Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : మార్చి 2023

కరెంట్​ అఫైర్స్​ : మార్చి 2023

తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు టీఎస్​పీఎస్​సీ (TSPSC), టీఎస్​ఎల్​పీఆర్​బీ (TSLPRB) నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు, యూపీఎస్సీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్​. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ముఖ్యాంశాలు, తెలంగాణ విశేషాలు, సైన్స్​ అండ్​ టెక్నాలజీ, స్పోర్ట్స్, వార్తల్లో వ్యక్తులు.

Advertisement

అంతర్జాతీయం

తొలి డిజిటల్‌ దేశంగా తువాలు
రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా మెటావర్స్‌ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చని ఆ దేశ మంత్రి సైమన్‌ కోఫే తెలిపారు. ఇందులో తువాలు చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్లు, సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ చిత్రాలు, సంప్రదాయ పాటలు నిక్షిప్తం చేయనున్నారు.

బాల్య వివాహాల నిరోధక చట్టం
బాలికలకు చట్టబద్ధ వివాహ వయసును 18 ఏళ్లకు పెంచుతున్న చట్టం ఇంగ్లండ్, వేల్స్‌లలో అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సరికొత్త వివాహ, పౌర భాగస్వామ్య (కనీస వయసు) చట్టం నిరుడు ఏప్రిల్‌లోనే రాజామోదం పొందింది.

ఇరాన్‌ కరెన్సీ పతనం
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, 2015 అణు ఒప్పందం విచ్ఛిన్నత వంటి పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌ కరెన్సీ పతనం అవుతోంది.  తొలిసారిగా డాలర్‌ విలువ 6,00,000 ఇరాన్‌ రియాల్స్‌కు చేరింది. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం రెండేళ్ల క్రితం 41.4 శాతం ఉండగా ఈ ఏడాది జనవరిలో 53.4 శాతానికి చేరింది.

Advertisement

అధ్యక్షుడిగా మూడోసారి జిన్‌పింగ్‌
చైనా అధ్యక్షుడిగా మూడోసారి జిన్‌పింగ్‌ బాధ్యతలు స్వీకరించారు. గతేడాది అక్టోబరు16న  జరిగిన 20వ కమ్యూనిస్ట్‌ పార్టీ కాంగ్రెస్‌లో ఆయన్ను మరోసారి అధ్యక్షుడిగా ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత మూడవసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాయకుడు జిన్‌పింగ్‌నే కావడం విశేషం.

రక్షణ బడ్జెట్‌@225 బిలియన్‌ డాలర్లు
చైనా రక్షణ బడ్జెట్‌ను 7.2 శాతం పెంచడంతో 225 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలో అమెరికా రక్షణ బడ్జెట్‌ 2023 సంవత్సరానికి 816 బిలియన్‌ డాలర్లు. ఆ తరువాత అత్యధిక బడ్జెట్‌ చైనాదే. భారత రక్షణ బడ్జెట్‌ (రూ.5.94 లక్షల కోట్లు/72.6 బిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఉంది.

గిజా పిరమిడ్‌లో సొరంగం
ఈజిప్టులో గ్రేట్‌ గిజా పిరమిడ్‌ ఉత్తర భాగంలో 30 అడుగుల పొడవైన, ఆరు అడుగుల వెడల్పైన సొరంగ ప్రవేశమార్గాన్ని అంతర్జాతీయ పురావస్తు పరిశోధకుల బృందం కనుగొంది. పిరిమిడ్‌లోని గుర్తించని భాగాలను కనిపెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ‘స్కాన్‌ పిరమిడ్స్‌ ప్రాజెక్టు’లో భాగంగా దీన్ని గుర్తించారు.

Advertisement

తొలి భారతీయ అమెరికన్‌ మహిళ
అమెరికాలోని మసాచుసెట్స్‌లో తొలి భారతీయ అమెరికన్‌ మహిళా జడ్జిగా తెజల్‌ మెహతా నియమితులయ్యారు. అయెర్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా ఆమె ప్రమాణస్వీకారం చేశారు. కొంతకాలంగా ఇదే న్యాయస్థానంలో ఆమె సహ న్యాయమూర్తిగా పని చేశారు.

