గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ లేట్ అవనుంది. మహిళా రిజర్వేషన్లపై హైకోర్టు తుది తీర్పు ఇంకా వెలువడలేదు. దీంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశముందని TSPSC వర్గాలు చెబుతున్నాయి. దీంతో హైకోర్టు ఫైనల్ తీర్పు తర్వాతే ఫలితాలొచ్చే ఛాన్స్ కనబడుతోంది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నది. మహిళా రిజర్వేషన్లపై స్పష్టత రాకపోవడమే ప్రధాన కారణం. పోస్టులను బట్టి రోస్టర్ పాయింట్లను బట్టి వర్టికల్ విధానంలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కానీ రిజర్వేషన్ల పరిమితి మించకుండా హారిజంటల్ విధానమే అమలు చేయాలనీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఆదేశాలిచ్చి నెలన్నర రోజులైనా, ఇప్పటికీ సర్కారు నుంచి స్పందన రాలేదు. మరోపక్క తుది తీర్పు తర్వాతే ముందుకు పోయే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆ తీర్పు వచ్చే వరకూ ప్రిలిమ్స్ రిజల్ట్ ప్రకటించే అవకాశం లేకుండా పోయింది.
తెలంగాణలో గ్రూప్1 పోస్టుల భర్తీకి ఏప్రిల్ నెలాఖరులో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంట్లో 503 పోస్టులను భర్తీ చేస్తామనీ ప్రకటించింది. దీంట్లో 278 పోస్టులు, ఉమెన్స్ కేటగిరిలో 225 పోస్టులను భర్తీ చేస్తామనీ వెల్లడించింది. మహిళలకు ప్రత్యేకంగా 33% రిజర్వేషన్లను అమలు చేస్తూ, నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ పోస్టుల సంఖ్య అంతకు మించిపోయింది. దీనివల్ల తాము నష్టపోతామనీ కొడెపాక రోహిత్, డి.బాలకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు పాత విధానం అమలు చేయాలనీ సెప్టెంబర్ నెలాఖరులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
రిజర్వేషన్ల కేటగిరీల్లోనే కాకుండా జనరల్ కోటాతో కలిపి మొత్తంగా 33 శాతం మహిళలను ఉద్యోగాల్లో నియమించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను చేయాలని ఆదేశించింది. నాడు ఆ కేసును నవంబర్ 1కి వాయిదా వేసింది. అయితే ఇప్పటికీ ఆ కేసు హైకోర్టు హియరింగ్ లిస్టులోకి రాలేదని అధికారులు చెప్తున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను అక్టోబర్16న నిర్వహించింది. దీనికి 3,80,082 మంది దరఖాస్తు కోగా, 2,86,021 మంది అటెండ్ అయ్యారు. అదేనెల 29న ప్రిలిమినరీ కీ రిలీజ్ చేశారు. నవంబర్ 4 వరకూ ‘కీ’పై ఆబ్జెక్షన్లూ తీసుకున్నారు. పదిరోజుల్లోనే ఫైనల్ కీ ప్రకటిస్తామనీ అధికారులు వెల్లడించారు.
ఇంకో వారంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ రిలీజ్ చేసే అవకాశముంది. కానీ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారా లేదా అనేది స్పష్టత రాలేదు. ప్రస్తుతం ప్రిలిమ్స్‌లో ఒక్కో కేటగిరిలో ఒక్కో పోస్టుకు 1:50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేయాల్సి ఉంది. మహిళా రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాకపోవడంతో మెయిన్స్ కు ఎలా ఎంపిక చేస్తారనే సందేహాలు మొదలయ్యాయి. వర్టికల్ పద్దతిలో నోటిఫికేషన్ ఇవ్వగా, హైకోర్టు మాత్రం హారిజంటల్ ప్రకారమే ముందుకు పోవాలని సూచించింది. ఒకవేళ కోర్టు ఆదేశాలతో హరిజంటల్ ప్రకారం ముందుకు పోవాలంటే మళ్లీ అన్నీ పోస్టులకూ రిజర్వేషన్లను మార్చాల్సి ఉంటుంది. ఈ లెక్కన కొన్ని కేటగిరిల్లో మహిళలకు పోస్టులు తగ్గుతాయి. కానీ ఇప్పటికీ అధికారులు ఈ ప్రక్రియ మొదలుపెట్టలేదు. హైకోర్టు తుదితీర్పు ప్రకారమే ముందుకు పోతామని అధికారులు చెప్తున్నారు.
ఒక మార్కు కలిపే ఛాన్స్
ఈ నెల 16న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి (TSPSC Group-1) సంబంధించి ప్రాథమిక పరీక్షను నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ప్రైమరీ కీని (Group-1 Key) నాలుగు రోజుల క్రితం అధికారులు విడుదల చేశారు. “కీ” కి సంబంధించిన అభ్యంతరాలను నవంబర్ 4వ తేదీన సాయంత్రం వరకు స్వీకరించారు. అయితే.. ఈ ‘కీ’ పై పెద్దగా అభ్యంతరాలు రాలేదని టీఎస్పీఎస్సీ (TSPSC) వర్గాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి కేవలం ఐదారు ఆన్సర్లపై మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో ఒకే ప్రశ్నకు సంబంధించి చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే.. ‘కీ’పై తక్కువ అభ్యంతరాలు మాత్రమే రావడంతో టీఎస్పీఎస్సీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యంతరాల పరిశీలనకు బుధవారం ఎక్స్ పర్ట్ కమిటీని టీఎస్పీఎస్సీ నియమించనుంది. ఈ కమిటీ నివేదిక మేరకు వారం, పదిరోజుల్లోనే గ్రూప్ 1 ఫైనల్ కీ రిలీజ్ చేయన్నట్టు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువ అభ్యంతరాలు వచ్చిన ప్రశ్నకు సంబంధించి అభ్యర్థులకు ఒక మార్కు కలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.