ఏపీలో 111 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియ ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. దీంతో కొత్త నోటిఫికేషన్ల విడుదలపై ఏపీపీఎస్సీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 2 పోస్టులు వెయ్యి వరకు ఉండొచ్చని, అలాగే గ్రూప్-1 ఖాళీలు మరో 100కు పైగా ఉండే అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్‌లోపు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. గ్రూప్-1కు సంబంధించి, గ్రూప్-2 కింద 1000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
గ్రూప్స్ పరీక్షల సిలబస్‌లోనూ మార్పులు చేయనున్నట్లు వివరించారు. యూపీఎస్సీ విధానంలోనే ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ కూడా ఉంటుందన్నారు. ఈ ఉద్యోగాల నియామకాలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని అభ్యర్థులకు సూచించారు. నోటిఫికేషన్లలో అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.