ప్రపంచంలోనే  బెస్ట్‌ విమానాశ్రయం
సింగపూర్‌లోని ‘ఛాంగి’ అంతర్జాతీయ విమానాశ్రయం  ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఖతార్‌ రాజధాని దోహాలోని హమద్‌  అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో నిలవగా.. టోక్యోలోని హనీదా విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది.

చైనా ప్రధానిగా లీ చియాంగ్‌
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అత్యంత విశ్వసనీయుడైన లీ చియాంగ్‌ ఆ దేశ నూతన ప్రధానిగా మంత్రిగా ఎన్నికయ్యారు. గత పదేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న లీ కచియాంగ్‌ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. చియాంగ్‌ పేరును చైనా పార్లమెంట్ ఆమోదించింది.  

Advertisement

ఆస్కార్ అవార్డులు
లాస్ ఏంజిల్స్ వేదిక‌గా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం  ఘ‌నంగా జ‌రిగింది. ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ ఉత్తమ చిత్రంగా నిలవగా, డానియల్‌ క్వాన్, డేనియల్‌ స్కీనెర్ట్‌ ఈ సినిమాకు ‘ఉత్తమ దర్శకుడి’గా అవార్డును గెలుచుకున్నారు. మిషెల్‌ యో ‘ఉత్తమ నటి’ అవార్డును, ‘ది వేల్‌’ చిత్రంతో బ్రెండన్‌ ఫ్రేజర్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

హ్యాపీనెస్‌ ర్యాంకింగ్
అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా యూఎన్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ తాజా ర్యాంకులు విడుదల చేసింది. సంతోష సూచీల్లో నార్డిక్‌ దేశాలైన ఫిన్లాండ్‌ (1), డెన్మార్క్‌ (2), ఐస్‌లాండ్‌ (3) వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో ఉండగా, భారత్‌ 125వ స్థానంలో నిలిచింది.

రష్యాలో జిన్‌పింగ్ పర్యటన
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడు రోజులు రష్యాలో పర్యటించారు. రష్యాపై దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరిని చేసేందుకు పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడం, యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు అరెస్ట్‌ వారెంటు జారీ చేసిన చేసిన నేపథ్యంలో జిన్‌పింగ్‌ రష్యా పర్యటన ప్రారంభించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.  

Advertisement

ఇండియాలో జపాన్‌ ప్రధాని
భారత్‌–జపాన్‌ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. భారత ప్రధాని మోడీ, జపాన్‌ ప్రధాని ప్యుమియో కిషిడాలు రక్షణ, డిజిటల్‌ సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

జాతీయం

కాలుష్య నగరంగా ముంబై
దేశంలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో ముంబై మొదటి స్థానంలో నిలిచింది. అత్యంత కాలుష్య నగరంగా ఉన్న ఢిల్లీని దాటి తొలిస్థానంలో నిలిచిందని, స్విస్‌ ఎయిర్‌ ట్రాకింగ్‌ ఇండెక్స్‌(ఐక్యూ ఎయిర్‌) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్లోని లాహోర్ తొలిస్థానంలో ఉండగా, ముంబై రెండోస్థానంలో నిలిచింది.

విశాఖలో ‘బార్జి’ జలప్రవేశం
నౌకాదళ సేవల కోసం కొత్తగా నిర్మించిన ఎంసీఏ (మిసైల్‌ – అమ్యూనిటైజేషన్‌) బార్జి (భారీ నౌకలను ఒడ్డుకు తీసుకొచ్చి, మళ్లీ సముద్ర జలాల్లోకి పంపేది) విశాఖపట్నం నుంచి జలప్రవేశం చేసింది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో భాగంగా మెజర్స్‌ సెకాన్‌ సంస్థ బార్జి నిర్మాణం చేపట్టిందని నేవీ వర్గాలు తెలిపాయి.  సుమారు 30 ఏళ్లు బార్జి సేవలు అందించనుంది.

Advertisement

ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ పేర్ల మార్పు
మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్ల మార్పు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు. ఔరంగాబాద్‌ను ‘ఛత్రపతి శంభాజీ నగర్‌’గా, ఉస్మానాబాద్‌ను ‘ధారాశివ్‌’గా మార్పు చేశారు.

