Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : జులై ​2024

కరెంట్​ అఫైర్స్​ : జులై ​2024

అంతర్జాతీయం

రెమిటెన్స్‌లో భార‌త్ టాప్‌
మాతృభూమికి నిధులు పంపించడంలో(రెమిటెన్స్‌లు) ప్రపంచ దేశాల్లోనే భారత్‌ టాప్​లో నిలిచింది. 2023లో 120 బిలియన్‌ డాలర్ల (రూ.10లక్షల కోట్లు సుమారు) రెమిటెన్స్‌లను భారత్‌ అందుకున్నట్టు ప్రపంచ బ్యాంక్‌ తాజాగా ప్రకటించింది. భారత్‌కు 2023లో అత్యధికంగా అమెరికా, యూఏఈ నుంచే రెమిటెన్స్‌లు వచ్చాయి.

గ్లోబల్​ లివబులిటీ ఇండెక్స్​
గ్లోబల్​ లివబులిటీ ఇండెక్స్​ 2024ను లండన్​కు చెందిన ఎకనామిస్ట్​ ఇంటెలిజెన్స్​ యూనిటీ తాజాగా విడుదల చేసింది. ఈ ఇండెక్స్​లో ఇస్ట్రియాలోని వియన్నా టాప్​ ర్యాంక్​ దక్కించుకుంది. వరుసగా మూడోసారి ఈ స్థానం సంపాందించిన నగరంగా రికార్డుల్లో నిలిచింది.

ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ ప్రిపేర్డ్​ ఇండెక్స్​
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్​ఎఫ్​) సంసిద్ధత కోసం ప్రపంచ వ్యాప్తంగా 174 దేశాలను( ఆర్థిక వ్యవస్థ) అంచనా వేసి ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ ప్రిపేర్డ్​ ఇండెక్స్​ ఈ ఇండెక్స్​ను విడుదల చేసింది. ఇందులో 174 దేశాలకు భారత్​ 72వ స్థానంలో నిలిచింది.

తొలి ‘మిస్‌ ఏఐ’ కిరీటం
ప్రపంచంలోనే మొదటిసారిగా జరిగిన మిస్ ఏఐ అందాల పోటీలో మొరాకోకు చెందిన కెంజా లైలీ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ విజేతగా నిలిచింది.ఈ పోటీలో దాదాపు 1500 ఏఐ మోడళ్లు పోటీపడ్డాయి. కృత్రిమ మేధస్సు పరంగా అగ్రస్థానంలో నిలిచిన లైలీ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. భారత్​ నుంచి జారా శతావరీ టాప్‌ 10 ఫైనలిస్ట్‌లో నిలిచింది.

బ్రిటన్‌ ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌
బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన లేబర్‌ పార్టీ అధ్యక్షుడు కీర్‌ స్టార్మర్‌ దేశ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. స్టార్మర్‌ నియామకాన్ని బ్రిటన్‌ కింగ్‌ ఛార్లెస్‌-3 ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఛార్లెస్‌ స్టార్మర్‌ ను ఆహ్వానించడంతో దేశ 58వ ప్రధానిగా స్టార్మర్‌ బాధ్యతలు చేపట్టారు.

త్రీడీ హోలోగ్రామ్స్‌తో కరెన్సీ నోట్లు
నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు జపాన్‌ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా త్రీడీ హోలోగ్రామ్స్‌తో కరెన్సీ నోట్లను ముద్రించింది. త్రీడీ హోలోగ్రామ్స్‌సెక్యూరిటీ ఫీచర్‌తో ఉన్న.. కొత్తగా ముద్రించిన 10 వేల యెన్, 5 వేల యెన్, 1000 యెన్‌ నోట్లు జపాన్‌లో జూలై 3 నుంచి చెలామణిలోకి వచ్చాయి.

కోపా అమెరికా చాంపియన్‌
కోపా అమెరికా ఫుట్‌ బాల్‌ టోర్నీ-2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్లో కొలంబియాను 1-–0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా 16వ సారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు చరిత్ర సృష్టించింది. ఉరుగ్వే (15 టైటిల్స్‌) రికార్డును అధిగమించింది.

