తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2025) అప్లికేషన్లకు గడువు ఈ రోజుతో ముగియనుంది. గతంతో పోలిస్తే ఈసారి టెట్‌కు దాదాపు సగం దరఖాస్తులు తగ్గాయి. మంగళవారం రాత్రి వరకు 1.36 లక్షల మంది అభ్యర్థులు ఫీజు చెల్లించారు. వారిలో 1.34 లక్షల మంది దరఖాస్తు సమర్పించారు. ఈ రోజు చివరి గడువు ఉన్నందున మొత్తం దరఖాస్తులు 1.50 లక్షలకు మించకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గడానికి పలు కారణాలున్నాయి. గతేడాది ప్రభుత్వం రెండుసార్లు టెట్ నిర్వహించింది. చివరిసారిగా గత జనవరిలో నిర్వహించిన టెట్-2024 పరీక్షకు 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 2,05,278 మంది పరీక్ష రాశారు. మళ్లీ నాలుగు నెలలకే నోటిఫికేషన్ రావటంతో కొత్తగా డీఈడీ, బీఈడీ పాసైన అభ్యర్థులు ఎక్కువగా లేకపోవటం ప్రధాన కారణం. మరోవైపు ఎన్నిసార్లు రాసినా మార్కులు పెరిగే అవకాశం లేదని అభ్యర్థులు కొందరు ఈ పరీక్షకు దూరంగా ఉంటున్నారు.
ఈసారి టెట్ పరీక్షలు జూన్ 15-30వ తేదీ మధ్యలో ఆన్లైన్లో నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలను దూరంగా వేస్తున్నారనే కారణంతో అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గత జనవరిలో జరిగిన పరీక్షకు ఏకంగా 70 వేల మంది గైర్హాజరయ్యారు.
ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్-1, ఉన్నత పాఠశాలల్లో (6-10 తరగతులు) బోధనకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఓసీలకు-90, బీసీ-75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు.
📘 TS TET 2025 – Quick Guide
All essential Telangana TET 2025 details in one place – official links, syllabus, and previous papers.