ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం జగన్ (AP CM Jagan) శుభవార్త చెప్పారు. పోలీస్ ఉద్యోగాలకు (Police Jobs) సంబంధించి వయోపరిమితి పెంచాలంటూ అభ్యర్థులు చేస్తున్న వినతులను పరిగణలోకి తీసుకున్న సీఎం.. అందుకు అంగీకరించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితిని రెండేళ్ల పాటు పెంచుతూ నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ (AP Police Job Notification) విడుదలైనప్పటి నుంచి వయో పరిమితిని సడలించాలంటూ అభ్యర్థులు, వివిధ పార్టీల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ ఆ డిమాండ్ ను అంగీకరించడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఇటీవల ఏపీలో మొత్తం 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 6100 పోలీస్ ఉద్యోగాలు కాగా.. 411 ఎస్ఐ జాబ్స్ ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ సైతం ఇప్పటికే ప్రారంభమైంది. అయితే.. ఈ వయోపరిమితి సడలింపు కేవలం కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మాత్రమేనా.. లేకా ఎస్ఐ ఉద్యోగాలకు సైతం కూడా వర్తిస్తుందా? అన్న అంశంపై గందరగోళం నెలకొంది. ఒక్కో మీడియాలో ఒక్కో రకంగా వర్తలు వస్తుండడంతో అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఈ అంశంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 30న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 12న ప్రారంభం కాగా.. ఎస్ఐ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 18న ముగియనుంది.