Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎకానమీ ఎలా చదివితే.. గుర్తుంచుకోవచ్చు

ఎకానమీ ఎలా చదివితే.. గుర్తుంచుకోవచ్చు

గ్రూప్స్‌ (TSPSC JOBS) సన్నద్ధతలో అభ్యర్థులంతా కాస్త భయపడేది ఎకానమీ విషయంలోనే. నిజానికి సరైన ప్రణాళిక ఉంటే ఈ సబ్జెక్టు చదవడం అంత కష్టమేమీ కాదు. ఏది, ఎంతవరకు, ఎలా చదవాలనే విషయం తెలుసుకుంటే ప్రిపరేషన్‌ సులువుగా సాగిపోతుంది. (GROUPS) గ్రూప్స్‌ 2, 3, 4 పరీక్షలకు ఎకానమీ ఎలా చదవాలో తెలుసుకుందాం..

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి భారతదేశ ఆర్థిక పయనం మొదలయింది. అందుకే అభ్యర్థులు స్వాతంత్య్ర కాలం నాటి ఆర్థిక పరిస్థితులూ, పంచవర్ష ప్రణాళికలూ మనకు ఎందుకు అవసరమయ్యాయి, అవి ఎలాంటి విజయాలు సాధించాయి, ఏ విషయాల్లో వెనకబడ్డాయి… ఇలా ప్రతిదీ చదవాలి. జాతీయాదాయం, జీడీపీ లెక్కింపు, తలసరి ఆదాయం, తలసరి వినియోగం, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానాలు, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత 1991 కాలం నాటి ఆర్థిక సంస్కరణలు మరో ప్రధానమైన అంశం. దేశ దశనూ, దిశనూ మార్చిన నాటి ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌), భూ సంస్కరణలు ముఖ్య విషయాలు. ఆనాటి ఆ విధానాలే నేటి మన ఆర్థిక పరిస్థితికి పునాది. అందువల్ల వాటి గురించి ప్రతి అభ్యర్థీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

నీతిఆయోగ్‌ ఏర్పాటు, విధివిధానాలు, ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థ, వ్యవసాయం అంశాలపై పట్టు సాధించాలి. దేశంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల గురించి అవగాహణ ఉండాలి. కేంద్రప్రభుత్వ పథకాలైన నేషనల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి వాటి గురించి చదవాలి. బడ్జెట్, ఎకనమిక్‌ సర్వేలో ముఖ్యమైన అంశాలు, కేటాయింపుల గురించి అభ్యర్థులకు అవగాహన అవసరం.

సొంత నోట్స్​ మేలు

ఎకానమీ అనే కాదు, ఏ సబ్జెక్టు చదివినా సొంత నోట్సు రాయడం తప్పనిసరి. అయితే చాలామంది అభ్యర్థులు నోట్సు రాసుకునేటప్పుడు ఏది ముఖ్యమైన పాయింటో, ఏది అవసరం లేనిదో తెలుసుకోలేక ఇబ్బంది పడతారు. ఒక అంశం ప్రాధాన్యం మనకు అర్థం కావాలంటే పాత ప్రశ్నపత్రాలు చూడటం ఒక్కటే దారి. తొలుత సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ సిలబస్‌లో ఏ సంవత్సరం, ఏ టాపిక్‌ నుంచి, ఎన్ని మార్కులకు ప్రశ్నలొచ్చాయనే విషయాన్ని గుర్తించాలి. దీనివల్ల మనం టాపిక్స్‌కు అలవాటుపడతాం. ఆ తర్వాత ఏ పాఠం ఎంతవరకు చదవాలనే విషయం మనకే అర్థమైపోతుంది. దానివల్ల అనవసర విషయాల జోలికి పోకుండా విలువైన సమయం ఆదా అవుతుంది. మొత్తం అన్ని టాపిక్స్‌ పూర్తిగా నేర్చుకున్నాక వీలైనన్ని మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా బిట్‌ తప్పుగా జవాబు రాశామంటే ‘ఎందుకు పొరపాటు చేశాం?’ అనే విషయాన్ని గుర్తించాలి. అవసరం అయితే మళ్లీ ఆ చాప్టర్‌ చదవాలి. ఇలా తప్పుల నుంచి నేర్చుకుంటూ సమగ్రంగా సన్నద్ధమైతే అనుకున్న కొలువు సాధించవచ్చు.

