ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి ఈ పోస్టులను భర్తీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మొత్తం 1654 గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 19వ తేదీ నుంచి జులై 24 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సెలెక్షన్ షెడ్యూలు ప్రకటించింది. జిల్లాల వారీగా, సబ్జెక్టుల వారీగా ఉన్న పోస్టుల ఖాళీలపై డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 19వ తేదీన ప్రకటన జారీ చేస్తారు. అర్హులైన అభ్యర్థుల నుంచి 24 వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అప్లికేషన్ల పరిశీలన అనంతరం 27వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. మరుసటి రోజున గెస్ట్ లెక్చరర్ల సెలెక్షన్ జాబితా విడుదల చేస్తారు.
గెస్ట్ లెక్చరర్ల కొత్త నోటిఫికేషన్‌పై కాలేజీల్లో గతంలో పని చేసిన గెస్ట్ లెక్చరర్లలో ఆందోళన మొదలైంది. పదేండ్లుగా పని చేస్తున్న తమను తొలగించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వటం సరి కాదని వీరందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంటర్ బోర్డు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
