HomeLATESTరైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కన్నీరు.....

రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కన్నీరు.. నేటి వార్తలు జూన్ 19

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను జూన్ 26 నుంచి విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని, అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును సీఎం ఆదేశించారు. ఇంకా.. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం, పట్టాలు పొందిన రైతులకు రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.

Advertisement

మ‌హేశ్వ‌రంలో మెడికల్ కాలేజీ: కేసీఆర్ ప్రకటన

రంగారెడ్డి జిల్లాలోని మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అభ్య‌ర్థ‌న‌ మేర‌కు మెడిక‌ల్ కాలేజీని మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని తుమ్మ‌లూరులో నిర్వ‌హించిన 9వ విడత హరిత‌హారం కార్య‌క్ర‌మంలో కేసీఆర్ పాల్గొని మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నియోజ‌క‌వ‌ర్గానికి మెడిక‌ల్ కాలేజీని మంజూరు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. తుమ్మ‌లూరులో ఒక సబ్ స్టేష‌న్‌ను మంజూరు చేస్తున్నాం. వీలైనంత తొంద‌ర‌గా ఈ ప‌నులు పూర్తి చేస్తాం. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రో వ‌స్తుంది.. మీ వ‌ర‌కు కూడా తెస్తామన్నారు. మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 65 గ్రామ పంచాయ‌తీల‌కు రూ. 15 ల‌క్ష‌ల చొప్పున ప్ర‌త్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

సీఎం కేసీఆర్ కు బీజేపీ నేత బండి సంజయ్ లేఖ రాశారు. రిటైర్డ్ ఉద్యోగులకు 2 నెలలుగా పెన్షన్ విడుదల చేయకపోవడం పట్ల బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే తొలిరోజునే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్న హామీ ఏమైంది?, నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కనికరం లేదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలోనే 460 మంది ఉద్యోగుల పెన్షన్ ఫైళ్లు ఆర్థికశాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

Advertisement

నగరంలోని బన్సీలాల్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల సముదాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుమారుడు, కూతురిని భవనం 8వ అంతస్తు నుంచి కిందపడేసి తల్లి ఈ దారుణానికి పాల్పడింది. అనంతరం తానూ భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కవలలుగా గుర్తించారు. మృతులు తల్లి సౌందర్య(26), చిన్నారులు నిత్య, నిదరష్‌గా గుర్తించారు. కట్నం వేధింపులే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు వాపోతున్నారు. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

వర్షాలపై వాతావరణ శాఖ శుభవార్త

ఎండ వేడిమితో అల్లాడుపోతున్న ప్రజలకు తాజాగా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీలోని రాయలసీమలో నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో కూడా రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్సుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

రాహుల్ కు షర్మిల శుభాకాంక్షలు

నేడు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై చర్చ జరుగుతోంది. బెంగళూర్‌లో ఇదివరకే డికే శివకుమార్‌తో షర్మిల సమావేశం అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్‌తో షర్మిల తరపున డికే చర్చలు నిర్వహించినట్టు ప్రచారం పెద్ద ఎత్తున నడిచింది. షర్మిల పాలేరు టికెట్ హామీ పొందినట్లు సైతం ప్రచారం జరిగింది. అయితే ఈ విలీనంపై జరుగుతున్న ప్రచారాన్ని షర్మిల కొట్టి పారేశారు. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో మరోసారి విలీన ప్రచారం జోరందుకుంది.

Advertisement

ఎన్నికల బరిలో ఎంపీ అక్బరుద్దీన్ కుమారుడు

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం నుంచి ఎంపీ అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు, డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీని ఎమ్మెల్యే స్థానానికి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు వాస్తవానికి రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నూరుద్దీన్ ఒవైసీని పోటీకి దింపాలని భావించారు. అయితే వయసు రీత్యా ఈ ప్లాన్ వాయిదా పడింది. అయితే రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నూరుద్దీన్ ఓవైసీని బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా కేవలం హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ నుంచి మాత్రమే కాకుండా.. రాష్ట్రంలోని పలు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోంది.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కన్నీరు

తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు. తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారన్నారు. తన మనోస్థైర్యం దెబ్బతీసే కుట్ర జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముత్తిరెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తన కుటుంబ సమస్యను రాజకీయం చేయడం సరికాదన్నారు. నా కుమార్తెకు నా సొంత ఆస్తి ఇస్తే మోసం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు.తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేసి.. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన పేరు మీద ఉన్న భూమిని ఆయన పేరు మీదకు మార్చుకున్నారని ముత్తిరెడ్డి కుమార్తె భవానీ ఉప్పల్ ఠాణాలో ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మే 31న తెలంగాణ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం అవినాష్​ రెడ్డికి నోటీసులిచ్చింది. సునీత పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను జులై 3కి వాయిదా వేసింది.

Advertisement

సిక్స్ ప్యాక్ కోసి ఇంజెక్షన్లు.. పట్టుకున్న పోలీసులు

మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్​పట్టుబడ్డాయి. దాదాపు 400 వరకు మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిమ్ ట్రైనర్ నితీశ్‌, రాహుల్‌తోపాటు సోహెల్‌లను అరెస్ట్ చేశారు. పట్డుబడ్డ ఇంజెక్షన్లను ఎక్కడి నుంచి తెస్తున్నారు? ప్రధాన సూత్రధారి ఎవరు అనే కోణంలో ఆఫీసర్లు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను ఎక్కువగా జిమ్‌లో బాడీబిల్డర్‌ల (సిక్స్ ప్యాక్) కోసం వాడి దుర్వినియోగం చేస్తున్నారని అధికారుల విచారణలో తేలింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!