పోటీ పరీక్షల్లో ఎకానమీ

పోటీ పరీక్ష ఏదైనా ఎకానమీ కీలకపాత్ర పోషిస్తోంది. ప్రత్యేకంగా సబ్జెక్ట్ నుంచే కాకండా కరెంట్‌ అఫైర్స్‌లో భాగంగా ఎకానమీకి సంబంధించి అడిగే ప్రశ్నలు ప్రతి పరీక్షలో సగటున 5 నుంచి 10 వరకూ ఉంటాయి. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులు.. ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌తోపాటు మెయిన్స్‌లో ఎకానమీకి సంబంధించిన అంశాలను కూడా మిళితం చేస్తూ ప్రిపరేషన్‌ కొనసాగించాలి.

ఎకానమీలో మొదటగా బేసిక్‌ కాన్సెప్ట్‌లు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్‌సీఈఆర్‌టి ప్రచురించే 10, 11,12 తరగతుల పుస్తకాల నుంచి బేసిక్‌ పదాలైన ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయం, తలసరి ఆదాయం, రెపో రేటు, నగదు నిల్వల నిష్పత్తి, బ్యాంకు రేటు, ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, మూలధన ఉత్పత్తి నిష్పత్తి, మూలధన సంచయనం, మానవాభివృద్ధి, ద్రవ్యలోటు, కోశ విధానం, ద్రవ్య విధానం, వాణిజ్యలోటు లాంటి పదాలను అవగాహన చేసుకోవడంతోపాటు నిత్య జీవితంలో వాటి అనువర్తనాలను అధ్యయనం చేయాలి.

బేసిక్‌ పదకోశాలపై అవగాహన ఏర్పడిన తర్వాత.. కోర్‌ అంశాలైన భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, నీతి ఆయోగ్, పన్నుల వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్యం, అంతర్జాతీయ విత్త సంస్థలు, వస్తు సేవల పన్ను, క్రిప్టో కరెన్సీ, డిజిటలైజేషన్, ఆర్థిక సంస్కరణలు, బ్యాంకింగ్, ద్రవ్య సప్లయ్, జనాభాకు సంబంధించిన వివిధ అంశాలు, బడ్జెట్‌లోని వివిధ అంశాలు, సుస్థిరాభివృద్ధి, సామాజిక రంగ అభివృద్ధిపై అధ్యయనం అవసరం.

డేటా ఇలా చదివేయండి

ప్రధానంగా అభ్యర్థులు ఎకానమీలో మార్కులు స్కోరు చేయకపోవడానికి ప్రధాన కారణం.. డేటాను విశ్లేషణ పూర్వకంగా చదవకపోవడం. ప్రస్తుత తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం–2023 ఆధారం చేసుకొని.. తెలుగు అకాడమీలో ఉన్న భావనలకు ఈ డేటాను అన్వయించుకుంటూ చదవాలి. గత ప్రశ్నాపత్రాలు పరిశీలిస్తే.. పరీక్షలలో డేటాపై మొత్తం ప్రశ్నలలో 10 శాతం మించకుండా ప్రశ్నలు ఉంటాయి. ఈ డేటాను బట్టీపట్టకుండా ఎక్కువసార్లు ప్రాక్టీస్‌ చేయడం, విభజన రూపంలో చదవడం వల్ల విద్యార్థిలో నైపుణ్య శక్తి బయటపడుతుంది. ఇలా ప్రశ్నకు జవాబును సులభంగా గుర్తించవచ్చు.