నేపాల్‌ ప్రధానిగా కె.పి.శర్మ ఓలి
నేపాల్‌ నూతన ప్రధానిగా కె.పి.శర్మ ఓలి ఎంపికయ్యారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. కొత్త ప్రధానిగా ఓలిని దేశ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ ఎంపిక చేశారు. ఓలి ఇదివరకు మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు.

రోజుకోసారి నవ్వాలని జపాన్​లో చట్టం
జపాన్‌లోని యమగట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజూ అందరూ నవ్వాలని చట్టం చేసింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని తెలిపింది.

ఈయూ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండర్‌
ఐరోపా సమాజ (ఈయూ) కార్యనిర్వాహక కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండర్‌ లేయన్‌ మరోసారి ఎన్నికయ్యారు. ఆమె అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. మొత్తం 720 మంది సభ్యులున్న చట్టసభలో 707 మంది హాజరుకాగా ఉర్సులా వాండర్‌కు అనుకూలంగా 401 ఓట్లు, వ్యతిరేకంగా 284 ఓట్లు వచ్చాయి. ఈయూ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, పర్యావరణ పరిరక్షణకు, వలసల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె అన్నారు.

పాక్‌లో పెరిగిన హిందూ జనాభా
పాకిస్థాన్‌లో హిందువుల జనాభా 2017లో 35 లక్షలు కాగా 2023లో 38 లక్షలకు పెరిగిందని, పాక్‌లో అత్యధిక జన సంఖ్య గల మైనారిటీ వర్గం హిందువులేనని గతేడాది జన గణన తేల్చింది. దేశ జనాభాలో ముస్లింల వాటా 2017లో 96.47 శాతం కాగా, 2023లో అది స్వల్పంగా తగ్గి 96.35 శాతానికి చేరింది. క్రైస్తవుల జనాభా 1.27 శాతం నుంచి 1.37 శాతానికి (26 లక్షల నుంచి 33 లక్షలకు) పెరిగింది.

అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌
హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను విడుదల చేసింది.ఈ తాజా ర్యాంకింగ్‌లో భారతదేశానికి చెందిన పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. భారత పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండానే ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ వంటి ప్రపంచంలోని 58 దేశాలకు ప్రయాణించవచ్చు. శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో 195 దేశాలకు యాక్సెస్‌తో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా, ఆప్గనిస్థాన్ చివరి స్థానంలో ఉంది.

అమల్లోకి నూతన న్యాయ చట్టాలు
మన దేశంలో బ్రిటిష్‌ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టం స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌(బీఎస్‌ఏ) జూన్‌ 30 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

రాజ్యసభాపక్ష నేతగా జె.పి.నడ్డా
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా రాజ్యసభాపక్ష నేతగా నియమితులయ్యారు. ఎగువసభ 264వ సెషన్‌ ప్రారంభమైన తొలి రోజున ఈ నియామకం విషయాన్ని ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

ఎస్​బీఐ చైర్మన్​గా చల్లా శ్రీనివాసులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నూతన చైర్మన్ గా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. శ్రీనివాసులు 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో చేరారు. 2020లో ఎస్‌బీఐ బోర్డులో ఎండీగా నియమితులయ్యారు. ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాంక్‌, గ్లోబల్‌ మార్కెట్స్‌ అండ్‌ టెక్నాలజీ వింగ్స్‌ బాధ్యతలు చూస్తున్నారు.

ఝార్ఖండ్‌ సీఎంగా మళ్లీ హేమంత్‌ సోరెన్‌
జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి పగ్గాలు చేపట్టనున్నాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

షాంఘైలో కోపరేషన్​ ఆర్గనైజేషన్​ సమ్మిట్​
కజకిస్తాన్​లోని ఆస్తానాలో షాంఘై కోపరేషన్​ ఆర్గనైజేషన్​ సమావేశం జరిగింది. దీని కోసం ప్రధాని నరేంద్ర మోడీకి బదులు విదేశాంగ మంత్రి జైశంకర్​ హజరయ్యారు.

మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం
రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు వామ్లిదిన్ పుతిన్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్-కాల్డ్‌ను అందజేశారు. రష్యా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించినందుకు ఈ గౌరవం లభించింది.

గోండు భాషలో మహాభారతం
గిరిజనులకు మహాభారతాన్ని చేరువ చేయడానికి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన తొడసం కైలాస్‌ అనే ఉపాధ్యాయుడు బాలల మహాభారతాన్ని కరోనా సమయంలో తన మాతృభాష గోండులోకి అనువదించారు. పిల్లలు, యువతలో మంచి ఆలోచనలు కలిగించడానికి ‘సద్‌ విచార్‌’ పేరిట మరో పుస్తకం రాశారు. 18 పర్వాలతో 272 పేజీల ‘పండోక్న మహా భారత్‌ కథ’ పేరిట విజయవంతంగా పూర్తి చేశారు.

ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్
ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ను ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్‌ ఆటో విడుదల చేసింది. ఫ్రీడమ్‌ 125 పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. ఇప్పటికే త్రీ వీలర్‌ విభాగంలో సత్తా చాటుకున్న బజాజ్ ఆటో తాజాగా తన టూ- వీలర్ వ్యాపారంలో సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేసి ముందుకొచ్చింది. అలా, గ‌తనెల‌లో బ‌జాజ్ ఆటో సంస్థ ఈ బైక్‌ను విడుద‌ల చేసింది.

భారత్‌లో గూగుల్‌ జెమిని యాప్‌
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సహా 9 భారతీయ భాషల్లో సపోర్ట్‌ చేసే ‘ఏఐ అసిస్టెంట్‌ జెమిని’ యాప్‌ను గూగుల్‌ భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం వెర్షన్‌ ‘జెమిని అడ్వాన్స్‌’ లో అనేక కొత్త ఫీచర్లను జోడించింది. గతేడాత ఏడాది చివర్లో ‘జెమిని’ పేరుతో అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ను గూగుల్‌ పరిచయం చేసింది.

బలపరీక్షలో నెగ్గిన హేమంత్‌ సర్కార్
ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని జేఎంఎం–-కాంగ్రెస్‌-–ఆర్జేడీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో నెగ్గింది. ఓటింగ్‌ సమయంలో సభలో 75 మంది ఎమ్మెల్యేలు ఉండగా 45 మంది విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. బల పరీక్ష అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ అధికార కూటమికి చెందిన 11 మంది సభ్యులతో మంత్రులుగా ప్రమాణం చేయించారు.

170 కోట్లు చేరుకోనున్న భారత జనాభా
‘ది వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ 2024’ పేరిట ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాలు, జనాభా విభాగం తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, భారతదేశ జనాభా 2100 నాటికి 150 కోట్లకు పడిపోతుందని అంచనా వేయబడింది. 2060 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకుని, ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2100 నాటికి 150 కోట్లకు చేరుకుంటుంది.

జూన్‌ 25న రాజ్యాంగ హత్యాదినం
దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్‌ 25ను ఇకపై ఏటా ‘రాజ్యాంగ హత్యాదినం’ (సంవిధాన్‌ హత్యాదివస్‌)గా జరుపుకోవాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఎమర్జెన్సీలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తుచేసుకుందాం’’ అని హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు.

ఇండోర్‌ గిన్నిస్‌ రికార్డు
ఒక్కరోజే 11 లక్షలకుపైగా మొక్కలు నాటడం ద్వారా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ధ్రువపత్రం అందుకున్న చిత్రాలను ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు.

‘అగ్నివీర్‌’లకు 10 శాతం కోటా
పోలీసుశాఖతోపాటు అటవీ గార్డులు, జైలు వార్డెన్ల ఉద్యోగాల్లో అగ్ని వీరులకు 10శాతం కోటా ఇవ్వనున్నట్లు హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైనా అగ్నివీర్‌ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తే రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణం కూడా ఇస్తామని సీఎం నాయబ్‌సింగ్‌సైనీ ప్రకటించారు.

రామసేతు వంతెన నిజమేనన్న ఇస్రో
ఇస్రోకు చెందిన జోధ్​పూర్​, హైదరాబాద్​లోని నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​కు చెందిన శాస్త్రవేత్తలు ఐస్​శాట్​–2 అత్యాధునిక లేజర్​ టెక్నాలజీ సాయంతో ఆడమ్స్​ వంతెన మ్యాప్​ మొదటిసారి రూపొందించింది. ఈ వంతెన ఊహ కాదని నిజమే అని ఇస్రో తెలిపింది.

రాహుల్‌ గాంధీకి ఊమెన్‌ చాందీ అవార్డు
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ సంస్మరణార్థం అందిస్తున్న తొలి పురస్కారానికి కాంగ్రెస్​ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ ఎంపికయ్యారు. భారత్‌ జోడో యాత్ర ద్వారా ప్రజల కష్టాలను విని వాటికి పరిష్కారాలు చూపిన రాహుల్‌కు మొదటి ఊమెన్‌ చాందీ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు చాందీ ఫౌండేషన్‌ తెలిపింది.

అందెశ్రీకి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం
శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఏటా ప్రదానం చేసే ‘మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం’ ఈ ఏడాది (2024) తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే పాటలు పాడిన ‘అందెశ్రీ’కి దక్కింది. దాశరథి జయంతి సందర్భంగా హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌లోని భాషా నిలయం సభా మందిరంలో పురస్కారం ప్రదానం చేశారు.

డాక్టర్‌ నాగేశ్వరరెడ్డికి ప్రతిష్ఠాత్మక కెప్టెన్స్‌ చైర్‌ పురస్కారం
హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్‌ డా.డి.నాగేశ్వరరెడ్డికి అమెరికాలోని విఖ్యాత జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మకమైన కెప్టెన్స్‌ చైర్‌ పురస్కారం దక్కింది. గ్యాస్ట్రోఎంటరాలజీరంగంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ‘కెప్టెన్స్‌ ఛైర్‌’ను ఆయనకు బహూకరించారు.

నీతి ఆయోగ్‌ను పునర్వ్యవస్థీకరణ
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం నీతి ఆయోగ్‌ను పునర్వ్యవస్థీకరించింది. చైర్‌పర్సన్‌ గా ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగుతారు. వైస్‌చైర్మన్‌, పూర్తికాల సభ్యుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కొత్త ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా చేర్చగా.. ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని నీతి ఆయోగ్‌లో భాగస్వాములను చేశారు.

జాతీయ చేనేత పురస్కారం
పర్యావరణ హితంగా చీరను రూపొందించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడేనికి చెందిన కర్నాటి ముఖేశ్‌ జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర చేనేత, జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయస్థాయిలో 14 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేయగా వారిలో తెలంగాణ నుంచి ముఖేశ్‌ అవార్డు సాధించారు.

ప్రాంతీయం

రైతు భరోసాకు మంత్రివర్గ ఉపసంఘం
రైతుభరోసా పథకంపై అధ్యయనం చేసి విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు నియమితులయ్యారు.

గూడూరులో రాష్ట్రకూటుల శిల్పాలు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో రెండు అరుదైన రాష్ట్ర కూటుల కాలం నాటి జైన యక్షిణి శిల్పాలను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్​ రెడ్డి గుర్తించారు.

కార్పొరేషన్లకు కొత్త చైర్‌పర్సన్లు
రాష్ట్రంలోని 34 కార్పొరేషన్లకు కొత్తగా చైర్‌పర్సన్లను, ఒక సంస్థకు వైస్‌ చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి పదవీ కాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కొత్త డీజీపీగా జితేందర్
రాష్ట్రానికి కొత్త డీజీపీగా డాక్టర్ జితేందర్ ను నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు డీజీపీగా కొనసాగిన రవి గుప్తాను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా డీజీపీగా నియమితులైన జితేందర్1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.

