టీచర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో విధివిధానాల తయారీపై విద్యాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. జిల్లా సెలెక్షన్ కమిటీ (DSC) ద్వారా ఈ నియామకాల ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం డీఎస్సీలో వచ్చే మెరిట్, టెట్‌లో వచ్చిన మార్కుల వెయిటేజీ, రిజర్వేషన్ల కోటా మేరకు సెలెక్షన్ జరుగుతుంది. ప్రతి జిల్లాల్లోనూ 95 శాతం మంది లోకల్. 5 శాతం మంది నాన్ లోకల్ కోటా అమలవుతుంది. డీఎస్సీ రాత పరీక్షకు 80 శాతం మార్కులు, టెట్ వెయిటేజీకి మిగతా 20 మార్కులను మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో టెట్‌లో వచ్చే మార్కుల వెయిటేజీని ఎలా లెక్కిస్తారనేది అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అవసరముంది. పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.
నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్( ఎన్సీటీఈ) రూల్స్ ప్రకారం నిర్వహించే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్‌కు (TS TET) కు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యత ఉంది. మొత్తం 150 మార్కులకు నిర్వహించే ఈ అర్హత పరీక్షలో అభ్యర్థి సాధించే మార్కుల్లో 20 శాతం మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)లో వెయిటేజీ ఇస్తారు. అందుకే దీనిని ఎలిజిబులిటీ టెస్ట్‌గా కాకుండా అభ్యర్థులు పోటీపడి చదివి మార్కులు తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 139 మార్కులు హయ్యస్ట్ స్కోర్‌గా నమోదైంది.
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ నిర్వహించకముందు అభ్యర్థులు నేరుగా ఉపాధ్యాయ నియామక పరీక్షకు (డీఎస్సీ/ టీఆర్టీ) హాజరయ్యే వారు. అందులో వచ్చిన కటాప్ మార్కులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఫైనల్ మెరిట్ జాబితాను విడుదల చేసేవారు. అప్పుడు అర మార్కు తేడాతో ఉద్యోగాలను కోల్పోయేవారు. కానీ టెట్ పరీక్షను ప్రవేశపెట్టిన తర్వాత 150 మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వడంతో పాయింట్లలో ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం టెట్‌లో మంచి మార్కులు సాధిస్తే ఉద్యోగానికి చేరువైనట్టుగా అభ్యర్థులు భావిస్తున్నారు. మరోవైపు టెట్‌లో ఉన్న 70 శాతం సిలబస్ డీఎస్సీలోనూ ఉండడంతో టెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
టెట్ స్కోర్‌కు పర్సంటేజీ ఇలా..
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్‌లో 150 మార్కులకు గాను ఒక అభ్యర్థి 110 మార్కులు సాధిస్తే.. 110÷150×20= 14.6 మార్కులను డీఎస్సీలో కలుపుతారు. అంటే డీఎస్సీలో 80 మార్కులకు గాను 60 మార్కులు సాధిస్తే.. 60+14.6 = 74.6 మొత్తం మార్కులుగా పరిగణించి మెరిట్ తీస్తారు.
అదే విధంగా మరో అభ్యర్థి 135 టెట్‌లో సాధించాడని అనుకుంటే 135÷150×20= 18 మార్కులను డీఎస్సీలో సాధించిన మార్కులకు కలుపుతారు. ఒకవేళ డీఎస్సీలో 80 మార్కులకు 65 మార్కులు సాధిస్తే 65+18=83 మార్కులు అభ్యర్థి సాధించినట్టుగా లెక్కగట్టి రిజల్ట్ ప్రకటిస్తారు. ప్రస్తుతం జనరల్ అభ్యర్థులకు 90 మార్కులు, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 60 మార్కులు సాధిస్తే అర్హులుగా ఎంపిక చేస్తున్నారు.
మార్కుల వారీగా టెట్ స్కోర్ ఎంత యాడ్ అవుతుందో కింది చార్ట్‌లో తెలుసుకోండి.
