తెలంగాణలో ఎంసెట్‌కు (TS EAMCET 2023) రికార్డు స్థాయిలో దరఖాస్తులు నమోదయ్యాయి. ఇప్పటికే ఎంసెట్ అప్లికేషన్లు మూడు లక్షలు దాటినట్లు ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు 3,05,185 మంది విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 1,95,515 ఇంజనీరింగ్ అప్లికేషన్లు కాగా 1,08,457 అగ్రికల్చర్ దరఖాస్తులున్నాయి.
ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ఇటీవలే ప్రకటించారు. మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను నిర్వహించనున్నారు.
మార్చి 3 నుంచి ఎంసెట్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 4 వరకు అప్లికేషన్ల గడువు ముగిసింది. ఇప్పటికే అప్లై చేయని విద్యార్థులు లేట్ ఫీజు చెల్లించి మే 2 వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు. ఈసారి ఎంసెట్‌కు ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేశారు. ఎంసెట్ ఎంట్రన్స్‌లో వచ్చే మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు చేపడుతారు. బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు కూడా ఈసారి ఎంసెట్ ద్వారానే చేపడుతారు.