ఏపీలో పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో అబ్బాయిలను మించి ఆడపిల్లల సంఖ్య పెరిగిపోయింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 2021–22 లేబర్‌ ఫోర్స్‌ సర్వేను కేంద్ర గణాంకాల ప్రకారం  దేశంలో అత్యధికంగా అమ్మాయిలున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి మొదటి స్థానంలో ఉంది.

ఇండోనేసియా రేవులో భారత సబ్మెరైన్
భారత్‌కు చెందిన ‘ఐఎన్‌ఎస్‌ సింధుకేసరి’  జలాంతర్గామి తొలిసారి ఇండోనేసియాలోని రేవులో లంగరేసింది. ఒక సబ్‌మెరైన్‌ను భారత జల సరిహద్దులకు దూరంగా మోహరించడం ఇదే మొదటిసారని నౌకాదళ సీనియర్‌ అధికారులు వెల్లడించారు.

Advertisement

నాగాలాండ్‌ సీఎంగా నెఫ్యూరియో
నాగాలాండ్‌ సీఎంగా నెఫ్యూరియో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్‌డీపీపీ అధినేత అయిన 72 ఏళ్ల నెఫ్యూ ఐదోసారి నాగాలాండ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. రియో కేబినెట్‌లో ఏడుగురు ఎన్‌డీపీపీకి, ఐదుగురు బీజేపీకి చెందినవారున్నారు. తొలిసారి సల్హౌతునొ క్రుసే అనే మహిళకు కేబినెట్‌లో చోటు దక్కింది.

మైసూర్‌ సిల్క్‌కు జీఐ ట్యాగ్‌
మైసూర్‌ సిల్క్, కంగ్రా టీ, తంజావుర్‌ పెయింటింగ్స్‌ వంటి 429 ఉత్పత్తులకు ఇప్పటి వరకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ (జీఐ) ట్యాగ్‌ కేటాయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 31 విదేశీ ఉత్పత్తులు ఉన్నాయి.

మేఘాలయ ముఖ్యమంత్రిగా సంగ్మా
మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత కాన్రాడ్‌ సంగ్మా షిల్లాంగ్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడే కాన్రాడ్‌ సంగ్మా. 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో సీఎంతో సహా 12 మంది మంత్రిగా ప్రమాణం చేశారు.

Advertisement

త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా
త్రిపుర ముఖ్యమంత్రిగా మరోసారి మాణిక్‌ సాహా ఎంపికయ్యారు. భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో భాజపా 32 సీట్లను గెలుచుకుంది.

మహిళలకు ‘లాడ్లి బెహనా’ యోజన
మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా లాడ్లి బెహనా(ప్రియమైన సోదరి) పథకాన్ని ప్రకటించింది. భోపాల్‌లో సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రి ‘లాడ్లి బెహనా యోజన’ఫలకాన్ని ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు. పథకం కింద ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.వెయ్యి అందజేస్తుంది.

శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ కు పురస్కారం
హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌పోర్ట్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీస్‌ క్వాలిటీ సర్వే ద్వారా ‘ఉత్తమ విమానాశ్రయం’ అవార్డుకు ఎంపికైంది. వరుసగా 9 సంవత్సరాలు హైదరాబాద్‌ విమానాశ్రయం గ్లోబల్‌ టాప్‌-3 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తోంది.

Advertisement

గవర్నర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారం
రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు ‘గవర్నర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023’ పురస్కారం వరించింది. కరోనా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో మార్కెట్లను సమర్థంగా నడిపించినందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ సెంట్రల్‌ బ్యాంకింగ్‌ ఈ అవార్డును అందించింది.

ఆయుధ దిగుమతుల్లో నంబర్ వన్
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్‌ కొనసాగుతోంది. స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రీ) తన తాజా నివేదికలో ప్రపంచంలో తొలి ఐదు ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారులుగా వరుసగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ ఉన్నాయి.

ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌
ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ 2023 పరిశీలక రచనల జాబితాలో భారత రచయిత పెరుమాళ్‌ మురుగన్‌ రచించిన ‘పైర్‌’ (పుక్కులి) నవల చోటు దక్కించుకుందని బుకర్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. ఈ జాబితాలో చేరిన తొలి తమిళ రచయితగా మురుగన్‌ నిలిచారు.

‘నాటు.. నాటు’ పాటకు ఆస్కార్‌
ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 95వ ఆస్కార్‌ పురస్కారాల్లో ఉత్తమ ఒరిజినల్‌ పాట విభాగంలో ఆస్కార్‌ గెలిచింది. కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్‌ రచించిన నాటు నాటు పాటను కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్ పాడగా, ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ సమకూర్చారు.

ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌
ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నిస్‌ రికార్డుకెక్కిన కర్ణాటకలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లోని 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫామ్‌ను ప్రధాని మోడీ మార్చి 12న‌ జాతికి అంకితం ఇచ్చారు.

కాశీలో ‘మిల్లెట్‌’ ప్రసాదం
కాశీ విశ్వనాథుడి ఆలయంలో మిల్లెట్లతో చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేయాలని ఆలయ యాజమాన్యం తెలిపింది. ఇటీవల ప్రధాని మోడీ మిల్లెట్లను ’శ్రీ అన్న’గా సంబోధించారు. దీంతో కాశీ ఆలయంలో లడ్డూ ప్రసాదానికి ‘శ్రీ అన్న ప్రసాదం’గా నామకరణం చేశారు.

తమిళనాడులో ‘మగళిర్‌ ఉరిమై తొగై’
తమిళనాడులో మహిళలకు ‘మగళిర్‌ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు)’ పథకాన్ని ప్రకటించారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేసేలా ప్రకటన చేశారు.

ఐఎన్‌ఎస్‌ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవం
కొచ్చిలో ఐఎన్‌ఎస్‌ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవ పురస్కారం రాష్ట్రపతి పతాకను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అందించారు. దేశ వ్యూహాత్మక, మిలిటరీ, ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల్లో నౌకా దళం అత్యంత కీలకమని ఆమె అన్నారు.

టాప్‌-50 పర్యాటక జాబితా
ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన ముఖ్యమైన 50 ప్రదేశాల జాబితాను టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసింది. అందులో భారత్‌కు ఒడిశాలోని మయూర్‌భంజ్‌, లద్దాఖ్‌ చోటు దక్కించుకున్నాయి. మయూర్‌భంజ్‌ జిల్లా సాంస్కృతిక వారసత్వ సంపదకు పెట్టింది పేరు.

వడాపావ్‌కు ప్రపంచ గుర్తింపు
ముంబైలో పేరు గాంచిన వడాపావ్‌  స్ట్రీట్‌ ఫుడ్‌ కు ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్‌ సాండ్విచ్ల జాబితాలో వడాపావ్‌ కు 13వ స్థానం లభించింది. మొదటి స్థానంలో తుర్కియేకు చెందిన తొంబిక్‌ శాండ్విచ్‌ నిలిచింది. ప్రపంచంలో బెస్ట్‌ సాండ్విచ్లపై ‘టేస్ట్‌ అట్లాస్‌’ అనే సంస్థ అధ్యయనం చేసింది.

ప్రాంతీయం

‘స్వచ్ఛ సుజల్‌’ పురస్కారం
ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామ పంచాయతీని మరో జాతీయ అవార్డు వరించింది. అన్ని విభాగాల్లో స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఆదర్శం (ఓడీఎఫ్‌ ప్లస్‌ మోడల్‌)గా నిలిచినందుకు ఆ గ్రామ సర్పంచి గాడ్గె మీనాక్షిని కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ సుజల్‌ శక్తి సమ్మాన్‌ – 2023’ పురస్కారానికి ఎంపిక చేసింది. పచ్చదనం, పరిశుభ్రత, 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, సోలార్‌ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టిన ఆ గ్రామ సర్పంచి ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆదిమానవుని వర్ణ చిత్రాలు గుర్తింపు
రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం వ్యారారం గ్రామ పొలిమేరలో చిత్తరిగుట్టపైన ఆదిమానవుని కాలం నాటి వర్ణ చిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది.