సుస్థిరాభివృద్ధి సూచీ 2023–2024
నీతి ఆయోగ్​ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి సూచీ 2023–2024 నాలుగవ ఎడిషన్​లో తెలంగాణ 74 మార్కులతో 11వ స్థానంలో నిలిచింది. 2020–21లోనూ 69 మార్కులతో 11వ స్థానంలో నిలిచింది.

‘కాటమయ్య రక్షణ కవచం’
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడ గ్రామంలో గీత కార్మికులకు ‘కాటమయ్య రక్షణ కవచం’ రక్షణ కిట్ల పంపిణీని సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు.

జూకంటికి దాశరథి పురస్కారం
ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారం మట్టి కవిగా ఖ్యాతి గడించిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జూకంటి జగన్నాథాన్ని వరించింది. జూకంటికి దాశరథి పురస్కారంతో పాటు లక్షా వెయ్యి నూట పదహారు రూపాయల నగదు, జ్ఞాపికను అందజేస్తారు.

యాకూబ్‌కు సినారె అవార్డ్​
తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేసే డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సాహిత్య పురస్కారం-2024కు ప్రముఖ కవి డా.యాకూబ్‌ ఎంపికయ్యారు.

వార్తల్లో వ్యక్తులు

ఉపేంద్ర ద్వివేది
భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఆ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే నేవీ చీఫ్‌గా కొనసాగుతున్న అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠీకి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది చిన్ననాటి మిత్రులు.

రవి అగర్వాల్‌
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కు కొత్త చైర్మన్‌గా రవి అగర్వాల్‌ నియమితులయ్యారు. ఈయన 1988 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి. 2025 జూన్‌ వరకు రవి అగర్వాల్‌ సీబీడీటీ చైర్మన్‌గా కొనసాగుతారు. ప్రస్తుతం సీబీడీటీ చైర్మన్‌గా ఉన్న నితిన్‌ గుప్తా స్థానంలో అగర్వాల్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

విక్రమ్‌ మిస్రీ
ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్‌ మిస్రీ విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినయ్‌ క్వాత్రా స్థానంలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి బాధ్యతలను జులై 15న విక్రమ్‌ మిస్రీ చేపట్టనున్నారు. ఈయన 1989 ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ బ్యాచ్‌కు చెందిన వాడు.

తన్వీ చవాన్‌ దేవరె
ఇంగ్లీష్‌ ఛానల్‌ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన తన్వీ చవాన్‌ దేవరె రికార్డు సృష్టించారు. బ్రిటన్‌లోని డోవర్‌ నుంచి ఫ్రెంచ్‌ తీరం వరకు 42 కి.మీ.ల దూరాన్ని ఇద్దరు పిల్లల తల్లి అయిన తన్వీ 17.42 గంటల్లో చేరుకున్నారు.

సుజాతా సౌనిక్
మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుజాతా సౌనిక్ నియమితురాలయ్యారు. 64 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఈ అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

సి.సుదర్శన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్‌రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జీఏడీ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్‌రాజ్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుంది.

మసూద్ పెజెష్కియాన్
ఇరాన్‌ కొత్త అధ్యక్షుడిగా సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు. పెజెష్కియాన్‌ను 16.3 మిలియన్ ఓట్లతో విజేతగా ప్రకటించగా, జలీలీకి 13.5 మిలియన్ల ఓట్లు వచ్చినట్టు అక్కడి ఎన్నికల అధికారులు తెలిపారు.

రోష్ని నాడార్‌
టెక్‌ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రాను ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. వ్యాపార, పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి గాను ఆమెకు ప్రతిష్టాత్మకమైన షెవాలీర్‌ డి లా లెజియన్‌ డి హానర్ (నైట్‌ ఆఫ్‌ ది లెజియన్‌ ఆఫ్‌ హానర్‌) లభించినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.

