రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (CPGET 2023) నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా వర్సిటీ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు,శాతవాహన, జేఎన్టీయూతో పాటు కొత్తగా తెలంగాణ మహిళా యూనివర్సిటీలోనూ అడ్మిషన్లు చేపడుతారు. ఎనిమిది యూనివర్సిటీల పరిధిలో ఉన్న 320 పీజీ కాలేజీల్లో దాదాపు 45 వేల సీట్లున్నాయి. వీటన్నింటినీ సీపీగెట్ లో వచ్చే మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేస్తారు.
మే 12 నుంచి అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 11 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. రూ.500 ఫైన్‌తో జూన్ 18 వరకూ, రూ.2 వేల ఫైన్‌తో జూన్ 20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తుది గడువు నిర్ణయించింది.
జూన్ చివరి వారం నుంచి సబ్జెక్టుల వారిగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. డిగ్రీలో ఏ సబ్జెక్టు చదివిన వారైనా సోషల్ సైన్స్, లాంగ్వేజీ కోర్సుల్లో పీజీ చేసేందుకు అర్హులుగా పరిగణిస్తారు.