 ‘ఆరోగ్య మహిళ’ ప‌థ‌కం
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని మంత్రి హరీశ్ రావు క‌రీంన‌గ‌ర్‌లో ప్రారంభించారు. 33 జిల్లాల్లో అన్ని వయసుల వారికి 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్‌
ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్‌ హాయ్‌ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్‌’ సంస్థ రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్‌లో భారీ పెట్టుబడులతో తమ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పనుంది.

తెలంగాణకు మరో రెండు పురస్కారాలు
తెలంగాణ మరో రెండు ప్రతిష్టాత్మక కేంద్ర పురస్కారాలకు ఎంపికైంది. దేశంలో వంద శాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్లస్‌ రాష్ట్రంగా ఆవిర్భవించింది. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.

సావిత్రి, నాగిరెడ్డికి అవార్డులు
మహానటి సావిత్రి, విజయా ప్రొడక్షన్స్‌ అధినేత బి.నాగిరెడ్డికి ప్రకటించిన ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలను విజయచాముండేశ్వరికి, విశ్వనాథరెడ్డిలకు బాలకృష్ణ అందజేశారు. ఎన్టీఆర్‌ అభిమాని పురస్కారాన్ని ప్రసన్నప్రదీప్‌కు ఇచ్చారు

రాష్ట్రానికి టెక్స్‌టైల్‌ పార్కు
తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. టెక్స్‌టైల్‌ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా 5 ఎఫ్‌ (ఫార్మ్‌–ఫైబర్‌–ఫ్యాక్టరీ–ఫ్యాషన్‌–ఫారిన్‌) దృష్టితో దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కులు నెలకొల్పనున్నట్టు ప్రధాని తెలిపారు.

టీసీఎస్‌కు ఇండస్ట్రీస్‌  అవార్డ్
రాష్ట్రంలో ఐటీ సేవల రంగానికి అందిస్తున్న సేవలకు  ‘తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సీ ఇన్‌ ఐటీ’ పురస్కారానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఎంపికయ్యింది.

వార్తల్లో వ్యక్తులు

ఖుష్బూ సుందర్‌
ప్రముఖ నటి,  బీజేపీ నేత ఖుష్బూ సుందర్‌ జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.ఖుష్బూతో పాటు మమత కుమారి, డెలియానా కొంగ్డుప్‌ను జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసింది.

రేయానా బర్నావి
సౌదీ అరేబియాకు చెందిన మొదటి మహిళా వ్యోమగామి రేయానా బర్నావి ఈ సంవత్సరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తోటి సౌదీ వ్యోమగామి అలీ అల్‌–కర్నీతో కలిసి వెళ్లనుంది. ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ ఆక్సియోమ్‌ స్పేస్‌ మిషన్‌ లో భాగంగా బర్నావి, అల్‌–కర్నీ స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ అంతరిక్ష నౌకలో ఐఎస్‌ఎస్కు వెళ్తుంది.

శైలేష్‌ పాఠక్‌
ఫిక్కీ కొత్త సెక్రటరీ జనరల్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి శైలేష్‌ పాఠక్‌ నియమితులయ్యారు. 37 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఐఏఎస్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు, ప్రైవేట్‌ రంగంలోని పలు దిగ్గజ కంపెనీల్లోనూ శైలేష్‌ విధులు నిర్వర్తించారని ఫిక్కీ తెలిపింది.

నొవాక్‌ జకోవిచ్‌
నొవాక్‌ జకోవిచ్‌ టెన్నిస్‌ చరిత్రలోనే (పురుషులు, మహిళలు కలిపి) అత్యధిక వారాల పాటు నంబర్‌వన్‌గా ఉన్న ఆటగాడిగా నిలిచాడు. స్టెఫీ గ్రాఫ్‌ (377 వారాలు) రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా 378వ వారం ఇప్పుడు జకో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

స్టీవెన్‌ సీగల్‌
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని సమర్థించిన హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ స్టీవె న్‌ సీగల్‌కు రష్యా ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌’ అవార్డు ప్రకటించింది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో తదితరులకు ఆర్డర్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌ అవార్డు ప్రకటించారు.