హార్దిక్‌ పాండ్య
టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో బ్యాటుతో, బంతితో అదరగొట్టిన హార్దిక్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగై అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

వినేశ్‌ ఫొగాట్‌
గ్రాండ్‌ప్రి రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ వినేశ్‌ ఫొగాట్‌ సత్తా చాటింది. 50 కేజీల విభాగంలో ఆమె స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో వినేశ్‌ 10-–5తో మారియా టిమెర్‌కోవా (రష్యా)పై విజయం సాధించింది. పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నాహకాల్లో భాగంగా ఫొగాట్‌ ఈ టోర్నీలో ఆడుతోంది.

ఎ.శ్రీధర్‌
ద.మ.రైల్వే నూతన సీపీఆర్వోగా ఎ.శ్రీధర్‌ రైల్‌ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ (ఐఆర్‌టీఎస్‌) 2011 బ్యాచ్‌కి చెందిన శ్రీధర్‌ గతంలో హైదరాబాద్, నాందేడ్‌ డివిజన్లలో సీనియర్‌ డివిజనల్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా పనిచేశారు.

కె.ఎస్‌.శ్రీనివాసరాజు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కె.ఎస్‌.శ్రీనివాసరాజును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సుదర్శన్ పట్నాయక్
రష్యాలో జరిగిన అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో ఒడిషాకు చెందిన ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డును అందుకున్నాడు.సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్రసిద్ధ పీటర్ అండ్ పాల్ కోటలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 21 మంది ప్రముఖ శిల్పులు ఈ పోటీలో పాల్గొన్నారు.

శౌర్య బవా
ప్రపంచ జూనియన్‌స్క్వాష్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాడు శౌర్య బవా కాంస్యంతో గెలుచుకున్నాడు. బాలుర సింగిల్స్‌సెమీఫైనల్లో ఈజిప్ట్‌కు చెందిన టాప్‌సీడ్‌ మహ్మద్‌ జకారియా చేతిలో పరాజయం పాలయ్యాడు. కుశ్‌కుమార్‌(2014) తర్వాత ప్రపంచ జూనియర్‌స్క్వాష్‌బాలుర విభాగంలో సెమీఫైనల్‌చేరిన రెండో భారతీయుడు శౌర్య.

విక్రమ్‌ మిస్రీ
విక్రమ్ మిశ్రీ విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ప్యారీస్ సర్వీస్ 1989 బ్యాచ్ చెందిన అయన ఈ పదవి చేపట్టిన 35వ అధికారి. వినయ్ క్వాట్రా స్థానంలో అయన బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి 2021 వరకు చైనాలో భారత రాయబారిగా గాల్వాన్ లోయ ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక చర్యల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.

కొమ్మూరి షణ్ముఖ శ్రీసాయి
పశ్చిమ గోదావరికి చెందిన కొమ్మూరి షణ్ముఖ శ్రీసాయి అనే యువకుడు సైబర్‌ సెక్యూరిటీ రంగంలో తన అద్భుత ప్రతిభతో ఇండియన్‌ బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్‌నెట్‌లో సైబర్‌ దాడులు గుర్తించి వాటికి పరిష్కారాలు తెలియజేయడం వంటివి విజయవంతంగా నిర్వహించినందుకు ఈ గౌరవం దక్కింది.

పీఆర్‌ ప్రసాద్‌
ఎయిర్‌ఫోర్స్‌ అసోసియేషన్‌ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అధ్యక్షుడిగా రిటైర్డ్​ గ్రూపు కెప్టెన్‌ పెమ్మసాని రాజేంద్రప్రసాద్‌ నియమితులయ్యారు. జాతీయ ఎయిర్‌ఫోర్స్‌ అసోసియేషన్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఎయిర్‌ మార్షల్‌ జగ్‌జీత్‌ సింగ్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

నిర్మలా సీతారామన్‌
వరసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్​ సమర్పించిన ఘనతను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సాధించారు. పార్లమెంటులో ఆమె 2024-–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ సమర్పించడంతో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టి ఇప్పటికే నిర్మలమ్మ రికార్డు నెలకొల్పారు. ఎక్కువసార్లు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు (2020 ఫిబ్రవరి ఒకటోతేదీ, రెండు గంటల 40 నిమిషాలు) కూడా ఆమె ఖాతాలోనే ఉంది.

