తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఎంట్రన్స్ (TG EAPCET 2025) అప్లికేషన్లకు రేపే చివరి తేదీ. ఏప్రిల్ 4వ తేదీ వరకు విద్యార్థులు ఆన్ లైన్లో ఎప్‌సెట్ అప్లికేషన్లు నమోదు చేసుకోవాలి. లేట్ ఫీజు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. లేట్ ఫీ తో ఏప్రిల్ 24వ తేదీ వరకు విద్యార్థులు అప్లై చేసుకునే వీలుంది. విద్యార్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, దీంతో విద్యార్థులు తాము ఎంచుకున్న చోట పరీక్ష కేంద్రాలను కేటాయించే వీలుంటుందని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే అప్లై చేసిన విద్యార్థులు తమ అప్లికేషన్లలో ఏవైనా సవరణలు చేసుకోవాలంటే.. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం ఎప్‌సెట్ ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు, ఇంజినీరింగ్ పరీక్షలు మే 2, 3, 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఎప్‌సెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్/ బీటెక్ (బయో-టెక్నాలజీ)/ బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్)/ బీఫార్మసీ/ బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)/ బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్/ బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (ఫారెస్ట్రీ)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎఫ్ఎస్సీ ఉంటాయి. ఇవే కాకుండా ఫార్మ్-డీ, బీఎస్సీ (నర్సింగ్)లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎప్‌సెట్ పరీక్షలో అర్హత పొందేందుకు ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి.
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరాలంటే 2025 డిసెంబరు 31 నాటికి 16 ఏళ్లు నిండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు.
బీటెక్ డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్‌కు 17 ఏళ్లు (2025 డిసెంబరు 31 నాటికి) నిండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25, ఇతరులకు 22 ఏళ్లు గరిష్ఠ వయోపరిమితి వర్తిస్తుంది.