స్మార్ట్‌ వర్క్‌ ముఖ్యం

పోటీ పరీక్షలకు సన్నద్దం అయ్యే అభ్యర్థులు, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించడం అంత సులువు కాదు. హార్డ్‌వర్క్‌ అనే విధానాన్ని విడనాడి.. ఆధునిక విశ్లేషణ పద్ధతులను అన్వేషిస్తూ స్మార్ట్‌ వర్క్‌ను పెంపొందించుకోవాలి. ప్రధానంగా అభ్యర్థి గమనించవలసింది.. ఒక మార్కుతో ఉద్యోగాన్ని కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోంది. కాబట్టి అభ్యర్థి సిలబస్‌కు అనుగుణంగా పట్టికలు, పటాల రూపంలో విజ్ఞానాన్ని పెంపొందించుకొంటూ.. సిలబస్‌లో ప్రతి యూనిట్‌లోని టాపిక్స్‌ను సూక్ష్మ స్థాయిలో పరిశీలించాలి. ఇలా చదవడం ద్వారా పరీక్షలో మెరుగైన మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.

ఆర్థికాభివృద్ధి

ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి పదకోశాలు, అల్పాభివృద్ధి సూచికలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల లక్షణాలు, మానవాభివృద్ధికి సంబంధించి వివిధ సూచీలు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పులు, పర్యావరణ విధానం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత ప్రగతికి సంబంధించి అధ్యయనం అవసరం.

భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం

భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, సహజ వనరులు, నూతన విద్యా విధానం, జాతీయ ఆరోగ్య విధానం, వివిధ అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, శ్రామిక శక్తి, ఉపాధి, నిరుద్యోగిత, జనాభా వృద్ధి, ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయం, ఆదాయ అసమానతలకు కారణాలు, ప్రభుత్వం విధానం, చర్యలు తదితర అంశాలు చదవాలి.

విదేశీ వాణిజ్యం

భారత విదేశీ వాణిజ్యంలో భాగంగా ఎగుమతులు, దిగుమతుల విలువ, వివిధ దేశాలతో వాణిజ్య భాగస్వామ్యం, వస్తు సేవల ఎగుమతులు, దిగుమతులలో మార్పులను పరిశీలించాలి. వీటితోపాటు నూతన వాణిజ్య విధానంలోని ప్రధానాంశాలు, విదేశీ మూలధన ప్రవాహం, విదేశీ మారకపు రేటు విధానం,ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలు, హాంకాంగ్‌ మినిస్టీరియల్‌ కాన్ఫరెన్స్, బాలీ ప్యాకేజీకి సంబంధించి నోట్స్‌ రూపొందించుకోవాలి.

ద్రవ్యం, బ్యాంకింగ్, ఫైనాన్స్‌

ఈ అంశాలకు సంబంధించి ద్రవ్యోల్బణానికి కారణాలు, ప్రభావం, ద్రవ్యోల్బణ నివారణకు ప్రభుత్వ విధానంతోపాటు ‘ఇన్‌ఫ్లేషన్‌ టార్గెటింగ్‌‘కు సంబంధించి అవగాహన పెంచుకోవాలి. భారత ద్రవ్య మార్కెట్, ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాల నేపథ్యంలో.. బ్యాంకింగ్‌ రంగ ప్రగతి, రిజర్వ్‌ బ్యాంకు ద్రవ్య విధాన లక్ష్యాలతోపాటు ద్రవ్య విధాన సాధనాల వినియోగం, భారత మూలధన మార్కెట్‌తోపాటు భారత అభివృద్ధి, విత్త సంస్థలకు సంబంధించి నోట్స్‌ రూపొందించుకోవాలి.