అభినవ్‌ బింద్రా
భారత షూటింగ్‌ దిగ్గజం అభినవ్‌ బింద్రాకు ఒలింపిక్‌ ఆర్డర్‌ అవార్డు లభించింది. ఒలింపిక్‌ ఉద్యమానికి చేసిన గొప్ప సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) బింద్రాను ఈ అవార్డ్​కు ఎంపిక చేసింది. ఆగస్టు 10న పారిస్‌లో అవార్డు ప్రదాన కార్యక్రమం ఉంటుంది.

నీతా అంబాని
అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా నీతా అంబాని తిరిగి ఎన్నికయ్యారు. ఐఓసీ 142వ సెషన్‌ సందర్భంగా 100 శాతం ఓట్లతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2016 ఒలింపిక్స్‌ సందర్భంగా నీతా తొలిసారి ఐఓసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

సుదర్శన్ పట్నాయక్
రష్యాలో జరిగిన అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో ఒడిషాకు చెందిన ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డును అందుకున్నాడు.సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్రసిద్ధ పీటర్ అండ్ పాల్ కోటలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 21 మంది ప్రముఖ శిల్పులు ఈ పోటీలో పాల్గొన్నారు.

విక్రమ్‌ మిస్రీ
విక్రమ్ మిశ్రీ విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ప్యారీస్ సర్వీస్ 1989 బ్యాచ్ చెందిన అయన ఈ పదవి చేపట్టిన 35వ అధికారి. వినయ్ క్వాట్రా స్థానంలో అయన బాధ్యతలు చేపట్టారు.

స్పోర్ట్స్​

టీ20 చాంపియన్​ ఇండియా
2007లో టీ20 ప్రపంచకప్‌ మొదలైనపుడు ఆ టైటిల్‌ను సొంతం చేసుకున్న భారత్‌ మళ్లీ 2024లో విజేతగా నిలిచింది. ఫైనల్లో రోహిత్‌ సేన 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ బుమ్రా గెలుచుకున్నాడు. వరల్డ్ కప్​ గెలవడంతో భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.

టీ 20లకు గుడ్​బై
భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, ఆల్​రౌండర్​ జడేజా టీ20లకు వీడ్కోలు పలికారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై రోహిత్​, 2010లో జింబాబ్వేపై కోహ్లీ, 2009లో శ్రీలంక మ్యాచ్‌తో జడేజా టీ20 క్రికెట్లో అరంగేట్రం చేశారు.

చెఫ్‌ డి మిషన్‌గా గగన్‌
లండన్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్​లో కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌చెఫ్‌ డి మిషన్‌గా వ్యవహరించనున్నాడు. ఒలింపిక్స్‌లో పతకాలు (రియోలో రజతం, టోక్యోలో కాంస్యం) సాధించిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, పురుషుల తరఫున శరత్‌ కమల్‌ ఒలింపిక్స్​లో పతాకధారులుగా వ్యవహరించనున్నారు.

క్రికెట్‌ హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌
భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. జూలై 27 నుంచి శ్రీలంకతో జరిగే సిరీస్​ నుంచి గంభీర్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. డిసెంబర్‌ 2027 వరకు అతని పదవీ కాలం ఉంటుంది.

వింబుల్డన్‌ సింగిల్స్‌ చాంపియన్స్​
వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో మూడో సీడ్‌ అల్కరాస్‌ రెండో సీడ్‌ జకోవిచ్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) తొలిసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో ఏడో సీడ్‌ పావోలిని (ఇటలీ)పై విజయం సాధించింది.

యూరో కప్ విజేత స్పెయిన్
యూరో ఫుట్‌బాల్ కప్‌-2024 టైటిల్‌ను స్పెయిన్ జట్టు దక్కించుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్‌ను 2-–1 తేడాతో ఓడించిన స్పెయిన్‌కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్‌. స్పెయిన్ గోల్‌కీపర్ ఉనాయ్ సిమోన్ టోర్నీలో అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు.

