తెలంగాణ క్రీడా సాధికార సంస్థ ‘సాట్స్’– కరీంనగర్, ఆదిలాబాద్, హకీంపేట్ స్పోర్ట్స్ స్కూళ్లలో 4, 5వ తరగతులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఫిజికల్ మరియు మెడికల్ టెస్టులు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
4వ తరగతిలో చేరేందుకు 8–9 సంవత్సరాలు, 5వ తరగతిలో ప్రవేశానికి 9–10 సంవత్సరాల వయసు ఉండాలి. ముందుగా విద్యార్థులకు బరువు, ఎత్తును కొలుస్తారు. తర్వాత ఫిజికల్ టెస్ట్‌లో భాగంగా 30 మీటర్ల ప్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6 నిమిషాల్లో 10 మీటర్ల షటిల్ రన్, మెడిసిన్ బాల్ త్రో, వర్టికల్ జంప్, ప్లెక్స్బిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. అనంతరం మెడికల్ టెస్ట్‌లో భాగంగా వయసు ధృవీకరణ, బోన్ అబ్నార్మాలిటీని పరీక్షించి ఎంపిక చేస్తారు.
ఆసక్తి గల విద్యార్థులు ముందుగా మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబర్చిన వారికి కరీంనగర్, ఆదిలాబాద్, హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇస్తారు.
మండల స్థాయిలో ఫిబ్రవరి 20, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 26, రాష్ట్ర స్థాయిలో మార్చి 1నుంచి 14వ తేదీ వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో మొత్తం 240 సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఎంపికైన విద్యార్థులకు స్పోర్ట్స్స్కూల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారు. ఉన్నత ప్రమాణాలతో విద్యనందించడంతో పాటు అత్యుత్తమమైన క్రీడా శిక్షణ, పౌష్టికాహారం అందిస్తారు. స్పోర్ట్స్ స్కూళ్లలో విజయవంతంగా చదువు పూర్తి చేసుకున్న వారికి రైల్వే, ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్స్, పోలీస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు తదితర రంగాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
వెబ్సైట్: http://sats.telangana.gov.in
