Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఏప్రిల్​లో జరగాల్సిన టీఎస్​పీఎస్​సీ పరీక్షలన్నీ వాయిదా..!

ఏప్రిల్​లో జరగాల్సిన టీఎస్​పీఎస్​సీ పరీక్షలన్నీ వాయిదా..!

టీఎస్​పీఎస్​సీ పేపర్ల లీకేజీతో (TSPSC) తదుపరి పరీక్షలన్నీ మరికొన్ని రోజులు వాయిదా పడనున్నాయి. లీకేజీతో రద్దయిన పరీక్షలను, వాయిదా వేసిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే అయోమయం కొద్ది రోజులుగా కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తదుపరి పరీక్షలను ఎలా నిర్వహించాలి.. ఏమేం కట్టుదిట్టమైన చర్చలు తీసుకోవాలనే విషయంలో టీఎస్​పీఎస్​సీ సమాలోచనలు చేస్తోంది. అందులో భాగంగా షెడ్యూల్​ ప్రకారం ఏప్రిల్​లో జరగాల్సిన పరీక్షలన్నీ మరికొంత ఆలస్యంగా నిర్వహించాలని భావిస్తోంది.

గ్రూప్​ 1, ఏఈ పేపర్ల లీకేజీ కారణంగా టీఎస్​పీఎస్​సీ నాలుగు నోటిఫికేషన్లను రద్దు చేసింది. రెండు పరీక్షలను వాయిదా వేసింది. గ్రూప్‌-1 (GROUP 1) ప్రిలిమినరీతో పాటు డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి (DAO), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(AEE), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(AE) పరీక్షలు రద్దు కాగా.. టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(TPBO), వెటర్నరీ అసిస్టెంట్‌ (VETERNARY ASISTANT) పరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని కమిషన్‌ ఇప్పటికే ఖరారు చేసింది. ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రద్దయిన మిగతా పరీక్షలతో పాటు వాయిదా పడిన పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్​పీఎస్​సీ ప్రకటించాల్సి ఉంది.

వచ్చే వారంలో జరగాల్సిన హార్టికల్చర్‌ ఆఫీసర్​ (HORTICUTURE OFFICER) పోస్టుల పరీక్షను వాయిదా వేయాలని టీఎస్​పీఎస్​సీ భావిస్తోంది. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 4న ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలకు సంబంధించిన రెండు పేపర్లను నిర్వహించాల్సి ఉంది. వారం రోజుల ముందే అంటే ఈ రోజు నుంచి (మార్చి 28వ తేదీన) ఆన్​లైన్​లో హాల్​ టికెట్లను అందుబాటులో ఉంచాలి. కానీ టీఎస్​పీఎస్​సీ అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఆన్​లైన్లో నిర్వహించే ఈ పరీక్షలను కూడా కొద్ది రోజులు వాయిదా వేయాలని టీఎస్​పీఎస్​సీ భావిస్తోంది. ఈరోజు సాయంత్రానికి పరీక్షల తేదీలపై టీఎస్​పీఎస్​సీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలున్నాయి.

రద్దయిన ఈ పరీక్షను జూన్ 11న నిర్వహిస్తామని టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇంకా దర్యాప్తు దశలోనే ఉండడం, సిట్ ఎంక్వైరీ పూర్తి కాకపోవడంతో జూన్​ 11న ఈ పరీక్ష జరుగుతుందా..? మరింత లేటవుతుందా.. అనే సందిగ్ధం అభ్యర్థులను వెంటాడుతోంది. గ్రూప్​ 1 రీ షెడ్యూలు కావటంతో తదుపరి జరగాల్సిన పరీక్షల తేదీలు కూడా మరి కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం గ్రూప్ 4 జులై 1న, గ్రూప్ 2 పరీక్ష ఆగస్టు 29, 30 తేదీల్లో జరగాలి. కానీ టీఎస్​పీఎస్​సీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమయ్యేంత వరకు పరీక్షల నిర్వహణపై ఆచీతూచీ వ్యవహరించాలని కమిషన్​ భావిస్తోంది.

పోటీ తక్కువ ఉన్న నోటిఫికేషన్ల రాతపరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహించాలని టీఎస్​పీఎస్​సీ ఆలోచనలు చేస్తోంది. ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సిన హార్టికల్చర్‌ అధికారులు, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, భూగర్భజల అధికారులు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల పరీక్షలను రీషెడ్యూలు చేయనుంది. వీటన్నింటినీ వారం నుంచి 15 రోజుల వ్యవధితో నిర్వహించేలా కొత్త తేదీలపై టీఎస్​పీఎస్​సీ కసరత్తు చేస్తోంది. ఏయే పరీక్షలను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు? ఏయే పరీక్షలు ఓఎంఆర్‌ పద్ధతిలో ఉంటాయన్న అంశాన్నీ కొత్త తేదీలతో పాటు ప్రకటించే అవకాశాలున్నట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!