తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ నియామకాల కోసం చేపట్టిన నియామక పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రైమరీ కీని నవంబర్ 15న విడుదల చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఆ మరుసటి రోజు నవంబర్ 16 నుంచి 20 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ఆ అభ్యంతరాలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రోజు తుది కీని విడుదల చేసింది. తుది కీలో 4 ప్రశ్నలు తొలగించడంతో పాటు మరో 4 ప్రశ్నల ఆప్షన్లు మార్చారు.
ఇందుకు సంబంధించిన ఫైనల్ కీతో కూడిన రెస్పాన్స్ షీట్లను కమిషన్ వెబ్ సైట్లో ఈ రోజు నుంచి కమిషన్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు అధికారులు. ఈ ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించేది లేదని పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను సందర్శించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నవంబర్ 7వ తేదీన రాత పరీక్ష నిర్వహించింది.