HomeLATESTG20 సదస్సు..పోటీ పరీక్షలకు నోట్స్​

G20 సదస్సు..పోటీ పరీక్షలకు నోట్స్​

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల అధినేతల వార్షిక సమావేశమే G20 సదస్సు

18వ G20 సదస్సు  న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో సెప్టెంబర్​ 9, 10వ తేదీల్లో జీ-20 సదస్సు జరిగింది. వసుధైక కుటుంబం పేరుతో ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు నినాదంగా భారత్‌ ఈ సదస్సును నిర్వహించింది.

2024లో బ్రెజిల్​లో 19వ సదస్సు

భారత్‌ అధ్యక్షతన ప్రతిష్ఠాత్మకంగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. తదుపరి సారథ్య బాధ్యతల్ని డిసెంబరు 1న బ్రెజిల్‌ లాంఛనంగా చేపట్టనుండడంతో దానికి చిహ్నంగా చెక్కతో రూపొందించిన అధికార దండాన్ని (చిన్న సుత్తి ఆకారంలోని గవెల్‌ను) ఆ దేశాధ్యక్షుడు లూయీ ఇనాసియో లులా డసిల్వాకు ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు. 2024లో  బ్రెజిల్, 2025లో దక్షిణాఫ్రికా, 2026లో అమెరికా జీ 20 అధ్యక్ష బాద్యతలు చేపట్టనున్నాయి.

సభ్య దేశాలు: 

అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్​, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్​, దక్షిణ కొరియా, రష్యా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, గ్రేట్​ బ్రిటన్​, అమెరికా, యూరోపియన్​ యూనియన్​. 2008 నుంచి స్పెయిన్‌‌‌‌ శాశ్వత ఆహ్వానిత దేశం. G20లో పాకిస్థాన్‌‌‌‌ లేదు

భారత్‌ ఆహ్వానించిన జీ-20 యేతర దేశాలు

బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, యూఏఈ, స్పెయిన్, సింగపూర్, ఒమన్, నైజీరియా, నెదర్లాండ్స్‌.

జీ-20 వాటా

ప్రపంచ జీడీపీలో జీ-20 దేశాల వాటా: 85 శాతం

ప్రపంచ జనాభాలో జీ-20 దేశాల వాటా: 66 శాతం

ప్రపంచ వాణిజ్యంలో జీ-20 వాటా: 75 శాతం

సదస్సులో చర్చించిన ముఖ్యాంశాలు

ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ-20లో సభ్యత్వం

అంతర్జాతీయ రుణ వితరణ పునర్వ్యవస్థీకరణ

అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణ వితరణ

ఢిల్లీ డిక్లరేషన్​

అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అన్ని దేశాలూ కట్టుబడాలి. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. ఉక్రెయిన్‌లో న్యాయబద్ధమైన, దీర్ఘకాల శాంతికి చర్యలు అవసరం. ఐరాస నిబంధనలను గౌరవించాలి. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడం సరికాదు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ దురాక్రమణలకు పాల్పడకూడదు.

కోణార్క్​ చక్రం

 జి–20 శిఖరాగ్ర సదస్సులో స్వాగతం పలికే ప్రదేశంలో బ్యాంక్​ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన కోణార్క్​ చక్రం ప్రధాన ఆకర్షణ. కోణార్క్​ చక్రాన్ని 13వ శతాబ్దంలో తూర్పు గాంగుల రాజవంశానికి చెందిన కళింగ రాజు నరసింహదేవ–1 పాలనలో రూపొందించారు.

క్రిప్టో కరెన్సీపై నియంత్రణ వ్యవస్థ

బ్రెజిల్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తామని, ఆ దేశం అందించే సారథ్యం ద్వారా కూటమి తన లక్ష్యాల సాధనలో మున్ముందుకు దూసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలని ప్రార్థిస్తూ, ఆకాంక్షిస్తూ సంస్కృత శ్లోకాన్ని పఠించారు. గతసారి కూటమికి నేతృత్వం వహించిన ఇండోనేసియా తరఫున ఆ దేశ అధ్యక్షుడు విడోడో, తదుపరి బాధ్యతలు నిర్వహించనున్న బ్రెజిల్‌ తరఫున అధ్యక్షుడు లులా ఆయా బాధ్యతలకు గుర్తుగా తమతమ దేశాలకు చెందిన ఒక్కో మొక్కను మోదీకి అందజేశారు. పర్యావరణ ప్రాధాన్యాన్ని చాటేలా వాటిని భారత్‌ మండపం ప్రాంగణంలోనే నాటారు.

