ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీఎస్సీ అగ్రికల్చర్ సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక కోటా కింద అదనంగా 200 సీట్లను పెంచుతున్నట్లు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వైస్ ఛాన్సలర్ ఆల్దాస్ జానయ్య ప్రకటించారు. ప్రస్తుతం సాధారణ కేటగిరీలో 615 సీట్లు మరియు ప్రత్యేక ఫీజు తో సుమారు 227 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో అదనంగా పెంచిన ఈ 200 సీట్లని ఈ కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయనున్నారు. అదనంగా పెంచిన సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ లో రెండు మూడు రోజుల్లో ఉంచుతారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వీసీ సూచించారు.
దీంతోపాటు ప్రస్తుతం ప్రత్యేక కోటా లో ఉన్న బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు కు నాలుగు సంవత్సరాలకి కలిపి మొత్తం పది లక్షల రూపాయలు ఫీజు ఉండగా… దానిని 5 లక్షల రూపాయలకు తగ్గించారు. అడ్మిషన్ల టైమ్ లో ఒకేసారి మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా.. దానిని తగ్గించారు. కేవలం 65000 రూపాయలు మాత్రమే చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో అగ్రికల్చర్ కోర్సులో చేరే విద్యార్థులకు వెసులుబాటు లభించినట్లయింది.
ఇప్పటివరకు సాధారణ సీట్ల ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. విద్యార్థుల నుంచి ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల నుంచి అగ్రికల్చర్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. అందుకే సీట్ల సంఖ్యను పెంచే నిర్ణయం తీసుకున్నట్లు వీసీ ప్రకటించారు. వ్యవసాయ విద్యకు పెరుగుతున్న డిమాండ్ ను ఆసరాగా తీసుకొని సాంకేతికపరమైన గుర్తింపు లేని కొన్ని ప్రైవేటు సంస్థలు లక్షలకు లక్షలు ఫీజులు పెట్టి లేనిపోని మాయమాటలు చెప్పి విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సులకు అవసరమైన కనీస వసతులు, సిబ్బంది కూడా లేకపోయినా కొన్ని ప్రైవేటు సంస్థలు వ్యవసాయ విద్యకు పెరుగుతున్న డిమాండ్ ను ఒక వ్యాపారంగా మార్చుకుని దోపిడీకి పాల్పడుతున్నారని వీసీ అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులని వారి తల్లిదండ్రులు ఇలాంటి గుర్తింపు లేని ప్రైవేటు సంస్థలలో చేర్చి విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేయవద్దని ప్రొఫెసర్ జానయ్య సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను మరియు విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని అదనంగా సీట్లు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా నైపుణ్యంతో కూడిన వ్యవసాయ పట్టభద్రుల సంఖ్య గణనీయంగా అవసరం పడనున్నది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశ పెడుతున్న వివిధ కోర్సుల తో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకి సంబంధించిన స్వల్పకాలిక కోర్సులను కూడా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రవేశపెట్టనున్నట్లు ప్రొఫెసర్ జానయ్య తెలిపారు. దీంతోపాటు ప్రస్తుతం వ్యవసాయ కళాశాలలు లేని నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో కూడా నూతనంగా వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఉపకులపతి తెలిపారు.