తెలంగాణలో మొత్తం 9,168 గ్రూప్- 4 ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను జులై 1వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది కమిషన్. మొత్తం 9.50 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
అయితే.. మరో రెండు, మూడు రోజుల్లో ఈ హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో కమిషన్ అధికారిక వెబ్ సైట్లో (https://www.tspsc.gov.in/) ఈ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. రేపు లేదా ఎల్లుండి ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మరో వైపు ఇటీవల ఈ పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. ఇందుకు కోర్టు నిరాకరించింది. దీంతో పరీక్ష ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జులై 1న జరగనుంది.