పబ్లిక్‌ ఫైనాన్స్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, వ్యయ, రుణ ధోరణులు, ప్రభుత్వ కోశ విధానం, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలతోపాటు 2022–23 కేంద్ర, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో వివిధ రంగాలకు సంబంధించి కేటాయింపులు, బడ్జెట్‌లో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన నూతన కార్యక్రమాల లక్ష్యాలను పరిశీలించాలి.

ఆర్థిక ప్రణాళిక–విధానం

ఆర్థిక ప్రణాళిక ముఖ్య ఉద్దేశాలు, స్వాతంత్య్రానంతరం వివిధ రంగాలకు వనరుల కేటాయింపులు, పంచవర్ష ప్రణాళికల ఫైనాన్సింగ్‌కు సంబంధించి వివిధ ఆధారాలు, నల్లధనం పెరగడానికి కారణాలు, నివారణకు సంబంధించి ప్రభుత్వ విధానంపై అవగాహన అవసరం. భారత్‌లో ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలకు సంబంధించి అధ్యయనం చేయాలి.

నీతి ఆయోగ్‌

నీతి ఆయోగ్‌ విధానాలలో భాగంగా 7 సంవత్సరాల విజన్, వ్యూహం, యాక్షన్‌ ప్లాన్, 15 సంవత్సరాల రోడ్‌ మ్యాప్, అమృత్, డిజిటల్‌ ఇండియా, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్, వైద్య విద్య సంస్కరణలు, వ్యవసాయ సంస్కరణలు, విద్య, ఆరోగ్యం, నీటి యాజమాన్యంలో భాగంగా రాష్ట్రాల ప్రగతి కొలవడానికి సూచికలు, కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్‌ పథకాల రేషనలైజేషన్‌ కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సబ్‌ గ్రూప్‌; నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛ భారత్‌ అభియాన్‌కు సంబంధించి ముఖ్యమంత్రుల సబ్‌ గ్రూప్‌ సిఫార్సులను అధ్యయనం చేయాలి.

వ్యవసాయరంగం

పంటల తీరును నిర్ణయించే అంశాలు, పంటల తీరు దోరణులు, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదక దోరణులు, వ్యవసాయ ఉత్పాదకాలు, హరిత విప్లవం, వ్యవసాయ ధరల విధానం, వ్యవసాయ రంగ సబ్సిడీలు, ఆహార భద్రత,వ్యవసాయ శ్రామికుల స్థితి గతులు, వ్యవసాయ రంగ విత్తం, మార్కెటింగ్‌లో భాగంగా సహకార పరపతి సంఘాలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్, ఆర్థిక సమ్మిళితంతోపాటు వ్యవసాయ మార్కెటింగ్‌ను మెరుగుపరచడానికి చర్యలు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రైతు చట్టాలకు సంబంధించి సమగ్రంగా నోట్స్‌ రూపొందించుకోవాలి.

పారిశ్రామిక రంగం

భారత్‌లో ముఖ్య పరిశ్రమలైన ఇనుము, ఉక్కు, పంచదార, సిమెంట్, జౌళి, వస్త్ర పరిశ్రమ ప్రగతితోపాటు పారిశ్రామిక తీర్మానాలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగ ప్రగతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలు, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ, ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్‌ట్సీ కోడ్, సాంఘిక భద్రతా చర్యలకు సంబంధించి అధ్యయనం చేయాలి.

సేవారంగం

జీడీపీలో సేవారంగ వాటా పెరుగుదల, ఉపాధిలో సేవారంగ వాటా, సేవల ఎగుమతులు, భారత్‌లో ఐటీ, ఐటీఈఎస్‌ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి నోట్స్‌ రూపొందించుకోవాలి.