రామచంద్ర పౌడెల్‌
నేపాల్‌ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్‌ ఎన్నికయ్యారు. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌ (మావోయిస్టు సెంటర్‌) తో పాటు ఎనిమిది పార్టీల సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి అయిన సుభాష్‌ చంద్ర నెబ్‌మాంగ్‌పై విజయం సాధించారు.

వెర్‌స్టాపెన్‌
ఫార్ములావన్‌ సీజన్‌లోని తొలి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. పెరెజ్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో, అలోన్సో (ఆస్టన్‌ మారిటన్‌) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి మార్చి 19న జరుగుతుంది.  

శాలిజా ధామీ
ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్‌) చరిత్రలో తొలిసారి పోరాట విభాగమైన క్షిపణుల స్క్వాడ్రన్కు  మహిళ అయిన శాలిజా ధామీ నేతృత్వం వహించనున్నారు. 2003లో హెలికాప్టర్‌ పైలట్‌గా ఐఏఎఫ్‌లోకి ధామీ అడుగుపెట్టారు.

ఫుల్టన్‌
భారత పురుషుల హాకీ జట్టు కోచ్‌గా క్రెయిగ్‌ ఫుల్టన్‌ (దక్షిణాఫ్రికా) నియమితుడయ్యాడు. శిక్షణలో 25 ఏళ్ల అనుభవమున్న ఫుల్టన్‌కు హాకీ ఇండియా (హెచ్‌ఐ) చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ పేలవ ప్రదర్శనతో కోచ్‌ పదవికి గ్రాహమ్‌ రీడ్‌ రాజీనామా చేశాడు.

రశ్మీ శుక్లా
సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్ రశ్మీ శుక్లా నియమితులయ్యారు.1988 బ్యాచ్‌ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ రశ్మీ శుక్లా ప్రస్తుతం సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) అదనపు డీజీగా ఉన్నారు.

సి.శేఖర్‌ రెడ్డి
సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య), తెలంగాణ విభాగానికి నూతన చైర్మన్‌గా సి.శేఖర్‌ రెడ్డి ఎంపికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా డి.సాయి ప్రసాద్‌ వ్యవహరిస్తారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి వీరిద్దరూ సీఐఐ – తెలంగాణ బాధ్యతలు నిర్వహిస్తారు.

కార్తికి గోన్సాల్వెస్
అనాథ ఏనుగులను ఆదరించిన దంపతుల కథతో తెరకెక్కిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో అవార్డు గెలుచుకుంది. దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్, నిర్మాత గునీత్‌ మోంగా వేదికపై అవార్డు తీసుకున్నారు. భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్‌ దక్కడం ఇదే తొలిసారి.

ఎరిక్‌ గార్సెట్టి
భారత్‌లో అమెరికా రాయబారిగా అధ్యక్షుడు బైడెన్‌ సన్నిహితుడు ఎరిక్‌ గార్సెట్టి నియామకం ఖరారైంది. ఆయన నామినేషన్‌ను సెనెట్‌ 52-–42 మెజార్టీతో ఆమోదించింది. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న అమెరికా రాయబారి పదవి త్వరలోనే భర్తీ కానుంది.

అమితవ ముఖర్జీ
ఎన్‌ఎండీసీ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా అమితవ ముఖర్జీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఎన్‌ఎండీసీలో ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అమితవ ముఖర్జీ 1995 బ్యాచ్‌ ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఏఎస్‌) అధికారిగా ఉంటున్నారు.

జయతీఘోష్‌
ప్రముఖ ఆర్థికవేత్త, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ జయతీఘోష్‌ వ్యవసాయ ఆర్థికశాస్త్రం విభాగంలో ప్రదానం చేసే అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.  గ్లోబల్‌ అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌ అవార్డును 2023 ఏడాదికి జయతీఘోష్‌కు బహూకరించనున్నారు.

అరుణ్‌ సుబ్రమణియన్‌
సదరన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ (ఎస్‌డీఎన్‌వై) జడ్జిగా భారతీయ అమెరికన్‌ అరుణ్‌ సుబ్రమణియన్‌ నియామకానికి అమెరికా సెనేట్‌ ఆమోదముద్ర వేసింది.ఈ పదవి చేపట్టబోతున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా సుబ్రమణియన్‌ నిలవనున్నారు.

