తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్-4 ఖాళీల భర్తీకి జులై 1న పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే.. గతంలో జరిగిన ఇబ్బందులను, లోపాలను పరిగణలోకి తీసుకున్న టీఎస్ పీఎస్సీ పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహణకు చర్యలు చేపట్టింది.
- పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది.
- ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనుండగా.. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించమని తెలిపింది.
- పేపర్ మధ్యాహ్యం ఎగ్జామ్ 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు నిర్వహించనుండగా.. 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కమిషన్ స్పష్టం చేస్తోంది.
- పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంట గంట నుంచే కేంద్రంలోకి అనుమతించనున్నారు.
- ఈ నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని కమిషన్ కోరుతోంది.
- ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని కమిషన్ సూచించింది. ఇంకా షూలు ధరించి రావొద్దని.. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని తెలిపింది.
- అభ్యర్థులను తనిఖీ తరువాత కేంద్రంలోకి అనుమతించనున్నారు. దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో వేలిముద్రను తప్పనిసరి చేశారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
- ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.
- ఒక వేళ.. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేస్తోంది. అలాంటి వారిపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు సదురు అభ్యర్థిని మిగతా అన్ని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించనున్నట్లు తెలిపింది.
- ఓఎంఆర్ షీట్లో బ్లూ/బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది.
- హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని కమిషన్ స్పష్టం చేస్తోంది.