నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. 2022లో ఏప్రిల్ నెలలో 503 పోస్టులతో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయగా వాటికి అదనంగా మరో 60 పోస్టులను కలిపి ఇవ్వనుంది. ఇందులో 24 డీఎస్పీ, మూడు డిప్యూటీ కలెక్టర్‌తో పాటు ఎంపీడీవో, రిజిస్ట్రార్ తదితర పోస్టులు ఉన్నాయి. హారిజంటల్ ఇష్యూ పరిష్కారం అయితే రిజల్ట్స్‌తో పాటు ఇతర నోటిఫికేషన్లు కూడా ఒక్కొక్కటి విడుదల కానున్నట్లు సమాచారం.
త్వరలో ఫలితాలు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి.. తుది ‘కీ’లు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాల ప్రకటనపై టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఫలితాల వెల్లడికి అడ్డంకిగా ఉన్న న్యాయ, పరిపాలనాపరమైన సమస్యలపై దృష్టి సారించింది. దీనిపై కొత్తగా ఏర్పాటైన టీఎస్పీఎస్సీ బోర్డు రెండు రోజులుగా ప్రత్యేకంగా సమావేశమైంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వస్తే 10 వేలకు పైగా పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది. అడ్డంకులు తొలగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది.