దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-–2023 నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో సాధించిన స్కోరుతో ఉన్నత విద్య చదవడంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు ఉపయోగపడుతుంది. ఐఐటీలు, నిట్ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ఏడాది గేట్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తోంది.
అర్హతలు: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు.
ఎగ్జామ్ ప్యాటర్న్: అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షకు 3 గంటల సమయం ఉంటుంది. 29 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 30 వరకు అప్లై చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు రూ.1700, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.850 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. తెలంగాణలో హైదరాబాద్, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.