తెలంగాణ ఎకానమీ

గ్రూప్ 2, 3 పరీక్షలో తెలంగాణ ఎకానమీ నుంచి 50 మార్కులకు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ(1956–2014), భూసంస్కరణలు, రాష్ట్రంలో వ్యవసాయం–అనుబంధ రంగాలు, పరిశ్రమలు మరియు సేవారంగం, జనాభా అంశాలు ముఖ్యమైనవి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ(1956–2014). ఈ యూనిట్‌ను చదివేటప్పుడు అభ్యర్థి తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మిళితం చేసి చదవాలి. ఇలా చదవడం ద్వారా సమయం ఆదా అవుతుంది. ఈ యూనిట్‌ ప్రధానంగా నీళ్లు–నిధులు–నియామకాలు అనే అంశంపై ఆధారపడి ఉంది.రాష్ట్రంలో అత్యధికంగా ప్రవహించే ప్రధాన అంతరాష్ట్ర నదులైన గోదావరి, కృష్ణా నదుల ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి క్షుణ్నంగా చదవాలి.ఈ నదుల ద్వారా నీళ్ల పంపకంపై ఏర్పాటు చేసిన బచావత్‌ కమిటీ, బ్రిజేష్‌ కుమార్‌ కమిటీ సిఫార్సులు ప్రధానమైనవిగా చదవాలి. అభ్యర్థి నదీ జలాల తరలింపు అనే అంశం చదివేటప్పుడు తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీని మిళితం చేసుకొని చదవాలి. దీంతో సమయం ఆదా చేయడంతో పాటుగా, స్మార్ట్‌ స్టడీస్‌ని అధ్యయనం చేయవచ్చు.

– నిధుల తరలింపు ఒకే అంశం చదివేటప్పుడు ముఖ్యంగా నాలుగు కమిటీల సిఫార్సులను చదవాలి. అవి.. కుమార్‌ లలిత్‌ కమిటీ, వశిష్ట భార్గవ కమిటీ, పెద్ద మనుషుల ఒప్పందంలోని, తెలంగాణ రీజనల్‌ కమిటీ అంశాలు.

– ఉద్యోగాల కల్పన–తరలింపునకు సంబంధించి చదవాల్సిన అంశాల్లో  జీఓ నెం.36, ఆరు సూత్రాల పథకం, వాంఛూ కమిటీ, ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌–1975 (జీఓనెం.674), జీఓనెం.675, జయ భారత్‌రెడ్డి కమిటీ/ఆఫీసర్స్‌ కమిటీ, జీఓ.610, గిర్‌–గ్లానీ కమిషన్, శ్రీకృష్ణ కమిటీ. అభ్యర్థి నిధుల తరలింపు, నియామకాలు అనే అంశం చదివేటప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ ఎకానమీలోని మొదటి యూనిట్‌ను మిళితం చేసి చదవాలి. తెలంగాణలో మానవ అభివృద్ధి నివేదికను పరిశీలించాలి. భూ సంస్కరణలు అనే అంశం చదివేటప్పుడు మధ్యవర్తుల తొలగింపు, కౌలు సంస్కరణలు, భూగరిష్ట పరిమితి, షెడ్యూల్డ్‌ ప్రాంత భూముల పరాధీనత టాపిక్స్పై అవగాహన ఉండాలి.

– తెలంగాణలో వ్యవసాయ–అనుబంధ రంగానికి సంబంధించి  రాష్ట్ర  ప్రభుత్వం విడుదల చే సిన తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం–2023 ఆధారం చేసుకొని చదవాలి. ఈ యూనిట్‌లో తెలంగాణ స్థూల ఆర్థిక గణాంకాలు, తెలంగాణ వ్యవసాయ–అనుబంధ రంగాల గణాంకాలు, పంటలు–రకాలు, తెలంగాణలో భూ వినియోగం తీరు, తెలంగాణలో గల వ్యవసాయ వాతావరణ మండలాలు, తెలంగాణ భూకమతాలు, వ్యవసాయ ఆధారిత జనాభా, వ్యవసాయం–నీటిపారుదల, తెలంగాణలో ప్రాజెక్ట్‌లు, వ్యవసాయ పరపతి, పశు సంపద, మత్స్య సంపద, అటవీ సంపద గురించి తెలుసుకోవాలి. అభ్యర్థి వీటిని చదివేటప్పుడు రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ఆర్థిక గణాంకాలను, ప్రస్తుత ఆర్థిక సర్వే(2022–23) ఆధారంగా చేసుకొని చదవాలి. వ్యవసాయ రంగంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు భీమా పథకాలపై అవగాహన పెంచుకోవాలి.

