తెలంగాణలో గ్రామ పాలనాధికారుల (Grama Palana Officer) పోస్టుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం పని చేస్తున్న వీఆర్‌ఓలు (Village Revenue Officers), వీఆర్‌ఏలు (Village Revenue Assistants) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. మొత్తం 10954 గ్రామ పాలనాధికారుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో ప్రస్తుతం పని చేస్తున్న వీఆర్వోలు, వీఆర్ఏలకు మొదటగా అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో 6 వేల మంది డిగ్రీ పూర్తి చేసిన వీఆర్వోలు, వీఆరోఏలున్నారు. ఆసక్తి అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సీసీఎల్‌ఏ ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
దరఖాస్తుల ప్రక్రియ
అభ్యర్థులు గూగుల్ ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. అదనంగా, స్వయంగా సంతకం చేసిన దరఖాస్తు ఫారమ్ కాపీని సంబంధిత జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ లింక్ (https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7)
ఇప్పటికే ఈ నియామకాలకు సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం మార్చి 29న జీవో నెం. 129 జారీ చేసింది. రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడుతారు.
- అర్హతలు:
- గ్రామ పాలనాధికారుల పోస్టులను ప్రస్తుతం వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పని చేస్తున్న వారితో భర్తీ చేస్తారు. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై, రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఈ పోస్టులకు అర్హులు.
- డిగ్రీ లేని అభ్యర్థులు ఇంటర్ తో పాటు వీఆర్వోలుగా ఐదేళ్లు పనిచేసిన అనుభవముండాలి. లేదంటే వీఆర్‌ఏతో పాటు ఇతర శాఖల్లో నియమితులై ఐదేళ్లు పూర్తయి ఉండాలి.
- గతంలో వీఆర్వోలుగా పనిచేసి ఇతర శాఖల్లో విలీనమైన వారు, వీఆర్‌ఏలుగా పనిచేస్తూ ఇతర శాఖల్లో రికార్డ్/ జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైన వారిని అర్హతల ఆధారంగా ఈ పోస్టుల్లో నియమిస్తారు.
ఉద్యోగ బాధ్యతలు:
ప్రభుత్వం చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు లబ్దిదారులను గుర్తించడం, ఎన్నికల విధులు, ప్రొటోకాల్ సహకారం, ఇతర ప్రభుత్వ శాఖలతో గ్రామ, క్లస్టర్, మండల స్థాయిలో అంతర్గత సహకారం, గ్రామ పద్దుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలకు ప్రాథమిక విచారణ, ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి వనరుల ఆక్రమణలపై విచారణ, భూ వివాదాల దర్యాప్తు, భూముల సర్వేలో సర్వేయర్లకు సహకారమందించడం, ప్రకృతి విపత్తుల సమయంలో పని చేయటం, అత్యవసర సర్వీసులందించడం, సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలు నిర్దేశించే ఇతర పనులు.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుదారులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. రెవెన్యూ వ్యవస్థపై దరఖాస్తుదారులకు ఉన్న అవగాహనను అంచనా వేసే విధంగా పరీక్ష ఉంటుంది.