ఆస్కార్‌దే హంగేరియన్‌ గ్రాండ్‌ప్రి
హంగేరి ఫార్ములావన్‌ గ్రాండ్‌ ప్రిని ఆస్ట్రేలియా యువ రేసర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి గెలుచుకున్నాడు. రెండో స్థానంలో పోటీని మొదలుపెట్టిన ఆస్కార్‌ పోల్‌ పొజిషన్‌ సాధించిన నోరిస్‌ (మెక్‌లారెన్‌)ను దాటేశాడు. ఒక గ్రాండ్‌ప్రిని గెలవడం ఆస్కార్‌కు ఇదే తొలిసారి.

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో పేస్, విజయ్‌
భారత దిగ్గజ ఆటగాళ్లు లియాండర్‌ పేస్, విజయ్‌ అమృత్‌రాజ్‌ టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఆటగాడి విభాగంలో పేస్‌.. టెన్నిస్‌కు సేవలందించిన ప్లేయర్ల కేటగిరిలో అమృత్‌రాజ్‌ ఈ గౌరవాన్ని అందుకున్నారు. హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేరిన తొలి ఆసియా క్రీడాకారులుగా పేస్, విజయ్‌ ఘనత సాధించారు.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

అభ్యాస్ పరీక్ష సక్సెస్​
డిఫెన్స్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేసన్​ మెరుగైన బూస్టర్​ కాన్ఫిగరేషన్​తో హై స్పీడ్​ ఎక్స్​పెండబుల్​ ఏరియల్​ టార్గెట్​ ‘అభ్యాస్​’ ఆరవసారి డెవలప్​మెంట్​ ట్రయల్స్​ను ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్​ ఇంటిగ్రేటెడ్​ టెస్ట్​ రేంజ్​ వద్డ పరీక్షించింది.

‘కిసాన్‌ కవచ్‌’తో అభయం
పంట పొలాలకు పురుగు మందులు వాడే క్రమంలో రైతులు రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో రైతుల ఆరోగ్యానికి అభయమిచ్చేలా బెంగళూరుకు చెందిన ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్టెమ్‌ సెల్‌ సైన్స్‌ అండ్‌ రీజనరేటివ్‌ మెడిసిన్‌ (ఇన్‌స్టెమ్‌) ఆధ్వర్యంలో ‘కిసాన్‌ కవచ్‌’ పేరిట పీపీఈ కిట్‌ను రూపకల్పన చేశారు.

మత్స్య 6000 మిషన్
బంగాళఖాతం, హిందూమహాసముద్రం వంటి సముద్రగర్భాల్లోకి వెళ్లి శాస్ర్తవేత్తలు వెళ్లి లోతైన పరిశోధన చేసేందుకు డీప్​ ఓషన్​ మిషన్​ (డీఓఎమ్​)ను మినిస్ట్రీ ఆఫ్​ ఎర్త్​ సైన్సెస్​ ‘సముద్రయాన్​’లో భాగంగా మత్స్య 6000 పేరుతో మానవసహిత సబ్​ మెర్సిబుల్​ వాహనం త్వరలో ప్రయోగించనుంది.

రోహిణి- 560 రాకెట్ ప‌రీక్ష సక్సెస్
శ్రీహ‌రికోట‌లోని షార్ సెంట‌ర్ నుంచి రోహిణి-560 సౌండింగ్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. దేశీయంగా తాము అభివృద్ధి చేసిన ఎయిర్ బ్రీతింగ్ ప్రొప‌ల్షన్ టెక్నాల‌జీని ప్రయోగించ‌డ‌మో ప్రయోగం ల‌క్ష్యమ‌ని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటి వ‌ర‌కు ప్రయోగించిన అతి భారీ సౌండింగ్ రాకెట్ ఇదే.

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : మే​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఏప్రిల్​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : మార్చి​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఫిబ్రవరి​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : జనవరి​ 2024

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!