వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న టీఎస్పీఎస్సీ తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏకంగా నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, లైబ్రేరియన్ ఉద్యోగాలు.. మొత్తం 544 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభం అవుతుంది. కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్&సీనియర్ అకౌంటెంట్ విభాగంలో 78 ఖాళీలకు సైతం టీఎఎస్పీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 20న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 11 ఆఖరి తేదీ.




ఇంటర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 71 లైబ్రేరియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ జనవరి 21న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. నియామక పరీక్ష మే లేదా జూన్ లో ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాటు రవాణ శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఖాళీలకు సైతం ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 12న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 1ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ నియామక పరీక్ష ఏప్రిల్ 23న ఉంటుంది.