HomeLATESTతెలంగాణ గట్టుపై మరో కొత్త పార్టీ.. అట్టుడికిన హైదరాబాద్: ఒకే రోజు 6 మర్డర్లు.. శంకరమ్మకు...

తెలంగాణ గట్టుపై మరో కొత్త పార్టీ.. అట్టుడికిన హైదరాబాద్: ఒకే రోజు 6 మర్డర్లు.. శంకరమ్మకు ఎమ్మెల్సీ: నేటి వార్తలు జూన్ 21

గద్దర్ అధ్యక్షుడిగా కొత్త పార్టీ

రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఈ మేరకు ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను బుధవారం కలిశారు. ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరుతో గద్దర్ కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా గద్దర్, కార్యదర్శిగా నరేష్, కోశాధికారిగా గద్దర్ భార్య నాగలక్ష్మి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి సంబంధించి జెండాను 3 రంగులతో రూపొందించి దాని మధ్యలో పిడికిలి గుర్తు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ఇప్పటికే గద్దర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

హైదరాబాద్ లో 6 మర్డర్లు

హైదరాబాద్ మహానగరం వరుస హత్యలతో వణుకుతోంది. ఈ రోజు 15 గంటల వ్యవధిలో ఆరుగురు హత్యకు గురవడంతో నగర వాసులు ఉలిక్కిపడ్డారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు వ్యక్తులు అర్థరాత్రి దాటాక దారుణ హత్యలకు గురయ్యారు. ఇద్దరు ట్రాన్స్ జెండర్లు, ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న మరో ఇద్దరిని దుండగులు హతమార్చారు. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జంట హత్యలు జరిగాయి. బ్లాంకెట్లు అమ్ముకునే వ్యక్తిని, రోడ్డు పక్కన షాప్ ముందు నిద్రిస్తున్న మరో వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గ్రానైట్ రాళ్లతో కొట్టి చంపేశారు. ఇదిలా ఉంటే.. నార్సింగిలో తనను ప్రేమించలేదని కసితో వాసవి అనే మహిళపై గణేశ్​ నే ఉన్మాది కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. దీంతో ఆమె చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతోంది.

ఫ్లైఓవర్ ప్రమాద బాధితులకు కేటీఆర్ పరామర్శ

ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.

పొంగులేటి, జూపల్లి ఇంటికి రేవంత్

బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై గళమెత్తుతున్న వారందరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు మేలు జరుగుతుందని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు.

Advertisement

శంకరమ్మకు ఎమ్మెల్సీ?

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా ట్యాంక్ బండ్ పై నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని అమరుల కుటుంబీకులతోనే ప్రారంభింపజేయాలని భావిస్తున్న కేసీఆర్.. ఆమెకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సూర్యాపేట జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి శంకరమ్మ ఇంటికి వెళ్లి మాట్లాడి అమరవీరుల స్మారక చిహ్నం ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించినట్టు సమాచారం. ఇటీవల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిసిన శంకరమ్మ తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరగా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

తెలంగాణలో ఈడీ దాడుల కలకలం

రాష్ట్రంలో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. మెడికల్ కాలేజీలే టార్గెట్ గా రెయిడ్స్​ జరుగుతున్నాయి. తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. వీటిలో ఆరు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్​కాలేజీ, హైదరాబాద్ లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ రిసెర్చ్ సెంటర్, కామినేని, మెడిసిటీ మెడికల్​ కాలేజీ, తదితర కళాశాలలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 11 బృందాలు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆయా తనిఖీల్లో నలుగురు ఈడీ అధికారులతో, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. కాలేజీల్లోని నిధులు వ్యవహారాల, మేనేజ్మెంట్ సీట్ల గురించి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన: కోదండరాం

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కంపేట నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వరకు చేపట్టే తెలంగాణ బచావో యాత్రను వారు ప్రారంభించారు. ఈసందర్భంగా కోదండరాం మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను పాలకులు విస్మరించారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. రాజకీయాలను, విద్యను వ్యాపారంగా మార్చారు. సింగరేణి, ఆర్టీసీలో నియామకాలను చేపట్టకుండా నిర్వీర్యం చేస్తున్నారు’ అని కోదండరాం మండిపడ్డారు.

Advertisement

అబద్ధాలు చెప్పే కేసీఆర్ కు ఆధ్యాత్మికత ఎక్కడ: బండి సంజయ్

హిందు గాళ్లు.. బొందుగాళ్లు అంటూ నానా దుర్భాషలాడిన కేసీఆర్.. యాదాద్రి ఆలయాన్ని పెట్టుబడి పేరిట అభివృద్ధి చేశారని, వేములవాడ, అలంపూర్ జోగుళాంబ, ధర్మపురి, కొండగట్టు, బాసర, కొమురవెల్లి, భద్రాద్రి ఆలయాలకు మొక్కుబడిగా నిధులు కేటాయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండి పడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కోట్లకు కోట్లు ఇస్తాననే మాటలే తప్ప చేతల్లో కానరావడం లేదన్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని పక్కన పెడుతూ.. ఈ ధర్మాన్ని తిట్టేవారిని తలపైకెత్తుకుంటావని విమర్శించారు. ఆత్మసాక్షిగా కూడా అబద్ధాలే చెప్పే నీకు ఆధ్యాత్మికత ఎక్కడిదంటూ ఫైర్ అయ్యారు.

రూ.2 వేలు మార్చుకోవడానికి అమెజాన్ ఛాన్స్

అమెజాన్​ పే తన కస్టమర్ల కోసం కొత్త సర్వీస్​ను తీసుకొచ్చింది. కేంద్రం ఇటీవల రూ. 2వేల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నోట్ల మార్పిడికి సెప్టెంబర్​తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోపే క్యాష్​ లోడ్ ఆప్షన్​ను అమెజాన్​ తెచ్చింది. ఇందులో నెలకు 50 వేల వరకు క్యాష్​ను లోడ్ చేసుకోవచ్చు. దీనిని మన బ్యాంక్​ ఖాతాలోకి ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. అన్ని రకాల ఆన్​లైన్​ పేమెంట్స్​ చేయవచ్చు. అమెజాన్​లో షాపింగ్​ చేశాక.. ఆర్డర్​ డెలివరీ టైంలో మీ ఇంటివద్దకు వచ్చే డెలివరీ బాయ్​కి మీ దగ్గరున్న రెండు వేల నోట్లు ఇస్తే సరిపోతుంది. ఆ డబ్బును అమెజాన్​ పే అకౌంట్లో వారు డిపాజిట్​ చేస్తారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!