గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్ట్ 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) ఏర్పాట్లు చేస్తోంది. ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (OMR) పద్ధతిలోనే ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఆగస్టు 29, 30వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. మొత్తం 783 గ్రూప్ 2 ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్ట్‌కు 705 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పరీక్ష నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై టీఎస్‌పీఎస్సీ అధికారులు ఇటీవలే సమీక్ష జరిపారు.
పరీక్ష జరిగే ఎగ్జామ్ సెంటర్లకు హాలీడే ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఆ రెండు రోజులు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నత విద్యామండలి, కాలేజీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
