మోడల్ స్కూల్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువును తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పొడిగించింది. ఈనెల 22 వరకు అప్లికేషన్ల గడువును పొడిగించింది. ఇప్పటి వరకూ 43,498 అప్లికేషన్లు అందినట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు జనవరి 9న నోటిఫికేషన్ విడుదలైంది.
ఆరో తరగతితో పాటు ఆయా మోడల్ స్కూళ్లలో 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు కూడా జనవరి 10 నుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. ముందుగా ఫిబ్రవరి 15 వరకు నిర్దేశించిన ఈ గడువును 22వ తేదీకి పొడిగించింది. మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ మోడల్ స్కూల్ ఉన్న మండల కేంద్రాల్లో ఏప్రిల్ 16న (ఆదివారం) నిర్వహిస్తారు. పరీక్ష అనంతరం ఫలితాలను మే 15న ప్రకటిస్తారు. ప్రవేశ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
