధ గంట సమయం కేటాయిస్తూ వివిధ జాతీయ, అంతర్జాతీయ విషయాలపై దృష్టి పెట్టాలి. పరీక్ష సమయానికి నాలుగు నుంచి ఆరు నెలల వెనుక కాలానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఆయా విషయాలపై స్థూల అవగాహన ఉండాలి. పరీక్ష తేదీకి ఆరు నెలల ముందు నుంచి కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెడితే మంచి మార్కులు సాధించవచ్చు. కురుక్షేత్ర, యోజన, న్యూ ఇండియా సమాచారం, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్‌సైట్ మొదలైన వనరుల పఠనం ద్వారా జనరల్ స్టడీస్ లోని వివిధ అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. మార్కులను కూడా గణనీయంగా పెంచుకోవచ్చు. జనరల్ స్టడీస్‌లోని కొన్ని విభాగాలు కరెంట్ అఫైర్స్‌తో ముడిపడి ఉంటాయి ఆ విభాగాల్లోని ప్రశ్నలకు జవాబులను కరెంట్ అఫైర్స్‌తో అనుసంధానించి చదవాలి. భారత రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించిన సవరణలు సుప్రీంకోర్టు తీర్పులు, కొత్తగా చేర్చిన అధికరణాలు, షెడ్యూళ్లకు ప్రాధాన్యం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలోని అనేక విషయాలపై అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌తో అనుసంధానం చేసుకుని అప్‌డేట్ నాలెడ్జి పెంచుకోవాలి.
గ్రూప్ ఆధారంగా ప్రిపరేషన్
గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థులు స్క్రీనింగ్ పరీక్షలో, మెయిన్స్‌లో ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించి ప్రిపేర్ అయ్యేటప్పుడే ప్రిలిమినరీ, మెయిన్స్ ప్రశ్నల రూపాన్ని అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. ఇలా చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ పట్టు సాధించవచ్చు. జనరల్ స్టడీస్ పేపర్‌లోని కొన్ని అంశాలు మిగతా పేపర్స్‌లో విస్తృత మార్కుల కింద ఇచ్చారు. అందుకని గ్రూప్- 2 రాస్తున్న అభ్యర్థులు జనరల్ స్టడీస్‌లో అంతర్భాగంగా కాకుండా వాటిని ప్రత్యేకంగా చదివితే ప్రయోజనం ఎక్కువ.