రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 11వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈ రోజు మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పదో తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తుండగా.. 6 పేపర్లకు కుదించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి 6 పేపర్లు, వంద శాతం సిలబస్ తో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాల్లో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా పాస్ పర్సంటేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించాలన్నారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ను మార్చి, ఫిబ్రవరి నెల్లలో నిర్వహించాలని మంద్రి ఆదేశించారు. మోడల్ ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు.

ఈ సారి నుంచి ఆరు పేపర్లు..
ఈ ఏడాది నుంచి 9, 10 తరగతి విద్యార్థులకు 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఈ సంస్కరణలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు అధికారులు.