– 2022–23 సామాజిక ఆర్థిక చిత్రం ప్రకారం పరిశ్రమల గణాంకాలు, టీఎస్ ఐపాస్, టీ ఐడీయా, ఎంఎస్ఎంఈ, టీఎస్ ప్రైడ్, టీ హబ్ ప్రకారం పారిశ్రామిక ఉపరంగాలో ఉపాధి, తెలంగాణ విద్యుత్‌ రంగం–ప్రస్తుత పరిస్థితిపై దృష్టిపెట్టాలి.  2022–23 ఆర్థిక సర్వే ప్రకారం–తెలంగాణ సేవారంగ గణాంకాలు; రోడ్డు రవాణా, పర్యాటక రంగం, ఐటీ సేవలు. వీటిత పాటుగా తెలంగాణ మానవ వనరులు, తెలంగాణ విధానాలను పరిశీలించాలి. తెలంగాణ ప్రభుత్వ పథకాలలో ముఖ్యంగా దళితబంధు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, ఆసరా పెన్షన్‌లు, కళ్యాణ లక్ష్మీ, ధరణీ పోర్టల్‌పై అవగాహన పెంచుకోవాలి.

– ఎకానమీ అండ్ డెవలప్మెంట్ విభాగంలో డెమోగ్రఫీ గురించి ఇచ్చారు. భారత జనాభా, జనాభా లక్షణాలు, పరిమాణం, జనాభా వృద్ధిరేటు, జనాభా  డెవిడెండ్, జనాభా పంపిణీ,  భారత జనాభా విధానాలు అని పేర్కొన్నారు.  జనన, మరణ రేట్లకూ ఆర్థికాభివృద్ధికీ మధ్య గల సంబంధాన్ని తెలియజేసేది జనాభా పరిణామ సిద్ధాంతం. దేశంలో మొదటిసారిగా 1872లో జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. పూర్తిస్థాయి లెక్కలు మాత్రం 1891లో జరిగాయి. చివరి సారిగా 2011లో జనాభా లెక్కల సేకరణ చేపట్టారు. స్వాతంత్ర్య భారత దేశ మొదటి జనాభా లెక్కలు 1951లో నిర్వహించారు. అందువల్ల 1872 నుంచి చూస్తే 2011 జనాభా లెక్కలు 15వది కాగా, స్వాతంత్ర్యం తర్వాత ఏడోది. 1891లో భారత జనాభా 23.6 కోట్లు. 2011 నాటికి భారత జనాభా 121.09 కోట్లు. ఈ మధ్య కాలంలో జనాభా పెరుగుదలలో వచ్చిన మార్పులు, వార్షిక వృద్ధిరేట్లను చదవాల్సి ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక, అత్యల్ప జనాభా  గల దేశాలు, భారత స్థానం, జనసాంద్రత తదితర అంశాలపై ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది. దేశ, రాష్ట్రా జనాభా లెక్కలను సరిపోల్చుతూ చదవాలి. దేశ సగటుతో పోల్చితే తెలంగాణ జనాభా డైనమిక్స్ ఎలా ఉన్నాయో గమనించాలి. ముఖ్యంగా అక్షరాస్యత, లింగ నిష్పత్తి, పిల్లల్లో లింగ నిష్పత్తి, శిశు మరణాల రేటు, మాతృమరణాల రేటు, ప్రసూతి రేటు తదితర అంశాలను చదవాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!