లక్ష్మణ్‌ నరసింహన్‌
ఇంటర్నేషనల్ కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్‌ నరసింహన్‌ బాధ్యతలను స్వీకరించారు.  కంపెనీ వ్యవస్థాపకుడు, తాజా మాజీ సీఈఓ హోవర్డ్‌ స్కాల్జ్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. దీంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈఓలుగా ఉన్న భారత సంతతి వ్యక్తుల్లో ఇంకొకరు చేరారు.

లలిత్‌కుమార్‌ గుప్తా
కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) చైర్మన్, ఎండీగా లలిత్‌కుమార్‌ గుప్తా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అదే సంస్థలో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా సేవలందిస్తున్నారు. కొత్త బాధ్యతల్లో అయిదేళ్ల పాటు కొనసాగుతారు.

పీవీ సతీష్‌
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌గా పేరుగాంచిన పీవీ సతీష్‌  అనారోగ్యంతో మరణించారు. ప్రతీ సంక్రాంతికి ‘పాత పంటల జాతర’ను ఆయన నిర్వహిస్తున్నారు. చిరుధాన్యాలను ప్రజల ఎజెండాగా చేయడంలో ఆయన జీవితకాల కృషికి ఇటీవల పురస్కారం లభించింది.

అల్కరాజ్
స్పెయిన్‌ యువ స్టార్‌ కార్లోస్‌ అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్ అందుకున్నాడు. ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌–1000 టోర్నీలో 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి విజేతగా అవతరించాడు. స్పెయిన్‌ దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు రఫెల్‌ నాదల్‌ ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో చోటు కోల్పోయాడు.

రాణి రాంపాల్‌
భారత మహిళల హాకీ స్టార్‌ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్‌బరేలీలోని ఓ స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని ‘రాణీస్‌ గర్ల్స్‌ హాకీ టర్ఫ్‌’ పేరిట పిలవనున్నారు. రాణీనే ఈ స్టేడియాన్ని ప్రారంభించింది. హాకీలో ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఆమే.

ప్రచండ
విశ్వాస పరీక్షలో నేపాల్‌ ప్రధాని ప్రచండ నెగ్గారు. 3 నెలల్లో ఆయనకు ఇది రెండో విశ్వాస పరీక్ష. 275 మంది సభ్యులున్న నేపాల్‌ పార్లమెంటులో 262 మంది ఓటేశారు. ప్రచండకు 172 ఓట్లు వచ్చాయి. 89 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు.

స్పోర్ట్స్

ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్‌
అర్జెంటీనా జట్టును ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టిన లియోనెల్‌ మెస్సీ 2022 ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్‌గా ఎంపికయ్యాడు. గత 14 ఏళ్లలో మెస్సీ ఏడోసారి ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాలర్‌ అవార్డు గెల్చుకున్నాడు. మహిళల విభాగంలో ప్రపంచ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు స్పెయిన్‌కు చెందిన అలెక్సియా పుటెలాస్‌కు లభించింది.

ఆస్ట్రేలియాదే ప్రపంచకప్
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు మరో ‘హ్యాట్రిక్‌’తో టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 2010, 2012, 2014లలో వరుసగా మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్‌.. 2016 మెగా ఈవెంట్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మళ్లీ 2018, 2020గెలవగా,  2023లో ఫైనల్లో దక్షిణాఫ్రికాపై నెగ్గి ప్రపంచకప్‌ల హ్యాట్రిక్‌ నమోదు చేసింది.

సంతోష్‌ ట్రోఫీ చాంపియన్
సంతోష్‌ ట్రోఫీ చాంపియన్గా కర్ణాటక అవతరించింది. 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఫుట్‌బాల్‌ టోర్నీలో విజేతగా నిలిచింది. ఫైనల్లో కర్ణాటక 3–2తో మేఘాలయపై విజయం సాధించింది. సునీల్‌ కుమార్‌ (3వ నిమిషం), బెకి ఓరమ్‌ (20వ), రాబిన్‌ యాదవ్‌ (44వ) కర్ణాటక తరఫున గోల్స్‌ చేశారు.

