రాష్ట్రంలో త్వరలో 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలోనే గ్రూప్ -1తో పాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీంతో ఆరు యూనివర్సిటీల్లో పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
ఉచితంగా మెటీరియల్
అభ్యర్థులకు గురువారం నుంచి కోచింగ్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. యూనివర్సిటీల్లో ఉండి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులకు ఈ కోచింగ్ కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయి, కోచింగ్ సెంటర్లలో విద్యార్థులకు ఉచితంగా మెటిరీయల్ కూడా అందిస్తామిని మంత్రి తెలిపారు.