తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET) హాల్ టికెట్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ముందుగా అగ్రికల్చర్, ఫార్మసీ హాల్ టికెట్లను విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించింది. ఈ నెల 22 (ఎల్లుండి) నుంచి ఇంజనీరింగ్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతుంది. హాల్ టికెట్ల డౌన్లోడ్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది.
ఈ నెల 29 నుంచి మే 4 వరకు తెలంగాణ ఈఏపీ సెట్ (TG EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పరీక్షలు జరుగుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లోని 124 కేంద్రాల్లో ఎప్‌సెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వచ్చి అప్లికేషన్ల ప్రకారం ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది.. అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు తెలిపారు.
తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET) 2025 రాసే అభ్యర్థులకు ఉపయోగపడే నమూనా పరీక్షలు ఉన్నత విద్యామండలి అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఎలాంటి పాస్‌వర్డ్ లేకుండానే వివిధ పేపర్ల మాక్ టెస్టులు వినియోగించుకోవచ్చు. ఈ నమూనా పరీక్ష ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే ఎప్‌సెట్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుంటుంది.