ఇంగ్లిష్ మీడియంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నప్పటికీ వారికి మాతృ భాషలో పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్(యూజీసీ-UGC) యూనివర్సిటీలకు సూచించింది. దీంతో అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ వర్సిటీల్లో ఉన్నత విద్యను చదువుతున్న విద్యార్థులకు తెలుగులో పరీక్షలను రాసే అవకాశం ఏర్పడింది. వీరితో పాటు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న పలు ప్రాంతాల విద్యార్థులు తమ మాతృ భాషలో పరీక్షలు రాసుకునే అవకాశం కలగనుంది.
అయితే అందుకు ఆయా వర్సిటీలు అనుమతించాల్సి ఉంటుంది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్‌కుమార్ బుధవారం ఉన్నత విద్యాసంస్థలకు లేఖ రాశారు. మాతృభాషలో విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించడంలో, పాఠ్యపుస్తకాలను రూపొందించడంలో ఉన్నత విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని యూజీసీ తెలిపింది. కాబట్టి ఇతర భాషల్లోని ప్రామాణిక పాఠ్య పుస్తకాలను మాతృ భాషలోకి తర్జుమా చేసేలా, వాటిని బోధనకు ఉపయోగించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని యూజీసీ లేఖలో పేర్కొంది.