ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 పరీక్ష తుది ఫలితాలను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. విజయవాడలో ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలోనే గ్రూప్-1 ఫలితాలను విడుదల చేశామన్నారు. 11 నెలల రికార్డు సమయంలో గ్రూప్-1 నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు సమయంలో ఈ ఫలితాలను విడుదల చేశామన్నారు. 111 పోస్టులకు గాను.. 110 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ప్రస్తుతం ప్రకటించామన్నారు. స్పోర్ట్స్ కోటాలో మరో పోస్టు ఎంపిక జరుగుతుందని తెలిపారు. మొదటి పది స్ధానాల్లో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారని తెలిపారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదేనని వివరించారు.
టాప్ 5 ర్యాంకర్లు వీరే:
ఫస్ట్ ర్యాంకర్-భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష (బీఏ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీ)
సెకండ్ ర్యాంకర్-భూమిరెడ్డి భవాని (అనంతపురం)
మూడో ర్యాంకర్-కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న
నాలుగవ ర్యాంకర్-కే ప్రవీణ్ కుమార్ రెడ్డి (అనంతపురం జేఎన్టీయూ)
ఐదవ ర్యాంకర్-భానుప్రకాష్ రెడ్డి (కృష్ణా యూనివర్సిటీ)
ఇదిలా ఉంటే.. ఏపీలో గతేడాది సెప్టెంబర్ 30వ తేదీన 111 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 8వ తేదీన న ప్రిలిమ్స్ జరిగింది. ప్రిలిమ్స్ కు 86 వేల మంది హాజరుకాగా.. 6,455 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. పరీక్ష నిర్వహించిన కేవలం 19 రోజుల్లో.. జనవరి 27 వ తేదీన ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసి రికార్డు సృష్టించింది ఏపీపీఎస్సీ. జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్ పరీక్ష జరిగింది. 111 పోస్టులకిగానూ 220 మంది అర్హత సాధించగా.. వీరికి ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.