గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. టీఎస్పీఎస్సీతో సమాలోచనలు జరిపి తదుపరి పరీక్షల తేదీని ఖరారు చేయాలని సూచించారు. లక్షలాది మంది అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. అన్ని ఉద్యోగ నియామకాలకు అభ్యర్థులు ప్రిపేరయ్యేలా తగినంత వ్యవధి ఉండేలా పరీక్షలు నిర్వహించాలని సీఎం సూచించారు. లక్షలాది మంది అభ్యర్థుల ఆందోళనపై సీఎం స్పందించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీటర్ ద్వారా ప్రకటించారు. దీంతో సీఎస్ శాంతి కుమారి రేపు ఉదయం టీఎస్పీఎస్సీ అధికారులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం ఆదేశాలతో గ్రూప్ 2 పరీక్ష రీషెడ్యూలు కానుంది. తిరిగి నవంబర్‌లో పరీక్ష జరిగే అవకాశాలున్నాయి.
