గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడుంటుందని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అప్డేట్ న్యూస్ వెలువడింది. టీఎస్పీఎస్సీ (TSPSC) గ్రూప్ 2 (GROUP 2) పరీక్షల తేదీని ఖరారు చేసింది. ముందుగా వెల్లడించిన ప్రకారమే ఆగస్ట్ నెలలోనే ఈ పరీక్ష నిర్వహించనుంది. ఆగస్ట్ 29, 30 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. వారం రోజుల ముందుగా హాల్ టికెట్లను అఫిషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది.

రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మొత్తం 5,51,901 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడుతున్నారు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ల సంఖ్య పోస్టుల సంఖ్య ప్రకారం ఒక్కో పోస్టుకు సగటున 705 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 44 శాతం.. అంటే 350 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి. మొత్తం 600 మార్కులకు గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 150 మల్టిపుల్ ఛాయిల్ ప్రశ్నలు ఉంటాయి. ఆగస్ట్ 29న రెండు పేపర్లు, ఆగస్ట్ 30న రెండు పేపర్లు నిర్వహిస్తారు. ఒక్కో పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.