రెస్ట్‌దే ఇరానీ కప్‌
రెస్టాఫ్‌ ఇండియా ఇరానీ కప్‌లో చాంపియన్‌గా నిలిచింది. 2022 రంజీ ట్రోఫీ చాంపియన్‌ మధ్యప్రదేశ్‌ను చిత్తుచేసి ఇరానీ కప్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో రెస్ట్‌ 238 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది.

నంబర్‌వన్‌ బౌలర్‌గా అశ్విన్
టీమ్‌ ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ బౌలర్‌గా నిలిచాడు. ఈ మేరకు ప్రకటించిన ఐసీసీ టెస్టు బౌలింగ్‌ జాబితాలో అశ్విన్‌ 869 పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకు సాధించాడు. జేమ్స్‌ అండర్సన్‌, కమిన్స్‌ రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.

ఇండియాదే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టు డ్రాగా ముగియడంతో2–-1తో వరుసగా నాలుగో సారి భారత్ బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. అశ్విన్, జడేజాలకు సంయుక్తంగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. 2017, 2018,19, 2020 – 21లో సిరీస్ కైవసం చేసుకుంది.

ఆసియా బిలియర్డ్స్‌ టైటిల్‌
భారత క్యూ సూపర్‌ స్టార్‌ పంకజ్‌ అద్వాని మరోసారి ఆసియా బిలియర్డ్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో అతను 5-–1తో బ్రిజేష్‌ దమానిపై విజయం సాధించాడు. పంకజ్‌కిది తొమ్మిదో ఆసియా బిలియర్డ్స్‌ టైటిల్‌.

ఏటీపీ మాస్టర్స్‌ టైటిల్
ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి రోహన్ బోపన్న పురుషుల డబుల్స్‌ టైటిల్‌ సాధించాడు. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

సైన్స్ అండ్ టెక్నాలజీ

అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములు
స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌ రాకెట్‌ నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. వీరిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు చెందిన సల్తాన్‌ అల్‌ నెయాదీ ఉన్నారు. అమెరికాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ నలుగురు ఐఎస్‌ఎస్‌లో విధులు నిర్వర్తించనున్నారు.

బ్రహ్మోస్‌ విజయవంతం
బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణిని భారత నౌకాదళం అరేబియా సముద్రంలో యుద్ధనౌకపై నుంచి విజయవంతంగా ప్రయోగించింది. డీఆర్‌డీవో దేశీయంగా రూపొందించిన సీకర్‌ అండర్‌ బూస్టర్‌ పరిజ్ఞానంతో ఈ పరీక్ష చేపట్టారు. ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల  వేగంతో (మ్యాక్‌ 2.8) ప్రయాణించగలదు.

ఎంఆర్‌ శామ్‌ క్షిపణి సక్సెస్
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అధునాతన మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్‌ శామ్‌)ను భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. అగ్రశ్రేణి యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ నుంచి ఈ ప్రయోగం జరిగింది. దీన్ని బీడీఎల్‌ సంస్థ అభివృద్ధి చేసింది.

తేజస్‌లో స్వదేశీ పవర్‌ టేకాఫ్‌ షాఫ్ట్‌
భారత్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం (తేజస్‌) స్వదేశీ పవర్‌ టేకాఫ్‌ (పీటీవో) షాఫ్ట్‌తో తొలిసారి గగనవిహారం చేసింది. ఈ పరీక్ష బెంగళూరులో జరిగింది. పీటీవో షాఫ్ట్, చాలా కీలక సాధనం. విమానం ఇంజిన్‌ నుంచి శక్తిని గేర్‌బాక్స్‌కు బదిలీ చేస్తుంది.

చంద్రయాన్‌–3  ప్రీలాంచ్‌ టెస్ట్
చంద్రయాన్‌–3 ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ప్రీలాంచ్‌ పరీక్ష విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. చంద్రుడిపైన ప్రొపల్షన్‌, ల్యాండర్‌, రోవర్‌ మాడ్యూళ్లతో కూడిన లూనార్‌ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని ఈ ఏడాది జూన్‌లో చేపట్టే అవకాశం ఉంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!