జీ20 సదస్సులో 5 కీలక విజయాలు

–  జీ20 కూటమిలో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం.

–  అమెరికా, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్, అరబ్‌ దేశాలను కలుపుతూ రైలు, నౌకాయాన అనుసంధానత కల్పన.

–  ప్రపంచ జీవ ఇంధన కూటమి ఆవిర్భావం.

–  ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు కీలక సమస్యలపై పోరాటానికి దిల్లీ డిక్లరేషన్‌.

– పర్యావరణం, వాతావరణ మార్పులపై పరిశీలనకు జీ20 శాటిలైట్‌ మిషన్‌.

– వాతావరణ పరిశీలనకు ‘జీ20 ఉపగ్రహాన్ని’ ప్రయోగిస్తామని భారత్‌ ప్రతిపాదించింది. దక్షిణార్ధ గోళ దేశాలకు సాయం చేయడం దీని ఉద్దేశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్‌ మిషన్‌ నుంచి వచ్చిన డేటా తరహాలో జీ20 ఉపగ్రహం వల్ల మానవాళికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

జీ20లో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం

భారత్‌ నేతృత్వం వహిస్తున్న జీ20 కూటమి ఓ పెద్ద ముందడుగు వేసింది. ఆఫ్రికన్‌ యూనియన్‌ (ఏయూ)ను శాశ్వత సభ్యురాలుగా కొత్తగా చేర్చుకుంది. దీనిపై అంగీకారం కుదిరింది. 1999లో ఆవిర్భావం తర్వాత జీ20 కూటమిని విస్తరించడం ఇదే తొలిసారి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు సభ్య దేశాలన్నీ ఆమోదం తెలిపాయి. తద్వారా ప్రపంచంలో దక్షిణ భాగంలో ఉన్న కీలక కూటమిని, ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలను ఒకేచోటుకు చేర్చినట్లయింది.

ఈయూ తర్వాత పెద్ద కూటమి ఇదే

జీ20లో 55 సభ్య దేశాల ఆఫ్రికన్‌ యూనియన్‌ (ఏయూ) చేరికతో ఐరోపా సమాఖ్య (ఈయూ) తర్వాత రెండో అతిపెద్ద బహుళ దేశాల కూటమిగా విస్తరించినట్లయింది. ఆఫ్రికా ఖండంలోని దేశాలతో 2002లో ఏయూ ఏర్పడింది. అంతకు ముందు 32 దేశాలతో ‘ఆఫ్రికా ఐక్య సంస్థ’గా ఇది ఉండేది. ఆఫ్రికన్‌ యూనియన్‌ జీడీపీ విలువ 3 లక్షల కోట్ల డాలర్లు కాగా జనాభా 140 కోట్లు. జీ20 విషయానికి వస్తే ఆవిర్భవించిన కొత్తలో ఇది ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల వేదికగా ఉండేది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత 2008లో దానిని ప్రభుత్వాధినేతల కూటమిగా మార్చారు. 2009లో అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రముఖ వేదికగా అవతరించింది. జీ20 కూటమిలో ఇప్పటివరకు ఏయూ నుంచి ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే సభ్య దేశంగా ఉంది.

జీవ ఇంధన కూటమికి శ్రీకారం

జీ20 వేదికగా ప్రధాని మోదీ జీవ ఇంధన కూటమి ఏర్పాటును ప్రకటించారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ మిశ్రమ యజ్ఞంలో పాలుపంచుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయంగా ఇతర మిశ్రమాలపైనా పని చేద్దామని కోరారు. పర్యావరణ, వాతావరణాలను పర్యవేక్షించేందుకు జీ20 శాటిలైట్‌ మిషన్‌ను ప్రారంభిద్దామని సూచించారు. ఇంధన పరివర్తన అనేది 21వ శతాబ్దంలో ముఖ్యమైన అంశమని చెప్పారు. దీనికి లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయని, అభివృద్ధి చెందిన దేశాలు ఇందులో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ ఏడాదిలోనే ఈ విషయంలో ముందుకు రావాలని దక్షిణార్థ గోళ దేశాల తరఫున కోరుతున్నానని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు 100 బిలియన్‌ డాలర్లను ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు. సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థలో జీవ ఇంధనాలనేవి మార్కెట్లు, వాణిజ్యం, సాంకేతికత, పాలసీలు, అంతర్జాతీయ సహకారంలో కీలక పాత్ర పోషిస్తాయని మోదీ తెలిపారు.  

జీవ ఇంధన కూటమిలో వ్యవస్థాపక సభ్యులుగా అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, దక్షిణాఫ్రికా, యూఏఈ, అమెరికా ఉన్నాయి. కెనడా, సింగపూర్‌ పరిశీలక దేశాలుగా చేరాయి.

రాజ్​ఘాట్​లో నివాళులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ సహా జీ20 నేతలు మహాత్ముడి సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద గాంధీకి నివాళులర్పించారు.

ఆవిర్భావం : 

1997లో తూర్పు ఆసియాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రభావంతో ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి ఈ గ్రూప్​ ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటికే అత్యంత సంపన్న దేశాలతో కూడిన G–8 బృందాన్ని విస్తరించి చైనా బ్రెజిల్, సౌదీ అరేబియా తదితర వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను ఇందులో చేర్చారు. సభ్య దేశాలు 19, యూరోపియన్​ యూనియన్​తో కలిపి G20.

ఫస్ట్ సమ్మిట్​​: 

1999లో మొదటిసారి బెర్లిన్​లో G 20 సదస్సు జరిగింది. మొదట్లో ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్​ బ్యాంకుల గవర్నర్లు ఈ సదస్సుకు హాజరయ్యే వారు. 2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బ్యాంకులు కుప్పకూలడం, నిరుద్యోగం పెరగడం, వేతనాల్లో మాంద్యం కారణంగా సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు G 20 ఒక అత్యవసర మండలిగా మారింది.

G–20 ప్రభుత్వాల అధినేతలు 2008 నుంచి ప్రతి ఏడాది సభ్య దేశాల్లో సమావేశమవుతున్నారు. తొలి సదస్సు అమెరికా రాజధాని వాషింగ్జన్​ డి.సి.లో జరిగింది.

G20కి ప్రధాన కార్యాలయం లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చేస్తుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది.

సమావేశాలు: 

అధ్యక్ష ఎన్నిక కోసం G20ని ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూపుల వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. ఈ గ్రూపులో ఓటింగ్​ నిర్వహించి ఎంపిక చేస్తారు. 2023లో భారత్​లో G–20 సదస్సు జరగనుంది. జి–20 దేశాల అధినేతలు సంవత్సరానికి ఒకసారి సమావేశమైతే, ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు రెండు సార్లు సమావేశమై అనేక అంశాలపై చర్చిస్తారు. వరల్డ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌, ఐరాస, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఓఈసీడీ, డబ్ల్యూహెచ్‌‌‌‌వో, ఐఎంఎఫ్‌‌‌‌, డబ్ల్యూటీవో, ఫైనాన్షియల్‌‌‌‌ స్టెబిలిటీ బోర్డు, ఆసియా డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లు ఈ సమావేశాల్లో​ పాల్గొంటాయి.

లక్ష్యాలు

1. సుస్థిరాభివృద్ధిని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడానికి సభ్య దేశాల మధ్య సహకారం పెంపొందించడం

2. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాలు పునరావృతం కాకుండా ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టడం

3. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునికీకరించడం, సభ్య దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడం 

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!